Tuesday, November 19, 2024

వైద్య, ఆరోగ్య శాఖలో విప్లవాత్మక మార్పులు.. పేదలకు మరింత చేరువ కానున్న ప్రభుత్వ వైద్యం

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : వైద్య, ఆరోగ్య శాఖలో విప్లవాత్మక మార్పులకు రాష్ట్ర్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. కొత్తకొత్త ప్రజారోగ్య పథకాలతో పేదలకు నాణ్యమైన వైద్యాన్ని మరింత చేరువ చేసే దిశగా ముందడుగు వేసింది. రాష్ట్ర వైద్య,ఆరోగ్య శాఖ రీ ఆర్గనైజింగ్‌లో భాగంగా 33 జిల్లాలలో డీఎంహెచ్‌వో పోస్టులు మంజూరు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న రీ ఆర్గనైజేషన్‌ ప్రక్రియ చివరి దశకు చేరుకున్నట్లయిందని వైద్య సంఘాల నేతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈమేరకు గురువారం జరిగిన తెలంగాణ మంత్రివర్గ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. మంత్రివర్గ సమావేశం అనంతరం స్వయంగా వైద్య,ఆరోగ్య శాఖ మంత్రి హరీష్‌ రావు ఈ నిర్ణయాలను ప్రకటించారు.

రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లో విస్తరిస్తున్న నగర జనాభాకు అనుగుణంగా మరింత వైద్య సేవలు అందేలా జీహెచ్‌ఎంసి పరిధిలోని 6 జోన్లకు అనుగుణంగా 6 డీఎంహెచ్‌వోలు ఏర్పాటు చేయనున్నారు. దీంతో రాష్ట్రంలో మొత్తం డీఎంహచ్‌వోల సంఖ్య 38కి చేరనుంది. అలాగే, 40 మండలాల్లో కొత్త పీహెచ్‌సిలు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. అర్బన్‌ పిహెచ్‌సిలలో ఇప్పటి వరకు కాంట్రాక్టు ఉద్యోగులు పని చేస్తున్నారు. పర్మినెంట్‌ ఉద్యోగులను తీసుకోవాలని నిర్ణయించారు. కాగా, తెలంగాణ ఏర్పడ్డప్పటి నుంచి రెగ్యులర్‌ డీఎంహెచ్‌వో పోస్టులు ఏర్పాటు చేయాలని వైద్య సంఘాలు ప్రభుత్వాన్ని కోరుతున్నాయి.

- Advertisement -

ప్రభుత్వం తాజాగా తీసుకున్న నిర్ణయంతో వైద్య సంఘాల చిరకాల వాంఛను ప్రభుత్వం నెరవేర్చినట్లయింది. ఇదిలా ఉండగా, డీఎంహెచ్‌వో పోస్టుల పెంపుతో పరిపాలన వికేంద్రీకరణ వేగంగా జరిగి ప్రభుత్వం ప్రవేశపెడతున్న కొత్త ఆరోగ్య పథకాలు వేగంగా అమలయ్యే అవకాశం కలుగుతుందని వైద్య సంఘాల నేతలు అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుతం రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో కంటి వెలుగు, మాతా శిశు సంరక్షణ కేంద్రాలు, న్యూట్రీషన్‌ కిట్లు, కేసీఆర్‌ కిట్లు, ప్రాథమిక, అర్బన్‌ వైద్య కేంద్రాలలో అన్ని రకాల ఉచిత పరీక్షలు, వైద్య చికిత్సలతో పాటు పట్టణ, నగర ప్రాంతాలలో బస్తీ దవాఖానాలు కూడా నడుస్తున్నాయి. కాగా, తాజాగా ప్రభుత్వం వైద్య, ఆరోగ్య శాఖ ప్రకటించిన కొత్త పథకాల కారణంగా ప్రజారోగ్యం పేదలకు మరింత చేరువ కానుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement