ప్రభన్యూస్ : చదువే అసలైన ఆస్తి.. చదువే అసలైన సంపద… భారత దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా ఆంధ్రప్రదేశ్‌లో విద్యారంగంలో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టామని, అమ్మ ఒడి, విద్యాకానుక, దీవెన లాంటి పథకాల ద్వారా నూతన ఒరవడి సృష్టించినట్లు ముఖ్యమంత్రి జగన్ అన్నారు. నిన్న సాయంత్రం అసెంబ్లీలో విద్యారంగంపై చర్చ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ దేశంలోనే ఆదర్శంగా నాడు నేడు పథకం ద్వారా రాష్ట్రంలోని 57 వేల పాఠశాలలను సుమారు 16 వేల కోట్ల వ్యయంతో మూడు దఫాలుగా రూపు రేఖలు మారనున్నాయన్నారు. చదువుకు పేదరికం అడ్డురాకూడదని, హక్కుగా చదువుకోవాలనే వాతావరణం కల్పిస్తున్నామన్నారు. రాష్ట్రంలో ప్రతి విద్యార్ధి చదువుకునే అవకాశం కల్పించామని, ఒకటో తరగతితో బీజం వేస్తే.. 20 ఏళ్ల తర్వాత పోటీ పరీక్షలకు సిద్ధం చేసే ప్రయత్నం చేస్తున్నామని చెప్పారు.
రాష్ట్రంలో తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సుమారు 9వేల ఉపాద్యాయ పోస్టులను భర్తీ చేశామన్నారు. 20 మంది పిల్లలకు ఒక టీచర్‌ను.. అదే విధంగా సబ్జెక్టుల వారీగా టీచర్లను నియమించామని సీఎం తెలిపారు. అమ్మఒడి పథకంలో విద్యార్థుల తల్లులను భాగస్వామ్యం చేశామని చెప్పారు. ఈ పథకానికి రెండు సంవత్సరాలుగా 44.49 లక్షల మందికి 13,023 వేల కోట్లు తల్లుల ఖాతాల్లో జమ చేశామన్నారు.
1వ తరగతి నుంచి డిగ్రీ వరకు పాఠ్యఅంశాల్లో మార్పులుతీసుకొచ్చామని చెప్పారు. వచ్చే ఏడాది నుంచి 9వ తరగతి నుంచి 12వ తరగతి వరకు అమ్మఒడి తీసుకోని విద్యార్థులకు ల్యాప్‌టాప్‌లు అందజేస్తామని తెలిపారు. 2024-25 విద్యా సంవత్సరంకు సీబీఎస్‌ఈలో పదోతరగతి విద్యార్థులు పరీక్షలు రాస్తారన్నారు. గత 20 ఏళ్లుగా ఎయిడెడ్ టీచర్ పోస్టులు భర్తీ చేయటం లేదని అన్నారు. ఎయిడెడ్ సంస్థలకు మంచి చేసేందుకు ఆపన్నహస్తం అందిస్తున్నామని తెలిపారు. ఎయిడెడ్ విద్యాసంస్థలపై విపక్షం దుష్ప్రచారం చేస్తోందని సీఎం జగన్ అన్నారు. విద్యావిధాన్ని బలోపేతం చేయాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. ఎయిడెడ్ విద్యాసంస్థలను ప్రభుత్వం బలవంతపెట్టదని చెప్పారు. నిర్ణయం తీసుకునే అవకాశం ఆయా విద్యాసంస్థలకే ఇచ్చామని తెలిపారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి..
#AndhraPrabha #AndhraPrabhaDigital