Tuesday, November 26, 2024

క్షీణించిన అడవులకు పునర్వైభవం! తెలంగాణలో పెరుగుతున్న అడవుల విస్తీర్ణం

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : క్షీణించిన అడవులకు పునర్వైభవం తీసుకొచ్చేలా అటవీశాఖ ప్రత్యేక కార్యాచరణను రూపొందించింది. సర్కిల్‌ల్లా వారీగా అడువుల పునరుజ్జీవన అభివృద్ధి పనులను చేపడుతున్నారు. అవసరమైన చోట ప్లాంటేషన్లు, నర్సరీలు, ఫారెస్టు రోడ్లు, ఫైర్‌ లైన్లు, వాచ్‌ టవర్లు, బేస్‌ క్యాంపులు, వన్యప్రాణుల సంరక్షణ నీటికుంటలు, గడ్డి మైదానాలు, చెక్‌ డ్యాంలు, రాతి కట్టడాలు, కందకాలను ఏర్పాటు చేస్తున్నారు. ఇందులో భాగంగానే భద్రాద్రి సర్కిల్‌ పరిధిలోని ఖమ్మం, కొత్తగూడెం, మహబూబాబాద్‌ జిల్లాల్లో చేపట్టిన అటవీ పునరుజ్జీవ పనులతో ఆ ప్రాంతాల్లో క్షీణించిన అడువులు పునరుజ్జీవం పోసుకున్నాయి. అటవీ శాఖ తీసుకుంటున్న చర్యల కారణంగా తెలంగాణ రాష్ట్రంలో అడవుల విస్తీర్ణం క్రమంగా పెరుగుతోంది.

భద్రాద్రి సర్కిల్‌ పరిధిలో క్షీణించిన అడవులకు పునర్వైభవం తీసుకురావటంలో భాగంగా ఎన్నో వినూత్న కార్యక్రమాలను అటవీశాఖ చేపట్టింది. ఇందులో భాగంగానే 340 ఫారెస్టు బ్లాకుల్లో 6,29,442 హెక్టార్ల విస్తీర్ణంలోని అటవీ ప్రాంతాలలో పునరుజ్జీవన పనులను చేపట్టారు. 361 కి.మీ. మేర అటవీ సరిహద్దుల వెంబడి కందకాలు తవ్వారు. మొత్తం 8619 బౌండరీ పిల్లర్లను గడిచిన ఐదేళ్లలో ఏర్పాటు చేశారు. 71 కి.మీ మేర అటవీ సరిహద్దుల వెంబడి ఇనుపకంచెలను ఏర్పాటు చేశారు. 9.3 కి.మీ.మేర అర్బన్‌ ఫారెస్ట్‌ బ్లాక్‌ల సరిహద్దుల వెంబడి రక్షణ గోడలను నిర్మించారు. 819 కి.మీ.మేర అటవీ సరిహద్దు కందకాలపైన గచ్చకాయ ప్లాంటేషన్లను చేపట్టారు.

- Advertisement -

అటవీ ప్రాంతాల్లో జలసంరక్షణ చర్యలలో భాగంగా 5214 రాతికట్టడాలను, 388 నీటికుంటలు, 88 చిన్న నీటి కుంటలు, 314 చెక్‌ డ్యాంలు, 29 వాచ్‌ టవర్లను నిర్మించారు. అడవుల్లో అటవీ అధికారులు స్వేచ్ఛగా తిరిగేందుకు వీలుగా 369 కి.మీ.మేర ఫారెస్ట్‌ రోడ్లను గడిచిన ఐదేళ్ల కాలంలో నిర్మించారు. అటవీ ప్రంతాల్లో సిబ్బంది నివాసం కోసం 55 గృహాలను నిర్మించారు. అడవులలో మంటలు నివారణ కోసం 3773 కి.మీ. మేర ఫైర్‌ లైన్లను ఏర్పాటు చేశారు. క్షీణించిన అటవీ ప్రాంతాలల్లో 14,012 హెక్టార్లలో ప్రాలంటేషన్లను పెంచారు. 469 హెక్టార్ల విస్తీర్ణంలో గడ్డి మైదానాలను ఏర్పాటు చేశారు. అడవిలో వాగుల వెంబడి 740 కి.మీ.మేర వెదురు ప్లాంటేషన్లను పెంచారు. క్షీణించిన అటవీ ప్రాంతాలలో 43,980 హెక్టార్లలో అటవీ పునరుజ్జీవన చర్యలను సైతం చేపట్టారు. స్థానిక వృక్ష గడ్డి జాతుల సంరక్షణకోసం 2239 హెక్టార్లలో కలుపు మొక్కలను తొలగించారు.

భద్రాద్రి సర్కిల్‌ పరిధిలో చేపట్టిన అటవీ పునర్జీవన చర్యలతో మొత్తం 340 ఫారెస్ట్‌ బ్లాకులకు గానూ 52 బ్లాకుల్లో 100 శాతం, 38 బ్లాకుల్లో 80 నుంచి 99 శాతం, 59 ఫారెస్టు బ్లాకుల్లో 60 నుంచి 79 శాతం, 51 ఫారెస్ట్‌ బ్లాకుల్లో 40 నుంచి 59 శాతం, 34 ఫారెస్ట్‌ బ్లాకుల్లో 40 శాతం కంటే తక్కువ విస్తీర్ణంలో అడవులు పునరుజ్జీవనం పొంది కొత్త జీవకళను సంతరించుకున్నాయి. ఫారెస్ట్‌ సర్వే ఆఫ్‌ ఇండియా అడవుల స్థితిగతుల మీద ఇటీవల విడుదల చేసిన గణాంకాల ప్రకారం తెలంగాణ రాష్ట్రంలో 632 చ.కి.మీ.మేర అటవీ విస్తీర్ణం పెరిగింది. దేశంలోనే ఇది రెండవ అతిపెద్ద పెరుగుదల అటవీ విస్తీర్ణం. ఈ పెరుగుదల 2019-2021 మధ్యకాలంలో జరిగింది. ఇందులో సింహభాగం భద్రాద్రి సర్కిల్‌కే చెందుతుంది. ఖమ్మం, కొత్తగూడెం, మహబూబాబాద్‌ జిల్లాలో చేపట్టిన అటవీ పునరుజ్జీవన పనులను కాంపా ప్రధాన అటవీ ముఖ్య అటవీ సంరక్షణ అధికారి లోకేష్‌ జైస్వాల్‌ గురువారం పరిశీలించారు. గత మూడు రోజులుగా అటవీ ప్రాంతాల్లో ఆయన విస్తృతంగా పర్యటించి అడవుల అభివృద్ధి, వన్యప్రాణుల సంరక్షణ కోసం సిబ్బందకి సలహాలు, సూచనలు చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement