Thursday, November 21, 2024

Revenge – క‌థువా ఉగ్ర‌దాడికి ప్ర‌తికారం త‌ప్ప‌దు….

కశ్మీర్ లో దాడిలో అమ‌రులైన‌ అయిదుగురు జ‌వాన్లు
జ‌వాన్లు మ‌ర‌ణాల‌కు గట్టిగానే బ‌దులిస్తామ‌న్న ర‌క్ష‌ణ శాఖ

కథువా ఉగ్ర దాడిలో అమరులైన జవాన్ల ఘటనకు ప్రతీకారం తీర్చుకుంటామని రక్షణ శాఖ కార్యదర్శి గిరిధర్ అరామనె స్పష్టం చేశారు. జవాన్ల ప్రాణత్యాగాన్ని దేశం గుర్తుంచుకుంటుందని చెప్పారు. అమర జవాన్ల కుటుంబాలకు ఆయన సంతాపం తెలిపారు. ఈమేరకు మంగళవారం గిరిధర్ మీడియాతో మాట్లాడుతూ.. ఉగ్రవాదులకు దీటుగా జవాబిస్తామని తేల్చిచెప్పారు. ‘కథువాలో ఆర్మీ కాన్వాయ్ పై ఉగ్రవాదులు జరిపిన దాడిలో ఐదుగురు వీర జవాన్లు అమరులు కావడం విచారకరం. వారి మరణానికి ఆర్మీ తప్పకుండా ప్రతీకారం తీర్చుకుంటుంది. ఉగ్రవాదులకు గట్టిగా జవాబిస్తాం’ అంటూ ట్వీట్ చేశారు.

కాగా, సోమ‌వారం నాడు జమ్మూకశ్మీర్ లోని కథువాలో ఆర్మీ కాన్వాయ్ పై ఉగ్రవాదులు దాడి చేశారు. తొలుత కాన్వాయ్ పైకి గ్రనేడ్ విసిరిన ఉగ్రవాదులు.. వాహనాలలో నుంచి కిందికి దిగిన సైనికులపై కాల్పులు జరిపారు. దీంతో ఓ జూనియర్ కమిషన్డ్ ఆఫీసర్ (జేసీవో) సహా ఐదుగురు సైనికులు వీరమరణం పొందారు. ఆపై ఉగ్రవాదులు దగ్గర్లోని అడవిలోకి పారిపోయారు.
ఈ దాడి తమ పనేనని పాక్ ప్రేరేపిత కశ్మీర్ టైగర్స్ అనే మిలిటెంట్ గ్రూప్ ప్రకటించుకుంది. ఇటీవలి కాలంలో జమ్మూకశ్మీర్ లో ఉగ్ర దాడులు పెరుగుతున్నాయి. గడిచిన రెండు రోజుల్లోనే సైన్యంపై ఉగ్రవాదులు రెండుసార్లు దాడి చేశారు. కుల్గాంలో శనివారం జరిగిన రెండు ఎన్ కౌంటర్లలో భారత సైన్యం ఇద్దరు జవాన్లను కోల్పోయింది. ఈ ఎదురుకాల్పుల్లో మొత్తం ఆరుగురు టెర్రరిస్టులను సైన్యం మట్టుబెట్టింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement