హైదరాబాద్, ఆంధ్రప్రభ బ్యూరో : రాష్ట్రానికి భారీ పెట్టుబడులే లక్ష్యంగా ఎనిమిది రోజుల పాటు అమెరికాలోని వివిధ రాష్ట్రాల్లో పర్యటించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బృందం శనివారం కాలిఫోర్నియాలోని శాన్‌ఫ్రాన్సిర్కో నుంచి దక్షణ కొరియా పర్యటనకు బయలుదేరింది.
నాలుగు రోజుల పాటు కొరాయాలో పర్యటించనున్న ఈ బృందం ఆ దేశంలోని దిగ్గజ సంస్థలతో వరుస భేటీలు నిర్వహించనుంది. తొలిరోజు ఉదయం యూయూ ఫార్మా ప్రతినిధులతో సామావేశమై తెలంగాణాలో పెట్టుబడుల అంశంపై చర్చించనుంది. ఆ తర్వాత కొరియా ఫెడరేషన్ ఆఫ్ టెక్స్‌టైల్ ఇండస్ట్రీ ప్రతినిధులతో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించనుంది.
హూండేయ్ మోటార్ సంస్థకు చెందిన సీనియర్ అధికారులతో సమావేశం నిర్వహించి చర్చలు జరపనుంది. వాటర్ సర్క్యులేషన్ డైరెక్టర్ జనరల్‌తో సమావేశం అనంతరం కొరియా హెరాల్డ్‌తో భేటీ ఎంటుందని సీఎం కార్యాలయ వర్గాలు వెల్లడించాయి. రెండోరోజు మంగళవారం రేవంత్ బృందం హ్యాన్ రివర్ ప్రాజెక్టు డిప్యూటీ మేయర్‌తో సమావేశం కానుంది.
ఆ తర్వాత కొరియా బ్యూటీ ట్రేడ్ అసోసియేషన్ ప్రతినిధులతో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించనున్నారు. సామ్‌సంగ్ ప్రెసిడెంట్ జేబ్ల్యూ కిమ్, ఎల్‌జీ ఎలక్ట్రానిక్స్, సెల్‌ట్రాన్ సంస్థల అధినేతలతో రేవంత్ బృందం వరుస భేటీలు నిర్వహించనుంది. అదే రోజు హ్యాన్ రివర్ పార్క్ టూర్ నిర్వహించి స్థానికంగా రివర్ ఫ్రంట్ ఏరియాను సందర్శించనుంది.
మూడు రోజుల పాటు దక్షిణ కొరియా పర్యటన అనంతరం సింగపూర్ మీదుగా ఈ బృందం హైదరాబాద్ బయలుదేరనుంది. ఈ నెల 14న బుధవారం ఉదయం 10.50 గంటలకు సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రతినిధి బృందం తెలంగాణాకు చేరుకోనుంది.