Friday, October 18, 2024

టీఆర్ఎస్ పేరు మార్పుపై హైకోర్టుకు రేవంత్ రెడ్డి.. అభ్యంతరాలు పరిగణలోకి తీసుకోలేదని పిటిషన్

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) పేరును భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) గా మార్చేందుకు కేంద్ర ఎన్నికల సంఘం ఇచ్చిన అనుమతిని తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి తప్పుబట్టారు. ఈ మేరకు ఆయన ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించగా.. సోమవారం విచారణ జరిపిన ధర్మాసనం కేసును తోసిపుచ్చింది. కేంద్ర ఎన్నికల సంఘాన్ని ఆశ్రయించాల్సిందిగా పిటిషనర్‌కు సూచించింది. అయితే తన అభ్యంతరాన్ని పరిగణలోకి తీసుకోకుండా కేంద్ర ఎన్నికల సంఘం టీఆర్ఎస్ పేరును బీఆర్ఎస్‌గా మారుస్తూ నోటిఫికేషన్ ఇచ్చిందని, ఇది చట్ట విరుద్ధమని రేవంత్ రెడ్డి తెలిపారు.

ఈ మేరకు ఆయన ఒక ప్రకటన విడుదల చేయడంతో పాటు ట్విట్టర్‌లోనూ పోస్టు చేశారు. గతంలో ‘బంగారు కూలీ’ పేరుతో టీఆర్ఎస్ పార్టీ సేకరించిన విరాళాలు, నిధుల సేకరణపై తాను కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేయగా.. ఈ అంశంపై విచారణ జరపాల్సిందిగా సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్ (సీబీడీటీ)కి ఈసీ లేఖ రాసిందని గుర్తుచేశారు. ఈ అంశంపై ఆదాయపు పన్ను శాఖ విచారణ పెండింగులో ఉండగానే టీఆర్ఎస్ పేరును బీఆర్ఎస్‌గా మార్చేందుకు ఆ పార్టీ దరఖాస్తు చేసుకుందని, ఈ క్రమంలో అభ్యంతరాలు ఉంటే డిసెంబర్ 6లోగా తమ దృష్టికి తీసుకురావాల్సిందిగా ఎన్నికల సంఘం ఉత్తర్వులు ఇచ్చిందని తెలిపారు.

ఈ క్రమంలో తాను టీఆర్ఎస్‌పై గతంలో ఇచ్చిన ఫిర్యాదును గుర్తుచేస్తూ అభ్యంతరం వ్యక్తం చేశానని, అయినప్పటికీ ఈసీ పట్టించుకోకుండా పేరు మార్పునకు అనుమతి ఇచ్చిందని ఆయన మండిపడ్డారు. కాంగ్రెస్ అభ్యంతరాన్ని పరిగణలోకి తీసుకోకపోవడం అనుమానాలకు తావిస్తోందని రేవంత్ రెడ్డి ట్వీట్ చేశారు. దీన్ని బట్టి కేంద్ర ఎన్నికల సంఘం స్వతంత్రంగా ఉందా లేక కేంద్రం గుప్పిట్లో ఉందా అంటూ ఆయన పోస్టులో పేర్కొన్నారు. 

Advertisement

తాజా వార్తలు

Advertisement