ఉమ్మడి వరంగల్, ప్రభన్యూస్ బ్యూరో: రాష్ట్రంలో కేసీఆర్ కుటుంబ పాలనను అంతం చేసి సంక్షేమ పాలనను తీసుకొచ్చేందుకోసం ఏఐసీసీ ఆదేశాలతో టీపీసీసీ అధ్యక్షుడు ఎనుముల రేవంత్‌రెడ్డి చేపట్టిన హాత్ సే హాత్ జోడో అభియాన్ యాత్ర బుధవారం నుంచి ఉమ్మడి జిల్లాలో ప్రారంభమవుతున్నది. ఫిబ్రవరి 6న హాత్ సే హాత్ జోడో యాత్రను రేవంత్‌రెడ్డి ఉమ్మడి వరంగల్ జిల్లాలోని ములుగు జిల్లా సమ్మక్క, సారలమ్మ తాడ్వాయి మండలం మేడారంలోని వనదేవతలైన సమ్మక్క, సారలమ్మ సన్నిధానంలో ప్రత్యేక పూజలు నిర్వహించి యాత్రను ప్రారంభించిన విషయం తెలిసిందే. ఫిబ్రవరి 6న మొదలైన యాత్ర రెండు రోజులపాటు ములుగు జిల్లాలో మరో రెండు రోజుల పాటు సాగింది. మూడవ రోజున వరంగల్ జిల్లా నర్సంపేట నియోజకవర్గంలో యాత్ర జరగాల్సి ఉండగా ఆ నియోజకవర్గ ఇన్చార్జ్, మాజీ ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి రేవంత్‌రెడ్డి యాత్రకు సహకరించకపోవడంతో నర్సంపేట నియోజకవర్గంలో రద్దుచేసుకొని నేరుగా మహబూబాబాద్ జిల్లాకు చేరుకున్నారు.
మహబూబాబాద్ జిల్లాలోని మహబూబాబాబ్, డోర్నకల్ నియోజకవర్గ కేంద్రాల్లో యాత్ర జరిగింది. ఫిబ్రవరి 10న ఖమ్మం జిల్లాలోకి ప్రవేశించి ఐదు రోజుల పాటు ఖమ్మం, కొత్తగూడ జిల్లాల్లో యాత్ర ని ర్వహించారు. తిరిగి బుధవారం నుంచి ఉమ్మడివరంగల్ జిల్లాలో ప్రారంభిస్తున్నారు. 16న వరంగల్ జిల్లా వర్దన్నపేట నియోజకర్గం, 17న జనగామ జిల్లా స్టేషన్‌ఘన్‌పూర్ నియోజకవర్గం లో రేవంత్‌రెడ్డి యాత్ర కొనసాగనున్నది. 18, 19వ తేదిల్లో మహాశివరాత్రి పర్వదినం పురస్కరించుకొని రెండు రోజుల పాటు జోడో యాత్రకు విరామాన్ని ప్రకటించారు. తిరిగి 20న హనుమకొండ జిల్లాలోని వరంగల్ పశ్చిమ నియోజకవర్గం, వరంగల్ జిల్లాలోని తూర్పు నియోజకవర్గంలో యాత్రను నిర్వహిస్తున్నారు.
21, 22వ తేదిల్లో భూపాలపల్లి జిల్లాలోని భూపాలపల్లి నియోజకవర్గం యాత్ర కొనసాగనున్నది. ఫిబ్రవరి 23, 24, 25, 26వ తేదిల్లో రాయ్‌పూర్ చత్తీస్‌గఢ్‌లో కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్లీనరి సమావేశాలు ఉండటంతో నాలుగు రోజులపాటు జోడో యాత్రను నిలిపివేస్తున్నారు. నాలగు రోజులు జాతీయ ప్లీనరి సమావేశాల్లో రేవంత్‌రెడ్డి పాల్గొంటారు. తిరిగి 27న హనుమకొండ జిల్లా పరకాల నియోజకవర్గంలో పాదయాత్ర నిర్వహించే విధంగా యాత్ర షెడ్యూల్‌ను ప్రకటించారు. మొత్తంగా ఉమ్మడి జిల్లాలోని నర్సంపేట నియోజకవర్గం మినహాయించి మిగిలిన 11 నియోజకవర్గాల్లో యాత్రను నిర్వహించేందుకు యాత్రను చేపడుతున్నారు.