Saturday, November 23, 2024

రేపటి నుంచి వరంగల్‌ పశ్చిమలో రేవంత్‌రెడ్డి యాత్ర..

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : టీ పీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డి చేపట్టిన హాత్‌ సే హాత్‌ జోడో అభియాన్‌ పాదయాత్ర తిరిగి సోమవారం నుంచి ప్రారంభం కానుంది. ‘ మార్పు కోసం యాత ‘ పేరుతో ఈ నెల 6న ములుగు జిల్లా సమ్మక్క- సారక్క ఆలయం నుంచి పాదయాత్ర ప్రారంభించగా, మహబబూబాద్‌ పార్లమెంట్‌ నియోజక వర్గంలోని ఏడు అసెంబ్లి నియోజక వర్గాల్లో పాదయాత్ర పూర్తి చేసి వరంగల్‌ పార్లమెంట్‌ పరిధిలోని పాలకుర్తి, జనగామ, స్టేషన్‌ఘన్‌పూర్‌ నియోజక వర్గాల్లో శుక్రవారం వరకు పాదయాత్ర చేపట్టారు. శివరాత్రి పర్వదినం సందర్భంగా పాదయాత్రకు రెండు రోజులు విరామం ఇచ్చారు. తిరిగి సోమవారం నుంచి వరంగల్‌ పశ్చిమ అసెంబ్లి నియోజక వర్గంలో యాత్రను మొదలు పెట్టనున్నారు. అయితే పాదయాత్ర సమయంలోనూ రేవంత్‌రెడ్డి మార్పులు చేశారు. ఉదయం కాకుండా సాయంత్రం యాత్ర చేపట్టాలని నిర్ణయించారు. సాయంత్రం నాలుగు గంటల నుంచి రాత్రి తొమ్మిది గంటల వరకు యాత్రతో పాటు కార్నర్‌ మీటింగ్‌లు ఉండేలా కార్యాచరణ రూపొందిస్తున్నారు.

సీఎల్పీ నేత భట్టి విక్రమార్క కూడా పాదయాత్ర చేసేందుకు కార్యాచరణ రూపొందిస్తున్నారు. అదిలాబాద్‌ నుంచి ఖమ్మం వరకు యాత్ర చేయాలనే ఆలోచనతో ఉన్నట్లుగా ఆయన సన్నిహితులు చెబుతున్నారు. రేవంత్‌రెడ్డి వెళ్లని నియోజక వర్గాలను టచ్‌ చేయాలనే ఆలోచనతో ఉన్నారు. పార్టీలోని కొందరు సీనియర్లు భట్టి యాత్రకు పూర్తిగా మద్దతు నిలవాలని నిర్ణయానికి వచ్చారు. అయితే టీ పీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డి చేస్తున్న యాత్రకు పోటీ యాత్ర కాదని, సమన్వయంతోనే యాత్రలు చేయనున్నట్లు చెబుతున్నారు. ఇక టీ పీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, ఎమ్మెల్యే జగ్గారెడ్డి కూడా సంగారెడ్డి నియోజక వర్గంలో మార్చిలో యాత్ర చేయాలని నిర్ణయం తీసుకున్నారు.

అంబర్‌పేటలో యాత్రను ప్రారంభించిన వీహెచ్‌..

కాగా, సికింద్రాబాద్‌ పార్లమెంట్‌ పరిధిలోని అంబర్‌పేట అసెంబ్లి నియోజక వర్గంలో టీ పీసీసీ ప్రధాన కార్యదర్శి లక్ష్మణ్‌ యాదవ్‌ ఆధ్యరంలో చేపట్టిన హాత్‌ సే హాత్‌ జోడో అభియాన్‌ పాదయాత్రను పీసీసీ మాజీ అధ్యక్షుడు వి. హనుమంతరావు ఆదివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజల్లోకి బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. దేశంలో బీజేపీకి, రాష్ట్రంలో బీఆర్‌ఎస్‌ పార్టీలకు కాంగ్రెస్‌ పార్టీనే ప్రత్యామ్నాయని, రాష్ట్ర ప్రజలు కాంగ్రెస్‌ వైపు చూస్తున్నారని ఆయన తెలిపారు. అంబర్‌పేట నియోజక వర్గం నుంచి తాను పోటి చేయనని మీడియా అడిగిన ప్రశ్నకు సమాధానమిచ్చారు. గత ఎన్నికల్లో పార్టీ అభ్యర్థిగా లక్ష్మణ్‌యాదవ్‌కు బీ ‘ ఫామ్‌ ఇచ్చినప్పటికి, పొత్తులో భాగంగా పార్టీ నిర్ణయం మేరకు విత్‌ డ్రా చేసుకోవడం జరిగిందన్నారు. వచ్చే ఎన్నికల్లో కూడా లక్ష్మణ్‌ యాదవే బరిలో ఉంటారని ఆయన వెల్లడించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement