Tuesday, November 26, 2024

Delhi | నిజాముద్దీన్ దర్గాను దర్శించిన రేవంత్ రెడ్డి.. అజారుద్దీన్‌తో కలిసి ప్రత్యేక ప్రార్థనలు

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: అభ్యర్థుల ఎంపిక కసరత్తులో భాగంగా ఢిల్లీలో ఉన్న టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి ఆదివారం సాయంత్రం ఢిల్లీలోని హజ్రత్ నిజాముద్దీన్ దర్గాను సందర్శించుకున్నారు. మాజీ క్రికెటర్, కాంగ్రెస్ నేత మహ్మద్ అజారుద్దీన్‌తో కలిసి దర్గాకు చాదర్ సమర్పించిన రేవంత్, అనంతరం జరిగిన ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్నారు. అనంతరం అక్కడ మీడియాతో మాట్లాడుతూ.. రానున్న ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో ఒక సెక్యులర్ ప్రభుత్వం ఏర్పాటుకావాలన్న ఉద్దేశంతో తాను దర్గాను సందర్శించానని చెప్పారు.

నిజాముద్దీన్ దర్గాలో ఏది కోరుకుంటే అది జరుగుతుందని, ఐదు రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీని గెలిపించడం ద్వారా ప్రజలకు సంక్షేమం, అభివృద్ధి అందుతాయని రేవంత్ అన్నారు. దేశంలో హిందువులు, ముస్లింలు సఖ్యతతో కలిసుండాలని, మత సామరస్యాన్ని కాపాడే కాంగ్రెస్ పాలన రావాలని కోరుకున్నారు. తెలంగాణలో జరుగుతున్న పరిణామాలు ప్రజలకు మేలు చేసేలా లేవన్నారు. అక్కడ ప్రభుత్వం మారడమే మేలని ప్రజలు భావిస్తున్నారని చెప్పారు. తప్పకుండా తెలంగాణ ప్రజలకు మేలు జరుగుతుందని, సందర్భం వచ్చినప్పుడల్లా దర్గాకు వస్తానని చెప్పారు. 

Advertisement

తాజా వార్తలు

Advertisement