Tuesday, November 26, 2024

రేవంత్‌రెడ్డి పాదయాత్ర షెడ్యూల్‌ విడుదల.. ఎల్లుండి ఉదయం మేడారంలో ప్రత్యేక పూజలు

ఉమ్మడి వరంగల్‌, ప్రభన్యూస్‌ బ్యూరో: రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చే లక్ష్యంతో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి తలపెట్టిన హాత్‌ సే హాత్‌ జోడో పాదయాత్ర మొదటి రెండు రోజుల షెడ్యూల్‌ను ములుగు ఎమ్మెల్యే సీతక్క వెల్లడించారు. 6న ఉదయం 11 గంటలకు ములుగు జిల్లా సమ్మక్క, సారలమ్మ తాడ్వాయి మండలం మేడారం గ్రామానికి రేవంత్‌రెడ్డి చేరుకుంటారు. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు సమ్మక్క, సారలమ్మ సన్నిధానంలో ప్రత్యేక పూజలు నిర్వహించి అమ్మవార్లను దర్శించుకుంటారు. మధ్యాహ్నం 1 గంటకు మేడారం గుడి నుంచి పాదయాత్ర బయలుదేరి తాడ్వాయి మండలంలోని కొత్తూరు, నార్లాపూర్‌, వెంగ లాపూర్‌ గ్రామాల మీదుగా గోవిందరావువేట మండలంలోని ప్రాజెక్టు నగర్‌ గ్రామానికి మధ్యాహ్నం 2 గంటల వరకు చేరుకుంటుందని సీతక్క తెలిపారు.

అదే రోజు 2నుంచి 2.30 గంటలకు ప్రాజెక్టు నగర్‌లోనే భోజన విరామం. అనంతరం 2.30 గంటలకు ప్రాజెక్టు నగర్‌ నుంచి బయలుదేరి పాదయాత్ర సాయంత్రం 4.30 గంటలవరకు పస్రా గ్రామానికి చేరుకుంటుంది. 4.30 నుంచి 5గంటల వరకు టీ విరామం ఉంటుంది. 5 గంటల నుంచి 6 గంటల వరకు పస్రా జంక్షన్‌లో కార్నర్‌ మీటింగ్‌ నిర్వహిస్తారు. సాయంత్రం 6 గంటలకు పస్రా గ్రామం నుంచి గోవిందరావుపేట, చల్వాయి, మచ్చాపూర్‌ మీదుగా వెంకటాపూర్‌ మండలంలోని జవహర్‌నగర్‌, జంగాలపల్లి క్రాస్‌, ఇంచర్ల, వెంకటాపూర్‌ క్రాస్‌రోడ్‌ మీదుగా పాలంపేటకు చేరుకుని రాత్రి అక్కడే బస చేస్తారని సీతక్క తెలిపారు.

7న ఉదయం 8 గంటలకు పాలంపేట రామప్ప దేవాలయంలో శ్రీ రామలింగేశ్వరస్వామిని దర్శించుకొని ప్రత్యేక పూజలను నిర్వహిస్తారని తెలిపారు. ఉదయం 8.30 గంటలకు పాలంపేట గ్రామం నుంచి బయలుదేరి రామంజపురం, చెంచుకాలనీ, నారాయణగిరిపల్లె మీదుగా బుద్దారం గ్రామానికి మధ్యాహ్నం 1.30 వరకు చేరుకుంటారు. మధ్యాహ్నం 1.30 నుంచి 2 గంటల వరకు భోజన విరామం ఉంటుంది. మధ్యాహ్నం 3 గంటలకు బయలుదేరి బుద్దారం గ్రామం నుంచి కేశవాపూర్‌, నర్సాపూర్‌, బండారు పల్లి మీదుగా సాయంత్రం 6 గంటలవరకు ములుగు జిల్లా కేంద్రానికి చేరుకుంటారు. సాయంత్రం 6 నుంచి రాత్రి 8 గంటలకు జిల్లాకేంద్రంలోని గాంధీ పార్క్‌ వద్ద కార్నర్‌ మీటింగు ఉంటుందని సీతక్క తెలిపారు. రేవంత్‌రెడ్డి పాదయాత్రకు అనుమతి ఇవ్వడంతోపాటు బందోబస్తు కల్పించాలంటూ ఎమ్మెల్యే సీతక్క ములుగు ఎస్పీ గౌస్‌ఆలంను కోరారు. పాదయాత్రకు షెడ్యూల్‌కు సంబంధించినటువంటి వివరాలను అందించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement