Saturday, November 23, 2024

Delhi | చచ్చేముందు పార్టీ మారడానికి సిగ్గుండాలి.. పొన్నాల రాజీనామాపై రేవంత్ రెడ్డి

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: తెలంగాణ పీసీసీ మాజీ అధ్యక్షులు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య పార్టీకి రాజీనామా చేయడంపై పీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి తీవ్రంగా స్పందించారు. ఈ వయస్సులో పార్టీ మారడానికి సిగ్గుండాలి అంటూ వ్యాఖ్యానించారు. పీసీసీ అధ్యక్షులుగా పనిచేసి పార్టీ వీడిన నేతలు డీ. శ్రీనివాస్, కేశవ రావు, బొత్స సత్యనారాయణ పేర్లను గుర్తుచేస్తూ.. వెళ్లేవారు వెళ్తూనే ఉంటారని, అలాంటివారు ఏదైనా చెబుతారని రేవంత్ అన్నారు.

ఆ తర్వాత కాస్త ఆగ్రహానికి గురైన రేవంత్.. “40 ఏళ్లు పదవులు అనుభవించి చచ్చే ముందు పార్టీ మారడానికి సిగ్గుండాలి. పీసీసీ అధ్యక్షుడిగా ఓసారి, ఆ తర్వాత మరోసారి టికెట్ ఇస్తే ఓడిపోయారు. పొన్నాల లక్ష్మయ్యను ఎవరైనా గుర్తుపడుతున్నారంటే అది కాంగ్రెస్ పార్టీ దయ. ఇంతకాలం పెంచి పోషించిన కన్నతల్లి లాంటి పార్టీని దూషించి పక్క పార్టీలోకి పోవడానికి ఏం రోగం?” అంటూ పరుష పదజాలంతో తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

- Advertisement -

81 ఏళ్ల వయస్సులో పార్టీ మారడమే బుద్ధిలేని పని అన్న రేవంత్, ఇంకా కుర్చీ పట్టుకుని వేలాడుతూ.. టికెట్ కావాలని తిరుగుతున్నారని మండిపడ్డారు. అభ్యర్థుల ఎంపిక కోసం తాము పంపిన పేర్లలో రెండు పేర్లు పంపామని, వాటిపై ఇంకా ఎలాంటి నిర్ణయం జరగలేదని, కానీ అప్పుడే పార్టీకి రాజీనామా ఎందుకు చేశారో చెప్పాలని అన్నారు.

ఆయన ఏ పార్టీలో చేరతారో తనకు తెలియదని, కానీ పార్టీని ఈ సందర్భంలో వీడి వెళ్లడమే అతి పెద్ద నేరం అని దుయ్యబట్టారు. ఎన్నికల్లో పార్టీని దెబ్బతీయడానికి, పలుచన చేయడానికి ఆయన ఇలా చేశారని నిందించారు. తెలంగాణ ప్రజలకు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు క్షమాపణ చెప్పి రాజీనామా ఉపసంహరించుకుంటే గౌరవం మిగులుతుందని అన్నారు. రాజీనామా ఉపసంహరించుకోవాల్సిందిగా డిమాండ్ చేస్తున్నానని రేవంత్ రెడ్డి అన్నారు.

పోతే పోనీ.. పట్టించుకోవాల్సిన అవసరం లేదు- మురళీధరన్

నేతలు పార్టీని వీడితే వచ్చే నష్టమేమీ లేదని, కొత్తగా చాలా మంది నేతలు వచ్చి చేరుతున్నారని స్క్రీనింగ్ కమిటీ కమిటీ ఛైర్మన్, ఎంపీ కే. మురళీధరన్ స్పందించారు. శుక్రవారం ఏఐసీసీలో జరిగిన కాంగ్రెస్ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ సమావేశం అనంతరం మీడియాతో మాట్లాడుతున్న సమయంలో పొన్నాల లక్ష్మయ్య రాజీనామాపై ప్రశ్నించగా.. పార్టీ అభ్యర్థుల జాబితా ఇంకా ప్రకటించనే లేదు.. అప్పుడే ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటే ఎలా అన్న రీతిలో స్పందించారు.

పార్టీలోకి కొత్తగా చాలా మంది నేతలు చేరుతున్నారని, పార్టీని వీడి వెళ్లేవారితో వచ్చిన నష్టం ఏమీ లేదని అన్నారు. పొన్నాల రాజీనామా గురించి పట్టించుకోవాల్సిన అవసరమే లేదన్నారు. పార్టీలో ఎవరూ అవమానానికి గురికావడం లేదని మరో ప్రశ్నకు బదులిచ్చారు. 

Advertisement

తాజా వార్తలు

Advertisement