తెలంగాణ ఉద్యమం గురించి, తెలంగాణ అవతరణ, కేసీఆర్ గురించి మాట్లాడే అర్హత సీఎం రేవంత్ రెడ్డికి లేదని, ఆయనో జాక్ పాట్ ముఖ్యమంత్రి అని బీఆర్ ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. బీఆర్‌ఎస్ ఆధ్వర్యంలో రాష్ట్ర ఆవిర్భావ దశాబ్ది వేడుకలు తెలంగాణ భవన్‌లో ఘనంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా తెలంగాణ భవన్‌లో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జాతీయ జెండాను, బీఆర్‌ఎస్ పార్టీ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రేవంత్ రెడ్డికి తెలంగాణ చరిత్రపై కనీస అవగాహన, పరిపక్వత లేదని విమర్శించారు.
తెలంగాణలో దశాబ్ది వేడుకలను ఒక్క రోజుకే పరిమితం చేశారని, తాము ప్రభుత్వంలో ఉంటే నెలరోజులు నిర్వహించేవాళ్లమని చెప్పారు. తెలంగాణ గురించి గానీ, తెలంగాణ ఏర్పాటులో ఉన్న త్యాగాల గురించి గానీ, జై తెలంగాణ అని ఒక్క మాట పలుకలేని మూర్ఖుడు రేవంత్ అన్నారు. సీఎం రేవంత్ జాక్‌పాట్ ముఖ్యమంత్రి అని, ఏదో అదృష్టవశాత్తు సీఎం అయ్యాడని ఎద్దేవా చేశారు. తెలంగాణ ప్రజలందరికి రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.