Friday, November 22, 2024

విజయమ్మ ఆత్మీయ సభపై రేవంత్ ఆసక్తికర వ్యాఖ్య

దివంగత నేత వైఎస్ఆర్ జయంతి సందర్భంగా ఆయన సతీమణి వైఎస్ విజయలక్ష్మి నిర్వహిస్తున్న ఆత్మీయ సమ్మేళంపై టీ.పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. విజయమ్మ నిర్వహిస్తున్న ఆత్మీయ సమ్మేళం వాళ్ల ఫ్యామిలీదని అన్నారు. రాజకీయ ప్రాధాన్యం లేదని విజయలక్ష్మి చెప్పినట్లు పేర్కొన్నారు. ఆత్మీయ సమ్మేళనం ఇప్పుడు ఎందుకు నిర్వహిస్తున్నారని ప్రశ్నించారు. జగన్ ఎందుకు రావడం లేదో వైఎస్ విజయలక్ష్మి చెప్పాలని రేవంత్ డిమాండ్ చేశారు.

కాగా, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ దివంగత సీఎం వైఎస్‌ రాజశేఖరరెడ్డి 12వ వర్ధంతి సందర్భంగా ఆయన సంస్మరణ సభను గురువారం వైఎస్‌ విజయమ్మ ఆధ్వర్యంలో హైదరాబాద్‌లో హైటెక్స్‌లో నిర్వహించనున్నారు. వైఎస్సార్‌ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల సభను సమన్వయం చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం. వైఎస్‌తో సన్నిహితంగా మెలిగినవారు, ఆయన హయాంలో మంత్రిమండలిలోనూ, కాంగ్రెస్‌ పార్టీలో పనిచేసిన వారిని విజయమ్మ ఆహ్వానించారు.

ఉమ్మడి శాసనమండలి మాజీ ఛైర్మన్‌ చక్రపాణి తోపాటు, ఉమ్మడి ఏపీలో స్పీకర్‌గా పనిచేసిన సురేష్ రెడ్డి, పీసీసీ మాజీ అధ్యక్షుడు డీఎస్‌తో పాటు మాజీ ఎంపీలు కేవీపీ రామచంద్రరావు, ఉండవల్లి అరుణ్‌ కుమార్‌, ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ, తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్‌ రెడ్డి తదితర నేతలకు ఆహ్వానాలు అందాయి. అయితే ప్రస్తుత రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో వైసీపీ నేతలు ఈ సభకు వెళ్లరాదని ఆ పార్టీ నిర్ణయించినట్లు సమాచారం.

మరోవైపు తెలంగాణలోని టీఆర్ఎస్, కాంగ్రెస్‌, బీజేపీ పార్టీల్లో ఉన్న నేతలు.. గతంలో వైఎస్‌తో పనిచేసిన వారిని సుమారు 350 మంది వరకు ఆహ్వానించారు. అయితే ఈ సంస్మరణ సభకు ఎవరెవరు హాజరవుతారు..ఎవరు డుమ్మా కొడతారన్న దానిపైనే సస్పెన్స్‌ నెలకొంది.

- Advertisement -

ఇది కూడా చదవండి: జన హృదయ విజేత.. నేడు వైఎస్ వర్ధంతి!

Advertisement

తాజా వార్తలు

Advertisement