మహబూబ్‌నగర్, ప్రభన్యూస్: నిరుద్యోగుల జీవితాలో చెలగాటం ఆడుతున్న కేసీఆర్‌ను క్షమించే ప్రసక్తే లేదు. తెలంగాణ కోసం కొట్లాడి ప్రాణ త్యాగాలు చేసింది పేదోళ్ల బిడ్డలయితే.. తెలంగాణ వచ్చాక కేసీఆర్ కుటుంబం పదవులతో ఎంజాయ్ చేస్తున్నారని పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి మండిపడ్డారు. పబ్లిక్‌సర్వీస్ కమిషన్‌లో 30 లక్షల మంది నిరుద్యోగులు తమ పేర్లను నమోదు చేసుకున్నారు. ఎన్నికల ముందు నిరుద్యోగ భృతి రూ.3 వేలకు పైగా ఇస్తామని ఇప్పటీ వరకు ఇవ్వలేదు. ఒక్కో నిరుద్యోగికి రూ.60 వేలు కేసీఆర్ బాకీపడ్డారు. నిరుద్యోగ భృతి ఇచ్చాకనే ఓట్లు అడగాలి.. లేదంటే బీఆర్‌ఎస్ నేతలను ఊరి పొలిమేర్లలోనే గోతి తీసి పాతిపెట్టాలి’ అని ఆయన హెచ్చరించారు. పదో తరగతి ప్రశ్నాపత్రాలు వాట్సప్‌ల్లో తిరిగాయని, పబ్లిక్ పరీక్షల పత్రాల్లో అంగంట్టో అమ్మినట్లు.. బజార్లో దొరకడమే తెలంగాణ మోడలా..? అని రేవంత్ నిలదీశారు. రాష్ట్రంలో రెండు లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక భర్తీ చేస్తామని ఆయన భరోసా ఇచ్చారు. నిరుద్యోగ నిరసన దీక్షలో భాగంగా మహబూబ్‌నగర్ జిల్లాలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో రేవంత్‌రెడ్డి మాట్లాడారు.
‘పాలమూరు గడ్డ కష్టాన్ని నమ్ముకున్న గడ్డ. దేశంలో ఎక్కడైనా కష్టజీవి ఉన్నాడంటే అది పాలమూడు బిడ్డనే. పలుగు, పార, తట్ట, మట్టి పట్టేవారు పాలమూరు బిడ్డలే. నాగార్జున సాగర్, శ్రీశైలం ప్రాజెక్టుల్లో మన శ్రమ ఉంది. కాంగ్రెస్ హయాంలో బీమా, కోయిలసాగర్, నెట్టెంపాడును పూర్తి చేశాం. కృష్ణానదీ, తుంగభద్ర జలాలతో పాలమూరు తడుస్తోంది. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం ప్రారంభించిన పాలమూరు- రంగారెడ్డి ప్రాజెక్టును కేసీఆర్ ఎందుకు పూర్తి చేయడం లేదు. కరీంనగర్ నుంచి పారిపోయి వచ్చిన కేసీఆర్‌ను మనం ఆదరించి గెలిపించినా రుణం కూడా తీర్చుకోవడం లేదు. మల్లన్నసాగర్, రంగనాయక ప్రాజెక్టులు నిర్మించుకుని ఆయా ప్రాంతాలకు నీళ్లు ఇచ్చామని చెప్పుకుంటున్నారు. మనకెందుకు ఇవ్వడం లేదు. కేసీఆర్‌కు ఉద్యోగం ఉంది కాబట్టే మనకు ఉద్యోగాలు ఇస్తలేరు. కేసీఆర్ అంగిలాగు ఊడగొడితేనే మనకు ఉద్యోగాలు వస్తాయి. పాలమూరు యూనివర్సిటీలో 150 పోస్టులకు కేవలం 20 మంది మాత్రమే ఉన్నారన్నారని ఆయన విమర్శించారు. ఓటును డబ్బులకు అమ్ముకోవద్దని ఒక వేళ డబ్బులు తీసుకుని ఓట్లు వేస్తే మన ఆత్మగౌరవం అమ్ముకున్నట్లేనని ఆయన అన్నారు.
తెలంగాణ నినాదాన్ని ముందుకు తీసుకెళ్లింది పాలమూరు బిడ్డలే..
తెలంగాణ నినాదం చిన్నారెడ్డి నేతృత్వంలో మొదలైందని 42 మంది ఎమ్మెల్యేల సంతకాలతో కూడిన లేఖను సోనియాగాంధీకి 2000 సంవత్సరంలో అందజేశారు. తొలిదశ ఉద్యమాన్ని పాలమూరు జిల్లాకు చెందిన మల్లిఖార్జున్ నడిపారని, పార్లమెంటులో బిల్లు పాసుకావడానికి జైపాల్‌రెడ్డి చేసిన కృషి ఎంతో ఉంది. కానీ కేసీఆర్ 2001లో టీఆర్‌ఎస్‌ను ప్రారంభించారు. తెలంగాణ రాదని కేసీఆర్ జెండా ఎత్తివేస్తే.. జానారెడ్డి నేతృత్వంలో జేఏసీ ఏర్పడింది. జెండాలు, అజెండాలు పక్కన పెట్టి తెలంగాణ సమాజం అంత తెలంగాణ కోసం కొట్టాడి ప్రత్యేక రాష్ట్రం తెచ్చుకున్నది’ అని రేవంత్‌రెడ్డి వివరించారు. పాలమూరు బిడ్డనైనా నాకు సోనియాగాంధీ పీసీసీ అధ్యక్ష పదవి ఇచ్చింది. రాష్ట్రంలోని 119 మందికి బీఫాంలు ఇచ్చే అవకాశం దక్కింది. పీసీసీ పదవి నాది కాదు మీది. నన్ను సంపుకుంటారో సాదుకుంటారో మీ చేతుల్లోనే ఉంది. జిల్లాలో ఉన్న 14 అసెంబ్లిd, 2 రెండు ఎంపీ సీట్లను గెలిపించి సోనియాగాంధీ రుణం తీర్చుకోవాలి’ అని రేవంత్‌రెడ్డి పిలుపునిచ్చారు.
అంబేద్కర్ ముసుగేసుకున్న కేసీఆర్‌తో అప్రమత్తంగా ఉండాలి..
ఇప్పటి వరకు దళితులను పట్టించుకోని కేసీఆర్.. ఎన్నికల సమయం దగ్గర పడుతున్నందున అంబేద్కర్ ముసుగుతో రావాలని చూస్తున్నారని ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని రేవంత్‌రెడ్డి సూచించారు. అంబేద్కర్ విగ్రహాన్ని తాకే అర్హత కేసీఆర్‌కు లేదన్నారు. హనుమంతరావు విగ్రహం తీసుకుస్తే అరెస్టు చేసిన విషయం ప్రజలు మర్చిపోలేదదన్నారు. కేబినెట్‌లో నీ కులపోళ్లు నలుగురు ఉండి.. మాదిగలకు మంత్రి వర్గంలో చోటు లేనప్పుడు సామాజిక న్యాయం ఎలా అవుతుందని ఆయన నిలదీశారు.
పాలమూరులో బీసీలకు ఐదారు సీట్లు ఇవ్వాలి: వీహెచ్
కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్‌గాంధీ సామాజిక న్యాయ నినాదంతో ముందు కు పోతున్నరాని పీసీసీ మాజీ అధ్యక్షుడు వి. హనుమంతరావు అన్నారు. బీసీల ఓట్లను మన వైపు తిప్పుకోవాలంటే వచ్చే ఎన్నికల్లో బీసీలను గుర్తించాల్సిన అవసరం ఉందని, అందుకు పాలమూరు జిల్లాలో ఉన్న 14 సీట్లకు ఐదారు సీట్లు బీసీలకు ఇవ్వాలని పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డికి వీహెచ్ సూచించారు.
నిరుద్యోగులతో పెట్టుకుంటే అంతే: : ఏఐసీసీ కార్యదర్శి సంపత్
విద్యార్థులు, నిరుద్యోగులతో పెట్టుకున్న ఏ ప్రభుత్వం మనుగడ సాధించలేదని ఏఐసీసీ కార్యదర్శి సంపత్‌కుమార్ అన్నారు. రేవంత్‌రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం వస్తుందని, నిరుద్యోగులు, అన్ని వర్గాల ప్రజలకు న్యాయం జరుగుతుందన్నారు. ఈ సభలో మాజీ మంత్రి నాగం జనార్దన్‌రెడ్డి, మాజీ ఎంపీ మల్లు రవి, మాజీ ఎమ్మెల్యేలు ఎర్ర శేఖర్, రామ్మోహన్‌రెడ్డి, డీసీసీ అధ్యక్షుడు మధుసుదన్‌రెడ్డి, యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు శివసేనారెడ్డి, పలువురు కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.