తెలంగాణలో రేవంత్ రెడ్డి, సీతక్క అనుబంధం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇద్దరూ టీడీపీ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి వలస వచ్చినవారే. అయతే ఇటీవల పీసీసీ చీఫ్ పదవి రేవంత్‌రెడ్డిని వరించడంతో సీతక్క మంగళవారం నాడు 100 కార్లతో ర్యాలీగా రేవంత్‌ను కలిసి అభినందనలు తెలిపిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా సీతక్కను ఉద్దేశించి రేవంత్ మాట్లాడుతూ.. పార్టీలో తానెంతో సీతక్క కూడా అంతేనని ఒక్క మాటలో ఆమెకు ఇచ్చే ప్రాధాన్యం గురించి కుండ బద్దలు కొట్టేశారు. ఈ నేపథ్యంలో రేవంత్‌కు సీతక్క అదనపు బలం అని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. రానున్న రోజుల్లో కాంగ్రెస్ పార్టీకి వీరే దిశా నిర్దేశం అవుతారని సోషల్ మీడియాలో చర్చ నడుస్తోంది.
మరోవైపు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడానికి రేవంత్ తన సొంత టీమ్‌ను తయారుచేసుకుంటున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. ఒకవైపు సీనియర్లను బుజ్జగిస్తూనే ప్రజలలో ఆదరాభిమానాలు కలిగిన నేతలకు, తన నాయకత్వంపై విశ్వాసం వ్యక్తం చేసే నేతలకు రేవంత్ రెడ్డి తన టీంలో మంచి అవకాశాలు, ప్రాధాన్యం కల్పించే యోచన చేస్తున్నారు.
మరోవైపు లాక్డౌన్ సమయంలో గిరిజనులకు సీతక్క చేసిన సహాయం గురించి జాతీయ మీడియాలో మంచి ప్రశంసలు వచ్చాయి. దీంతో సీతక్కపై స్వయంగా రాహుల్ గాంధీనే ప్రశంసలు కూడా కురిపించారు. ఇప్పుడు రేవంత్ పీసీసీ చీఫ్ కావడంతో ఆమె పార్టీలో కీలక పాత్ర పోషించబోతున్నారని ప్రచారం జరుగుతోంది. ఇదే జరిగితే రేవంత్, సీతక్క కలిసి 2023 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి మంచి మైలేజ్ తెస్తారని పలువురు భావిస్తున్నారు.
ఇది కూడా చదవండి: హుజురాబాద్‌లో ఈటెల గెలిచి ఏం చేస్తారని మంత్రి గంగుల వ్యాఖ్యలు