34 ఏండ్ల కిందటే సద్భావన యాత్ర చేపట్టారు
అప్పటి ప్రధాని రాజీవ్ గాంధీ దార్శనికతకు నిదర్శనం
ఎన్నో పదవులను గాంధీ కుటుంబ త్యాగం చేసింది
గీతారెడ్డికి సద్భావన అవార్డు రావడం సంతోషం
సద్భావన యాత్ర కార్యక్రమంలో సీఎం రేవంత్
పాల్గొన్న పీసీసీ చీఫ్ మహేశ్‌గౌడ్, మంత్రులు, ఎమ్మెల్యేలు
ఆంధ్రప్రభ స్మార్ట్, హైదరాబాద్:
దేశ సమగ్రత కోసం 34 ఏళ్ల కిందటే భారత ప్రధానిగా రాజీవ్ గాంధీ సద్భావన యాత్ర చేపట్టారని, ప్రతీ ఏటా ఆయన స్ఫూర్తిని, సద్భావన యాత్రను కొనసాగిస్తూ ముందుకు వెళుతున్నామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. హైదరాబాద్ చార్మినార్ వద్ద రాజీవ్ గాంధీ సద్భావనా యాత్ర స్మారక దినోత్సవ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. సుదీర్ఘ కాలం ప్రజలకు సేవలందించిన గీతారెడ్డి సద్భావన అవార్డుకు ఎంపిక చేయడం అభినందనీయమన్నారు.
రాజకీయాల్లో పదవుల కోసం పాకులాడే వారిని చూసామని, కానీ గీతారెడ్డి 2023 ఎన్నికల్లో పోటీ చేయనని చెప్పిన గొప్ప వ్యక్తి అన్నారు. పేదలకు మేలు జరిగేది గాంధీకుటుంబంతో మాత్రమే. గాంధీ కుటుంబం తీసుకున్న నిర్ణయాలతోనే కాంగ్రెస్ హయాంలో దేశంలో పేదలకు మేలు జరిగిందన్నారు. ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ దేశం కోసం ప్రాణాలు అర్పించారని, ప్రధాని పదవులను సోనియా, రాహుల్ గాంధీ త్యాగం చేశారని సీఎం రేవంత్ రెడ్డి వివరించారు. పదవులను ఇతరులకు ఇచ్చి తమ దార్శకనికతను చూపిన గొప్ప వ్యక్తులని సోనియా, రాహుల్ గాంధీని కొనియాడారు. గాంధీ కుటుంబానికి, దోపిడీ చరిత్ర ఉన్న వారికి పోలికా?, మత సమరస్యాన్ని కాపాడుతూ తెలంగాణను అభివృద్ధి చేసుకుందామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.
కేసీఆర్ కుటుంబానికి పక్కా దోపిడీ చరిత్ర ఉందన్నారు. నేడు నాలాలు, చెరువులు, ఆక్రమించుకున్న వారే ‘హైడ్రా’ను చూసి భయపడుతున్నారని ధ్వజమెత్తారు. ఇదే హైడ్రాను బూచిగా చూపి రియల్ ఎస్టేట్ వ్యాపారాన్ని కుదేలు చేసేందుకు కొంతమంది చూస్తున్నారని ఆరోపించారు. కావాలనే కొంతమంది నేతలు హైదరాబాద్ ప్రతిష్టను దెబ్బతిసేందుకు ప్రయత్నిస్తున్నారని, ఇక నుంచి ప్రభుత్వం అలాంటి వారి భరతం పడుతుందని హెచ్చరించారు. అజీజ్‌నగర్‌లో ఇదే హరీశ్‌రావుకు ఫాంహౌస్ లేదా అని ప్రశ్నించారు. ‘హైడ్రా’ అనగానే కేటీఆర్, హరీశ్‌రావు, ఈటల రాజేందర్ బయటకు వచ్చారని.. పేదలు ఎవరైనా ఫామ్ హౌస్‌లు కట్టుకోగలరా అని రేవంత్ ప్రశ్నించారు.
మూసీ మురికిలో ఉన్న పేదలను ఆదుకునేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తుందని క్లారిటీ ఇచ్చారు. కానీ, ఆ పేదలకు మేలు జరుగుతుంటే ఓరుస్తలేరని ఫైర్ అయ్యారు. ఇప్పటికే బుల్డోజర్లను సిద్ధం చేశా.. ఎవరు అడ్డొస్తారో రండి అంటూ సీఎం సవాల్ విసిరారు. వాళ్ల ఫాంహౌస్‌లపై బోల్డోజర్లు వస్తాయనే భయంతోనే నేడు కేటీఆర్, హరీశ్‌రావు నాటకాలు ఆడుతున్నారని మండిపడ్డారు. తన ఇంటి ముందుకు వచ్చి చేతులు కట్టుకున్న రోజులను హరీశ్‌రావు మర్చిపోయినట్లున్నారని కౌంటర్ ఇచ్చారు. మూసీ పునరుజ్జీవం వేరు.. ‘హైడ్రా’ వేరు అని రేవంత్‌రెడ్డి అన్నారు.
ఈ కార్యక్రమంలో పీసీసీ అధ్యక్షుడు బి. మహేష్ కుమార్ గౌడ్, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ప్రభుత్వ సలహాదారులు, వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు . పార్టీ శ్రేణులు పాల్గొన్నారు.