న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: లోక్‌సభ ఎన్నికలకు సైరన్ మోగించేందుకు సమయం సమీపిస్తున్న వేళ తెలంగాణ కాంగ్రెస్ నాయకత్వం అభ్యర్థుల ఎంపికపై కసరత్తు ముమ్మరం చేసింది. ఢిల్లీ పర్యటనలో ఉన్న తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి, తెలంగాణ పీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి మంగళవారం రాత్రి ఏఐసీసీ సంస్థాగత వ్యవహారాల ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌తో సమావేశమై అభ్యర్థుల ఎంపిక, నామినేటెడ్ పదవుల భర్తీపై చర్చించారు. ఈ సమావేశంలో సీఎం రేవంత్‌తో పాటు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క కూడా ఉన్నారు.
గంటకు పైగా సాగిన ఈ భేటీలో తెలంగాణలో 15 నామినేటెడ్ పదవుల భర్తీ గురించి ప్రధానంగా చర్చించినట్టు తెలిసింది. అసెంబ్లీ ఎన్నికల సమయంలో టికెట్లు ఆశించిన పలువురు నేతలను బుజ్జగించే క్రమంలో కొందరికి లోక్‌సభ టికెట్లు, మరికొందరికి నామినేటెడ్ పదవులు ఇస్తామని అధిష్టానం, రాష్ట్ర నాయకత్వం హామీలిచ్చిన విషయం తెలిసిందే. ఇప్పుడు లోక్‌సభ ఎన్నికల హడావుడి మొదలైన నేపథ్యంలో ఆయా నేతల నుంచి రాష్ట్ర నాయకత్వంపై ఒత్తిడి పెరిగింది. తమకు ఇచ్చిన హామీ మేరకు నామినేటెడ్ పదవులు లేదా లోక్‌సభ టికెట్లు ఇవ్వాల్సిందిగా వారంతా పట్టుబట్టారు.
ఈ క్రమంలో వక్ఫ్ బోర్డు సహా మొత్తం 15 నామినేటెడ్ పదవులను భర్తీ చేసేందుకు రాష్ట్ర నాయకత్వం ప్రాథమికంగా కసరత్తు చేసి జాబితాను తయారు చేసింది. అదే సమయంలో రాష్ట్రంలోని 17 లోక్‌సభ స్థానాలకు అభ్యర్థులను ఎంపిక చేసే ప్రక్రియలో భాగంగా ఒక్కొక్క స్థానానికి ముగ్గురు నుంచి ఐదుగురు ఆశావహులతో జాబితాను తయారు చేసినట్టు తెలిసింది. అసెంబ్లీ ఎన్నికల్లో కలిసొచ్చిన ప్రభుత్వ వ్యతిరేకత ఇప్పుడు కలిసొచ్చే అవకాశం లేనందున అభ్యర్థుల ఎంపిక విషయంలో మరింత ఆచితూచి, గెలుపు గుర్రాలను గుర్తించి టికెట్ కేటాయించాలని రాష్ట్ర నాయకత్వం భావిస్తోంది.
ఈ క్రమంలో లోక్‌సభ అభ్యర్థిత్వాల విషయంలో రాజీపడకూడదని, అది మొత్తం గెలిచే అభ్యర్థుల సంఖ్యపైనే ప్రభావం చూపుతుందని చెబుతున్నట్టు తెలిసింది. మొత్తంగా ఆశావహుల జాబితాపై మంగళవారం కేసీ వేణుగోపాల్‌తో ప్రాథమిక స్థాయిలో చర్చ జరిగినట్టు తెలిసింది. మరోవైపు 15 నామినేటెడ్ పదవుల భర్తీ కోసం రాష్ట్ర నాయకత్వం తయారు చేసిన జాబితాను కేసీ వేణుగోపాల్ ముందుంచినట్టు తెలిసింది.
అధిష్టానం ఆమోదముద్ర తర్వాత నామినేటెడ్ పోస్టుల భర్తీ జీవోలు జారీ చేసే అవకాశం ఉంది. లోక్‌సభ ఎన్నికల కంటే ముందే వీటిని భర్తీ చేస్తే… ఆయా నేతల సేవలను ఎన్నికల ప్రచారంలో కూడా ఉపయోగించుకోడానికి మరింత ఎక్కువ ఆస్కారం ఉంటుందని రాష్ట్ర నాయకత్వం భావిస్తున్నట్టు తెలిసింది. అందుకే తొలుత ఈ నామినేటెడ్ పదవుల భర్తీ ప్రక్రియను పూర్తిచేయాలని చూస్తోంది. మరోవైపు రాష్ట్ర మంత్రివర్గంలో ఖాళీగా ఉన్న మరో 6 బెర్తుల భర్తీ గురించి కూడా చర్చ జరిగినట్టు సమాచారం.
ముఖ్యమంత్రి సహా మొత్తం 11 మంది ప్రమాణస్వీకారం పూర్తవగా, వారికి కేటాయించిన శాఖలు పోను హోంశాఖ సహా మరికొన్ని శాఖలు ఇప్పటికీ ముఖ్యమంత్రి వద్దనే ఉన్నాయి. సామాజిక సమీకరణాలు బేరీజు వేసుకుంటూ వాటిని భర్తీ చేయాలని రాష్ట్ర నాయకత్వం భావిస్తోంది. బీసీ లేదా మైనారిటీ వర్గం నేతకు డిప్యూటీ సీఎం హోదా ఇవ్వాలన్న ప్రతిపాదన కూడా ఉన్నట్టు తెలిసింది. రెండో డిప్యూటీ సీఎంకు హోంశాఖ బాధ్యతలు అప్పగించే అవకాశం ఉంది. ఉమ్మడి నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లాలకు రాష్ట్ర మంత్రివర్గంలో ఇప్పటి వరకు చోటు దక్కనందున ఆ జిల్లాల నేతలు కేబినెట్ భర్తీపై ఆశలు పెట్టుకున్నారు.
అయితే తన మంత్రివర్గం ఎంపిక విషయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధిష్టానం పూర్తి స్వేచ్ఛనిచ్చినట్టు తెలుస్తోంది. ఆ మేరకు రేవంత్ రెడ్డి ఇప్పటికే 6 బెర్తుల భర్తీ కోసం జాబితాను తయారు చేసుకుని ఢిల్లీకి రాగా.. అధిష్టానం పెద్దల్లో చాలావరకు యూపీలో జరుగుతున్న రాహుల్ గాంధీ భారత్ జోడో న్యాయ్ యాత్రలో బిజీగా ఉన్నారు. మంగళవారం సాయంత్రానికి కేసీ వేణుగోపాల్ అందుబాటులోకి రావడంతో రాష్ట్ర నాయకత్వం వెంటనే ఆయనతో సమావేశమై తమ కసరత్తు గురించి వివరించారు. అధిష్టానం నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చిన వెంటనే రాష్ట్ర మంత్రివర్గంలో ఖాళీల భర్తీతో పాటు నామినేటెడ్ పదవుల భర్తీ ప్రక్రియ చేపట్టనున్నారు. కేసీ వేణుగోపాల్‌తో భేటీ అనంతరం సీఎం రేవంత్ రెడ్డి సహా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఉన్నతాధికారులు ప్రత్యేక విమానంలో హైదరాబాద్ తిరుగు ప్రయాణమయ్యారు.