సీఎం రేవంత్ రెడ్డిపై ఎమ్మెల్యే కేటీఆర్ తీవ్ర ఆరోపణలు చేశారు. సికింద్రాబాద్ పార్లమెంట్ సమీక్షా సమావేశంలో (మంగళవారం) ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. రేవంత్ రెడ్డి బీజేపీ పాట పాడుతున్నారని, లోక్ సభ ఎన్నికలు ముగియగానే సీఎం బీజేపీలో చేరతారని ఆరోపించారు. అందుకే రాహుల్ గాంధీకి భిన్నంగా బడే భాయ్ మోదీ మంచివాడని రేవంత్ రెడ్డి అంటున్నారని తెలిపారు. కాంగ్రెస్ పార్టీకి ఈ ఎన్నికల్లో 40 సీట్లు కూడా రావని జోస్యం చెప్పారు. అవకాశవాద రాజకీయాల కోసమే దానం నాగేందర్ పార్టీ మారారని విమర్శించారు. సికింద్రాబాద్ లో పద్మారావును గెలిపించుకోవాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.
ఇసుక దందాతో పాటు రైస్ మిల్లర్లు, బిల్డర్లను బెదిరించి పార్లమెంట్ ఎన్నికల కోసం రూ.2500 కోట్లను వసూలు చేశారని ఆరోపించారు. ఆ డబ్బంతా ఢిల్లీకి కప్పం కట్టారని అన్నారు. ఈ విషయం బయటకి రాకుండా ఉండేందుకు ఫోన్ ట్యాపింగ్, గొర్ల స్కాం, బర్ల స్కాం అని టాపిక్ డైవర్ట్ చేస్తున్నారని మండిపడ్డారు. తెలంగాణలో పంటలు ఎండిపోతున్నా రేవంత్ సర్కార్ పట్టించుకోవడం లేదని అన్నారు. ఇతర పార్టీల నేతలను బెదిరించి కాంగ్రెస్ లో చేర్చుకుంటున్నారని ఫైర్ అయ్యారు.