Thursday, December 12, 2024

TG | ప్రజల జీవితాలతో రేవంత్ ఆటలాడుతున్నాడు : జేపీ నడ్డా

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ మాయల ఫకీర్‌‌లా రాష్ట్ర ప్రజల జీవితాలతో ఆడుకుంటున్నారని, ఆయన నాటకాలు ఇక చెల్లవని బీజేపీ జాతీయ అధ్యక్షుడు, కేంద్ర కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి జేపీ నాడ్డా అన్నారు. కాంగ్రెస్‌ పార్టీ ఒకసారి ఓటమి పాలైతే మళ్లి అధికారంలోకి వచ్చే సమస్యేలేదని, తమిళనాడు, బీహార్‌, యూపీ తరహాలో తెలంగాణలోనూ అదే జర గబోతోందని, రాష్ట్రంలో వచ్చేది బీజేపీ ప్రభుత్వమేనని ఆయన చెప్పారు.

బీహార్‌, ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రాల్లో అధికారం కోల్పోయి 30 ఏళ్లు దాటిందని, ఆ రాష్ట్రాల్లో కనీసం ప్రతిపక్ష హోదా కూడా ఆ పార్టీ దక్కించుకోలేకపోతోందన్నారు. హైదరాబాద్‌లోని సరూర్‌నగర్‌ స్టేడీయంలో కాంగ్రెస్‌ ఏడాది పాలనపై 6 అబద్దాలు 66 మోసాల పేరుతో బీజేపీ నిర్వహించిన బహిరంగసభలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. అధికారంలోకి వచ్చిన ఏడాది కాలంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలేవి నెరవేర్చలేదని, పేద ప్రజలు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారని దుయ్యబట్టారు.

అధికారంలోకి వచ్చాక ప్రతీ మహిళకు రూ.2500 ఇస్తామన్న రేవంత్‌ హామీ నీటి మూట లాగే మిగిలిపోయిందని, ఉద్యోగాల భర్తీ ఊసేలేదని, పేదలు, మహిళలు, రైతులకు వ్యతిరేకంగా రేవంత్‌ ప్రభుత్వం పాలన సాగిస్తోందని ఆరోపించారు. ఆటో డ్రైవర్లకు ఇస్తానన్న 12వేలు ఏమయ్యాయని నిలదీశారు. రైతు రుణమాఫీని పూర్తిస్థాయిలో ఎందుకు అమలు చేయలేదని ప్రశ్నించారు.

తెలంగాణ రాష్ట్రాన్ని పీకల్లోతు అప్పుల్లోకి నెట్టారని, చేసిన అప్పులతో తెలంగాణను అథోగతి పాలు చేసేందుకు రేవంత్‌రెడ్డి ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ఆరోపించారు. రేవంత్‌ పాలనలో అన్ని వర్గాలు ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని , వారందరికీ బీజేపీ అండగా ఉంటుందన్నారు.

తెలంగాణ రాష్ట్రానికి ప్రధాని నరేంద్ర మోదీ అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తున్నారని, పన్నుల కింద తెలంగాణకు లక్షా 60వేల కోట్లను విడుదల చేశారని గుర్తు చేశారు. తెలంగాణకు మూడు వందేభారత్‌ రైళ్లను మంజూరు చేశారని, జాతీయ రహదారుల కింద 5 భారత్‌ మాల ప్రాజెక్టులను రాష్ట్రానికి ఇచ్చారని ఆయన చెప్పారు.

- Advertisement -

ప్రాంతీయ పార్టీల సహకారంతోనే కాంగ్రెస్‌ గెలుస్తూ ఉంటుందని, చివరకు ఆపార్టీలనే భస్మం చేస్తుందని హెచ్చరించారు. రానున్న రోజుల్లో ప్రజా సమస్యలపై పోరాటాలు చేసి తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రాబోతోందన్నారు. బీజేపీ ఫ్యూచర్‌ ఆఫ్‌ ది తెలంగాణ అని అభివర్ణించారు. తెలంగాణలో ఎప్పుడు ఎన్నికలు జరిగినా అధికారం బీజేపీదేనని స్పష్టం చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement