బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ ఢిల్లీలో విలేకరుల సమావేశం నిర్వహించి లగచర్ల ఘటనతోపాటు రాష్ట్రంలో చోటుచేసుకుంటున్న రాజకీయ పరిణామాలపై స్పందించి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా లగచర్ల గ్రామంలోని బాధితుల కష్టాలు.. రేవంత్ ప్రభుత్వ దుర్మార్గపు చర్యను బాధితులతో మాట్లాడించి వివరించారు. రైతులు, బీసీ, దళితులు, గిరిజనుల సంక్షేమం గురించి రాహుల్ గాంధీ పదే పదే ప్రస్తావిస్తారు. తెలంగాణలో గిరిజనులపై రేవంత్ సర్కార్ దమనకాండ రాహుల్ గాంధీకి కనిపించటం లేదా? అని ప్రశ్నించారు.
రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గం కొడంగల్ లో గిరిజన మహిళలు ఏ విధంగా ఆవేదన చెందుతున్నారో వాళ్ల మాటల్లోనే విను అని వివరించారు. కేసీఆర్ పదేళ్ల పాలనలో ఎంతో పురోగతి సాధించిన తెలంగాణలో ఇవ్వాళ అరాచకం నడుస్తోందన్నారు. మణిపూర్ లో హింస, యూపీ హాస్పిటల్ లో చిన్న పిల్లల మృతి, ముంబైలో ధారావి ప్రజల బాధను మీడియా ప్రజలకు చూపిస్తోంది. కానీ తెలంగాణలో గిరిజనులపై అంతకంటే ఏమాత్రం తక్కువ కాకుండా అరాచకాలు జరుగుతున్నాయన్నారు. ముఖ్యమంత్రి సోదరుడు రైతులను బెదిరిస్తూ, చేస్తున్న అరాచకాలపై ఇప్పటికీ ఒక్క కేసు కూడా పెట్టలేదన్నారు. పోలీసులు రేవంత్ రెడ్డి కి ప్రైవేట్ సైన్యం గా వ్యవహరిస్తున్నారన్నారు.
గిరిజనులపై దౌర్జన్యాలు కనిపించడం లేదా..
మణిపూర్ గురించి మాట్లాడే రాహుల్ గాంధీని అడుగుతున్నాం. తెలంగాణలో గిరిజనులపై జరిగిన అఘాయిత్యాలపై ఎందుకు మాట్లాడటం లేదన్నారు. తెలంగాణలో చిన్న పిల్లలు పిలిచినా వస్తా అని చెప్పిన రాహుల్ గాంధీకి ఎందుకు ఇవ్వాళ గిరిజన మహిళ అక్రందనాలు వినిపించటం లేదని దుయ్యబట్టారు. గిరిజనులపై పోలీసుల దమనకాండ సంఘటనపై రాహుల్ గాంధీ, మోడీ ఎందుకు స్పందించటం లేదని అడిగారు.
మణిపూర్లో జరిగిన దానికంటే తక్కువేమీ కాదు
దేశంలో తెలంగాణ అనే రాష్ట్రం ఉంది. ఇక్కడ జరిగే ఆకృత్యాలపై స్పందించాలనే విషయాన్ని ప్రధాని మరిచిపోయారా? ఎందుకు ఇప్పటి వరకు స్పందించటం లేదు. అంటే లగచర్ల లో రైతులు చనిపోయే వరకు స్పందించారా? అని ప్రశ్నించారు. ఈ అంశంపై కచ్చితంగా ప్రధాని మోదీ, రాహుల్ గాంధీ, ఖర్గే కూడా స్పందించాలని డిమాండ్ చేశారు. ఈ అంశంపై పార్లమెంట్ లో బీజేపీ, కాంగ్రెస్ నేతలు మాట్లాడాలి. రాజ్యసభలో కచ్చితంగా మేము ఈ అంశాన్ని ప్రస్తావిస్తామన్నారు. జాతీయ మీడియా కూడా తెలంగాణలో జరుగుతున్న అరాచకాలు, దమన కాండను చూపించాలన్నారు.
మీ ముఖ్యమంత్రిని పిలిచి అరాచకాలు ఆపమని హెచ్చరించండి
భూములు ఇవ్వమని రైతులు చెబితే ఇంత జులుం చేస్తారా? అని అన్నారు. భూమి ఇచ్చే రైతులకు అన్యాయం జరగవద్దని.. కాంగ్రెస్ భూ సేకరణ చట్టం తెచ్చింది. కానీ తెలంగాణలో గిరిజనుల భూముల విలువ రూ.60 లక్షలు అయితే రూ.8 లక్షలు కూడా ఇవ్వటం లేదన్నారు. తెలంగాణలో బీసీలు, గిరిజనులు, దళితులు పోరాటం చేస్తుంటే ఎందుకు మౌనంగా ఉన్నారని ప్రశ్నించారు. ఇప్పుడైనా మీ ముఖ్యమంత్రి అరాచకాలను ఆపాలని పిలిచి హెచ్చరించండి అని అన్నారు.
బీజేపీ నేతలు ఏం చేస్తున్నారో అర్థం కావడం లేదు..
కాంగ్రెస్ కు తెలంగాణ ఏటీఎంగా మారిందని ప్రధాని మోడీ అంటారు. కానీ ఇప్పటి వరకు ఎందుకు చర్యలు తీసుకోవటం లేదన్నారు. తెలంగాణలో గరీబులు, పేదల పక్షాన బీజేపీ నేతలు ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించారు. గిరిజనులపై పోలీసులే లైంగిక వేధింపులకు పాల్పడుతుంటే బీజేపీ నేతలు ఎందుకు మౌనంగా ఉన్నారు.. కాంగ్రెస్ ఆకృత్యాలపై ప్రతిపక్షాలుగా బీఆర్ఎస్, బీజేపీ మాట్లాడాల్సి ఉంది. కానీ బీజేపీ అసలు ప్రజల సమస్యలపై మాట్లాడటం లేదన్నారు.
కేసీఆర్ మూఢ నమ్మకాలు నమ్ముతారని గతంలో ఇదే రేవంత్ రెడ్డి ఆరోపణలు చేశారు. ఇప్పుడు వాస్తు పేరుతో సచివాలయం గేట్ మార్చుతున్నాడు. అధికారంలోకి వచ్చాక ఆయనకు ఏమైందో? అని ఎద్దేవా చేశారు.