Friday, November 22, 2024

TS | 24 గంటల్లో ఇచ్చేస్తున్నారు…! పట్టుబడిన సొమ్ముపై ఈసీ నిర్ణయం

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : ఎన్నికల వేళ తనిఖీలు కొత్త సమస్యలు తీచ్చి పెడుతున్నాయి. ఈ తనిఖీలలో ప్రముఖులు, రాజకీయ పార్టీలకు చెందిన సొత్తు ఎక్కడా పట్టుబడినట్లు రుజువుకాలేదు. కానీ రోజు కోట్ల మొత్తంలో నగదు, ఆభరణాలు, పట్టుబడుతున్నాయి. అయితే వీటిని తిరిగి ఇచ్చేయడంలో అధికారులు చొరవ చూపిస్తున్నా కొందరికి ఇబ్బందిగా మారిందనే ఫిర్యాదులొస్తున్నాయి.

ప్రధానంగా మద్యం వ్యాపారులు, ఆభరణాల తయారీదారులు, వజ్రాలు, ఇతర బంగారం వ్యాపారులకు చిక్కులు తెచ్చిపెడుతున్నాయి. తాజాగా మద్యం వ్యాపారులు తాము నగదును బ్యాంకులకు తీసికెళ్లి డీడీలు తీసి స్టాకు తెచ్చుకోవడంలో ఇబ్బందులపై ఫిర్యాదు చేశారు. అదేవిధంగా బంగారం వ్యాపారులు కూడా ఇదే తరహా ఫిర్యాదులు చేయడం గమనార్హం.

ప్రతీ జిల్లాలో గ్రీవెన్స్‌ సెల్‌…

తెలంగాణ ఎన్నికల నేపథ్యంలో పోలీసులు విస్తృతంగా తనిఖీలు చేస్తున్నారు. సరైన పత్రాలు లేని అక్రమ నగదు, బంగారాన్ని భారీగా సీజ్‌ చేస్తున్నారు. ఎవరి వద్దనైనా రూ.50 వేలకు పైగా నగదు, 10 గ్రాములకు పైగా బంగారం కనిపిస్తే స్వాధీనం చేసుకుంటున్నారు. అయితే, ఈ తనిఖీలతో సామాన్యులు ఇబ్బందులు పడుతున్నారు. ఎన్నికల సంఘం, పోలీసుల తీరుపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో ఈసీ స్పందించింది. బాధితులు సదరు సొమ్మును తిరిగి పొందేందుకు ప్రతి జిల్లాలోనూ గ్రీవెన్స్‌ సెల్‌ ఏర్పాటు చేసింది.

- Advertisement -

పోలీసుల తనిఖీల్లో చిక్కిన నగదు, బంగారు ఆభరణాల యజమానులు ఈ సెల్‌ ఛైర్మన్‌ను సంప్రదించి సరైన ఆధారాలు సమర్పిస్తే 48 గంటల్లోనే నగదు, బంగారాన్ని తిరిగి ఇచ్చేస్తారు. అయితే, వీటి విలువ రూ.10 లక్షల్లోపు మాత్రమే ఉండాలి. అంతకు మించితే ఆదాయపు పన్ను శాఖ అధికారులకు వివరాలు వెల్లడించాలి. వారు చట్టపరమైన అంశాలు పరిశీలించి నిర్ణయం తీసుకోవాల్సి ఉంటు-ంది. హైదరాబాద్‌ జిల్లా కలెక్టర్‌ కార్యాలయంలోని గ్రీవెన్స్‌ సెల్‌లో రోజుకు ఇలా పదికి పైగా సమస్యలను అధికారులు పరిష్కరిస్తున్నారు.

వెల్లువలా నగదు, మద్యం.. ఇతరాలు…

రాష్ట్రంలో ఎన్నికల వేళ నగదు, మద్యం, మత్తుపదార్ధాలు వెల్లువలా ప్రవహిస్తున్నాయి. ఎన్నికల నగదుకు కొదువ లేదని ఆదాయపు పన్ను శాఖ అంచనా వేస్తోంది. గడచిన 2018 ఎన్నికల్లో రాష్ట్రంలో అత్యధికంగా రూ.103 కోట్ల నగదును సీజ్‌ చేయడమే ఎక్కువ అనుకున్నారు. కానీ ఈ ఏడాది ఎన్నికల్లో షెడ్యూల్‌ మాత్రమే వెల్లడికాగా, నోటిఫికేషన్‌కు ముందే రూ.300 కోట్లకుపైగా సీజ్‌ చేశారు. దేశంలోనే అత్యధిక ధన ప్రవాహం, నగదు పంపిణీ ఈ రాష్ట్రంలోనే ఎక్కువగా ఉన్నట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. తెలంగాణలో ఎన్నికలు ఖరీదైన వ్యవహారంగా మారాయని, ఎన్నికల నాటికి సీజ్‌ చేసిన మొత్తాలు ఎంత మొత్తానికి చేరుతాయోననే అనుమానాలు ఐటీ శాఖ వ్యక్తం చేస్తోంది.

2014 ఎన్నికల్లో దేశవ్యాప్తంగా ఎన్నికల సంఘం, పోలీస్‌ శాఖలు, ఆదాయపు పన్ను శాఖ స్వాధీనం చేసుకున్న నగదు రూ.313 కోట్లు కాగా రెండు తెలుగు రాష్ట్రాలుగా విడిపోయిన ఏపీ, తెలంగాణ ఉమ్మడిగా ఉన్న సమయంలో రూ.153 కోట్లను సీజ్‌ చేశారు. అయితే సీజ్‌ చేసిన నగదు కాకుండా అంతకు మూడింతలు ఓటర్లకు చేరి ఉండొచ్చని అంచనా. ఎన్నికల్లో పార్టీలు, అభ్యర్ధులు చేసే ఖర్చు ఇంతకు వంద రెట్లకు పైనేని నిఘా వర్గాలు అంచనా వేస్తున్నాయి.

హైదరాబాద్‌ కేంద్రంగా ఐటీ నిఘా…

ఎన్నికల వ్యయం, నగదు వ్యవహారాలు, నగదు ఉపసంహరణ వంటి అంశాల పరిశీలనకు కేంద్ర ఐటీ శాఖ హైదరాబాద్‌లోని అదనపు డైరెక్టర్‌ నేతృత్వంలో నిఘాను తీవ్రం చేసింది. బ్యాంకులనుంచి అధిక మొత్తాల్లో నగదు ఉపసంహరణ, నగదు ఎక్కువగా తరలుతున్న ప్రాంతాలపై ఆరా తీస్తున్నారు. అదేవిధంగా స్థిరాస్తుల రిజిస్ట్రేషన్లు, బంగారం, వెండి క్రయవిక్రయాలను నిశితంగా పరిశీలిస్తూ నిఘా తీవ్రతరం చేశారు. కట్టడిలో భాగంగా కంట్రోల్‌ రూం ఏర్పాటు, సరిహద్దులో నిఘా, ప్రతీ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో తనిఖీలను విస్తృతం చేశారు.

గత అసెంబ్లి ఎన్నికల్లోనూ అదే సీన్‌…

2018 డిసెంబర్‌లో తెలంగాణలో అసెంబ్లి ఎన్నికలు ముగిశాయి. ఈ సందర్భంగా ఎన్నికల సంఘం చేసిన దాడుల్లో రూ.97కోట్లు సీజ్‌ చేశారు. ఇందులో ఇప్పటివరకు ఆధారాలు చూపినవారికి రూ.29కోట్లను తిరిగి అప్పగించినట్లుగా తెలిసింది. గడచిన డిసెంబర్‌లో రెవెన్యూ, పోలీస్‌ శాఖలు రూ.59.52 కోట్లు ఆదాయపు పన్ను శాఖకు స్వాధీనం చేశాయి. ఐటీ శాఖ నేరుగా రూ.25.48 కోట్లు సీజ్‌ చేసింది.

ఐటీ శాఖకు సరైన లెక్కలు చూపిన వారికి చెందిన రూ.14.22 కోట్లను రిలీజ్‌ చేసింది. అయితే ఏ వ్యక్తి అయినా తన వ్యక్తిగత సేవింగ్స్‌ అకౌంట్‌లో రూ.2.5 లక్షలకు మించి నగదును బ్యాంకులో డిపాజిట్‌ చేసినా, విత్‌డ్రా చేసినా ఆదాయపు పన్ను శాఖ కొన్ని వివరాలను కోరనుంది. అన్ని బ్యాంకులకు చెందిన ఖాతాల్లోని అన్‌ ఆపరేటెడ్‌, గతంలో ఏనాడు పెద్ద మొత్తంలో నగదు జమ చేయని ఖాతాలపై ఆదాయపు పన్ను శాఖ దృష్టి పెట్టింది.

తనిఖీల్లో పట్టుబడితే ఎలా…

తనిఖీల్లో మీ బంగారం, నగదును పోలీసులు పట్టుకుంటే సంబంధిత పోలీస్‌ స్టేషన్‌లో భద్రపరిచి కేసు నమోదు చేస్తారు. ఆ సమాచారాన్ని సంబంధిత యజమానులకు తెలియజేస్తారు. ఈ వివరాలను సంబంధిత నియోజకవర్గ ఎన్నికల రిటర్నింగ్‌, ఆదాయపు పన్ను అధికారులకు పంపిస్తారు.

వీటిని తిరిగి పొందాలనుకునేవారు పోలీస్‌ కేసు వివరాల పత్రాన్ని ఎన్నికల రిటర్నింగ్‌ అధికారి కార్యాలయంలో చూపించాలి. అక్కడి అధికారులు గ్రీవెన్స్‌ సెల్‌కు బదిలీ చేస్తారు. అనంతరం కలెక్టరేట్‌ లోని గ్రీవెన్స్‌ సెల్‌ ఛైర్మన్‌ను కలిస్తే కేసు వివరాలు, ఆధారాలు స్వీకరిస్తారు. దీనికి సంబంధించిన ఓ రశీదు ఇస్తారు. అనంతరం తమ సెల్‌ అధికారులు ఫోన్‌ చేసినప్పుడు రావాలని సూచిస్తారు.

48 గంటల్లోపు సదరు బాధితులను పిలిచి వారు సమర్పించిన ఆధారాలను పూర్తిగా పరిశీలిస్తారు. అన్నీ సరిగ్గా ఉంటే రిటర్నింగ్‌ అధికారికి వివరాలు తెలియజేస్తారు.ఈ మేరకు రిటర్నింగ్‌ అధికారి సీజ్‌ చేసిన సొమ్మును తిరిగిచ్చేయాలని సంబంధిత పోలీస్‌ స్టేషన్‌కు ఆదేశాలిస్తారు. బాధితులు అక్కడికి వెళ్లి మీ నగదు తీసుకోవాల్సి ఉంటుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement