న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: వివిధ మంత్రిత్వశాఖలకు సంబంధించిన పెండింగ్ విషయాలు, ప్రాజెక్టులు, ప్రతిపాదనలతో ఢిల్లీ పర్యటన చేపట్టిన తెలంగాణ ఐటీ, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి కేటీ రామారావు ఆదివారం తన పర్యటన ముగించుకుని హైదరాబాద్ వెళ్లారు. ముగ్గురు కేంద్ర మంత్రులను కలిసినప్పటికీ కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాను కలవకుండానే తిరిగి వెళ్లాల్సి వచ్చింది. శుక్రవారం ఢిల్లీ చేరుకున్న ఆయన కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌ను కలిసి స్కై వేల నిర్మాణానికి కంటోన్మెంట్ భూముల వ్యవహారం సహా అనేకాంశాల గురించి ఆయనతో చర్చించారు.
శనివారం కేంద్ర గృహ నిర్మాణ, పట్టణ వ్యవహారాల శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పురితో పాటు కేంద్ర ఆహార, ప్రజా పంపిణీ శాఖ మంత్రి పీయూష్ గోయల్‌తో సమావేశమయ్యారు. రాత్రి గం. 10.15కు కేంద్ర హోంమంత్రి అమిత్ షా తో సమావేశం ఖరారైనప్పటికీ చివరి నిమిషంలో రద్దయింది. అమిత్ షా బిజీగా ఉన్న కారణంగా శనివారం నాటి అపాయింట్మెంట్ రద్దయినప్పటికీ, ఆదివారం అపాయింట్మెంట్ ఇస్తామని చెప్పినట్టు తెలిసింది. అయితే అపాయింట్మెంట్ కోసం ఎదురుచూడకుండా కేటీఆర్ ఆదివారం ఉదయం ఇంకెవరినీ కలవకుండానే తిరిగి వెళ్లారు.