61 ఏళ్ల వయస్సా?
33ఏళ్ల సర్వీసా!
ఉ(నిరు)ద్యోగులకూ లబ్ధి చేకూర్చేలా..!
రిటైర్మెంట్లపై ప్రభుత్వం కార్యాచరణ
61ఏళ్లు లేదంటే 33 ఏళ్ల సర్వీస్
ఏది ముందయితే అదే పరిగణనలోకి
ఉభయ తారకంగా ఉండేలా చర్యలు
నిరుద్యోగులకు అవకాశాలు విస్తతం చేసేలా పలు మార్గాల్లో సర్కార్ ప్రయత్నాలు
రిటైర్మెంట్ బెనిఫిట్ల భారం రూ.3500 కోట్ల పైనే… ఈ ఏడాది నుంచి ఆరంభం
హైదరాబాద్, ఆంధ్రప్రభ: రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల రిటైర్మెంట్లపై కీలక నిర్ణయం దిశగా ప్రభుత్వం సిద్ధమవుతోంది. గత ప్రభుత్వం ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విర మణ వయసును 58 ఏళ్ల నుంచి 61 ఏళ్లకు పెంచిన సంగతి తెలి సిందే. అయితే ఇప్పుడు కొత్తగా సీఎం రేవంత్‌రెడ్డి సర్కార్ ఉద్యోగ విర మణ వయసును 61ఏళ్లు, లేదంటే 33 ఏళ్ల సర్వీస్ ఏది ముందయితే దానిని పరిగణలోకి తీసుకోవాలని యోచి స్తోంది. ఈ మేరకు జీఏడీ పూర్తిస్థాయిలో సన్నాహాలు చేస్తోంది. ప్రభు త్వం ఈ అంశాన్ని ప్రాథమికంగా ప్రయోగాత్మక స్థాయిలో ప్రవేశపెట్టేం దుకు సుముఖంగా ఉంది. దీనిపై అంతర్గతంగా ప్రభుత్వం మదింపు చేస్తున్నది. ఏఏ శాఖలో ఎందరు ఎప్పుడెప్పుడురిటైర్ అవుతున్నారు? ఎంత భారం పడనుంది? కొత్తగా 33 ఏళ్ల సర్వీస్ తీసుకొస్తే
ప్రభుత్వానికి వచ్చే ఆర్థిక వెసులుబాటు ఎంత? అనే అంశాలపై కసరత్తు చేస్తున్నది.
యూనివర్సిటీల అధ్యాకులపై కూడా..
యూనివర్సిటీల అధ్యాపకుల వయో పరిమితిని 60నుంచి 65ఏళ్లకు పెంచే ఆలోచనలో సర్కార్ ఉంది. కేంద్రీయ విశ్వ విద్యాలయాలలో ఈ పరిమితి ఇప్పటికే 65 ఏళ్లుగా ఉంది. దీనిని 75 ఏళ్లకు పెంచే యోచనలో కేంద్రం పరిశీలిస్తోంది. ఏపీలో విశ్వవిద్యాలయాల అధ్యా పకుల వయో పరిమితి 65 ఏళ్లుకు ఏపీ పెంచింది. తెలంగాణలోని యూనివర్సిటీల అధ్యాపకుల సంఘాలు సీఎంను కలిసి వయోపరిమితి పెంపుపై అభ్యర్థించాయి. దీనిపై సానుకూల నిర్ణయానికి సీఎం ఆమోదం తెలుపుతూ హామీనిచ్చారు. దీనిపై ఇప్పుడు సర్కార్ సాలోచనలు చేస్తోంది.
61 ఏండ్లకు పెంచిన కేసీఆర్ గత సర్కారు..
తెలంగాణ ఏర్పాటు- తర్వాత ఉద్యోగుల విభజన లో భాగంగా కొంతమంది ఉద్యోగులను తెలంగాణ
కు, మరికొందరిని ఆంధ్రప్రదేశ్‌కు కేటాయించారు. ఈ నేపథ్యంలో తెలంగాణలోని కీలకశాఖల్లో ఉద్యోగుల కొరత ఏర్పడింది. దీనికితోడు ఏటా వేలాది ఉద్యోగులు విరమణ పొందాల్సి ఉండటంతో ప్రభుత్వ విభాగాల న్నింటిలో ఉన్నతోద్యోగుల కొరత తలెత్తకుండా నివా రించేందుకు గత కేసీఆర్ ప్రభుత్వం వ్యూహాత్మకంగా వ్యవహరించింది. పదవీ విరమణ వయసు 58 నుంచి 61 ఏండ్లకు పెంచుతూ 2021 మార్చిలో ఉత్తర్వులు జారీచేసింది. అప్పటి నుంచి ప్రభుత్వ శాఖలతోపాటు- గ్రాంట్ ఇన్ ఎయిడ్ సంస్థలు, సొసైటీ-లు, కార్పొరేషన్లు, ఇతర సంస్థలు, వర్సిటీ-ల్లో (బోధనేతర సిబ్బంది) ఏ ఒక్కరూ పదవీ విరమణ పొందలేదు. ప్రభుత్వ ఉద్యో గులతోపాటు- సింగరేణి కార్మికుల పదవీ విరమణ వయసును సైతం 61కి పెంచింది. సింగరేణిలో కూడా ఈ ఏడాది మార్చి 31 నుంచి పదవీ విరమణలు ప్రారంభమయ్యాయి.
మొదలైన పదవీ విరమణలు…
గత నెల 31 తరువాత రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగుల విరమణలు పున:ప్రారంభం అయ్యా యి. కేసీఆర్ ప్రభుత్వం ఉద్యోగ విరమణ వయసు ను 61 ఏండ్లకు పెంచిన తరువాత తొలి బ్యాచ్ రి-టై ర్మెంట్లు- ఈ ఏడాది మార్చి 31 నుంచి ప్రారంభ మయ్యాయి. 2024 మార్చి నుంచి డిసెంబర్ వరకు 8,194 మంది, 2025లో 9,213 మంది, 2026లో 9,231 మంది, 2027లో 8,917 మంది, 2028లో 8,496 చొప్పున ఉద్యోగులు విరమణ పొందనున్నట్టు- సమాచారం. మొత్తం గా రాబోయే ఐదేండ్లల్లో 44,051 ఉద్యోగులు రిటైర్ కానున్నారు. రాష్ట్రంలో మొత్తంగా 3.5 లక్షల ఉద్యోగులు ఉన్నారు. అంటే 10 శాతానికి పైగా ఉద్యోగులు రాబోయే రోజుల్లో విరమణ పొందనున్నారు.
వివిధ రాష్ట్రాల్లో వయో పరిమితి ఇలా…
ఉద్యోగుల వయోపరిమితి పెంపు తెలంగాణతో పాటు- 20 రాష్ట్రాల్లో ఆమల్లో ఉన్నది. మధ్యప్రదేశ్‌లో అత్యధికంగా 62 ఏళ్ల వయోపరిమితిని అమలు చేస్తుం డగా, ఆ తర్వాతి స్థానంలో తెలంగాణలో 61 ఏళ్లుగా ఉన్నది. పశ్చిమబెంగాల్లో మెడికల్ ప్రొఫెసర్లకు 65 ఏళ్లు, డాక్టర్లకు 62, ఇతర ఉద్యోగులకు 60 ఏళ్ల వయో పరిమితిని అమలుచేస్తున్నారు. ఏపీ, త్రిపుర, కర్ణాటక, అసోం, బీహార్, మేఘాలయ, ఛత్తీస్‌గఢ్, నాగాలాండ్, గుజరాత్, ఉత్తరాఖండ్, యూపీ, అరుణాచల్‌ప్రదేశ్, మిజోరం, పంజాబ్, ఒడిశా, రాజస్థాన్‌లో 60 ఏళ్లు ఉండగా, తమిళనాడులో 59 ఏళ్ల వయో పరిమితిని వర్తింపజేస్తున్నారు. హర్యానా, హిమాచల్ ప్రదేశ్, కశ్మీర్, మహారాష్ట్ర, గోవాలో 58ఏళ్లు, కేరళ, జార్ఖండ్‌లో 56ఏళ్లుగా విరమణ వయసు అమలవుతున్నది.
ఈ ఏడాది 8194మంది ఉద్యోగులు రిటైర్ అవనున్నారు. ఇందులో 1419 మంది గెజిటెడ్, 5360మంది నాన్ గెజిటెడ్, 1216మంది క్లాస్ 4 ఉద్యోగులు ఉన్నారు. వీరికి సగటు మూల వేతనం రూ.40 వేలు ఉండగా, హెచ్ఆర్ఏ, సీసీఏ, డీఏలతో కలిపి రూ.60 వేల వేతనం కానుంది. లీవ్ శాలరీ కింద 10 నెలల వేతనం రూ.6 లక్షలు, గ్రాట్యుటీ రూ.12 లక్షలు, కమిటేషన్ కింద రూ.20 లక్షలుగా ఉంది. ఇలా ఒక్కొక్కరికి రూ.40 లక్షల మేర చెల్లించాల్సి వస్తోంది. ఇలా ఏటా రూ.3500 కోట్ల భారం పడనుండగా, మరోవైపు పెన్షన్ల భారం కూడా అదనంగా పడనుంది.
ఈ నేపథ్యంతోపాటు, కొత్తగా నియామకాలకు వీలుగా ప్రభుత్వం కీలక చర్యలకు సిద్ధమవుతున్నది. ఈ క్రమంలో ఇప్పటికే ఉద్యోగ నియామకాలకు వయోపరిమితి పెంచి నిరుద్యోగులకు అవకాశాలు విస్త్రృతం చేసిన ప్రభుత్వం… ఆర్థిక భారం, ప్రయోజనా లు లక్ష్యంగా పావులు కదపాలని యోచిస్తోంది. ఈ దిశగా సాధ్యాసాధ్యాలను పరిగణనలోకి తీసుకొని అంచనాలు రూపొందిస్తున్నది. అయితే ఉద్యోగ సంఘాలు, ఆర్థిక నిపుణులతో చర్చించిన పిదపే ఎటువంటి నిర్ణయమైనా తీసుకునేందుకు ప్రభుత్వం సంసిద్ధతతో ఉందని ప్రభుత్వ వర్గాలు స్పష్టం చేశాయి. ఎన్నికల కోడ్ ముగిసిన వెంటనే సత్వర సరికొత్త నిర్ణయాలకు తెలంగాణ ప్రభుత్వం చేరువ కానుందని ఆయా వర్గాలు చెబుతున్నాయి.