ఈశాన్య రాష్ట్రాలు సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. నిజానికి ఈ రెండు రాష్ట్రాలకు కూడా జూన్ 4నే కౌంటింగ్ జరగాల్సి ఉంది. అయితే.. ఈ రాష్ట్రాలకు జూన్ 2తో అసెంబ్లీల ఐదేళ్ల గడువు కాలం ముగుస్తుంది. అందువల్లే ఇవాళ కౌంటింగ్ జరుగుతోంది.
సిక్కింలో అధికార సిక్కిం క్రాంతి కారీ మోర్చా- దూసుకుపోతోంది. సిక్కింలో ఎస్కేఎమ్ పార్టీ మరో సారి ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన సీట్లు సాధించింది. మొత్తం 32 స్థానాల్లో 18 సీట్లలో విజయం సాధించి మ్యాజిక్ ఫిగర్ 17ను దాటింది. మరో 13 సీట్లలో లీడ్లో ఉంది.
సిక్కింకి కూడా ఏప్రిల్ 19నే పోలింగ్ జరిగింది. ఈ రాష్ట్ర అసెంబ్లీలో 32 సీట్లు ఉన్నాయి. అందువల్ల ఇక్కడ కనీసం 17 సీట్లు గెలిచిన వారిదే ప్రభుత్వం. ప్రస్తుత సీఎం ప్రేమ్ సింగ్ తమంగ్, ఐదుసార్లు సీఎంగా చేసిన మాజీ సీఎం పవన్ కుమార్ చామ్లింగ్ మధ్య హోరాహోరీ పోరు ఉంది. తాము రెండోసారి అధికారంలోకి వస్తామని తమంగ్ అన్నారు. ఈసారి తాము వస్తామని ప్రతిపక్ష సిక్కిం డెమొక్రటిక్ ఫ్రంట్ అంటోంది. 2019 ఎన్నికల్లో ఎస్కేఎమ్ పార్టీ 17 సీట్లు గెలుచుకుంది.