Friday, November 22, 2024

విమాన ఛార్జీలపై పరిమితులు పెట్టాలి.. కేంద్రానికి పార్లమెంటరీ కమిటీ సూచన

విమాన ఛార్జీలకు కనిష్ట, గరిష్ట పరిమితులు విధించాలని పౌర విమానయాన శాఖకు పార్లమెంటరీ కమిటీ సూచించింది. స్వేచ్ఛా మార్కెట్‌ ఆర్ధిక వ్యవస్థ పేరిట విమానయాన సంస్థలు సహేతుకం కాని విధంగా టికెట్‌ ధరలను అమల్లోకి తీసుకురాకుండా చూడాలని పేర్కొంది. ప్రైవేట్‌ విమానయాన సంస్థల ప్రయోజనాలకు, ప్రయాణీకుల ప్రయోజనాలకు మధ్య సమతౌల్యం ఉండాలని, అప్పుడే విమానయాన రంగం వృద్ధి చెందుతుందని కమిటీ పేర్కొంది. రవాణా, పర్యాటకం, సంస్కృతిపై ఏర్పాటు చేసిన పార్లమెంటరీ స్టాండింగ్‌ కమిటీ తన సిఫారసులను విమానయాన శాఖకు సమర్పించింది.

గిరాకీ ఉన్నప్పుడు విమాన టికెట్ల ధరలు ఒక్కసారిగా పెరగడం పై వచ్చిన ఫిర్యాదులు ప్రస్తావించింది. ఇటువంటి సందర్భాల్లో సహేతుకం కాని స్థాయికి ఛార్జీలు పెరుగుతున్నాయని పేర్కొంది. సామాన్యుడికి విమానయానాన్ని దగ్గర చేయాలని ప్రభుత్వం ప్రణాళికలు రచిస్తున్నా, విమాన సామర్ధ్యం తక్కువగా ఉండటంతో టిక్కెట్ల ధరలు అధికమయ్యే పరిస్థితి ఏర్పడుతుందని కమిటీ అభిప్రాయపడింది. అందుకు టిక్కెట్ల ధరలపై కనిష్ట, గరిష్ట పరిమితి ఉండేలా ఒక వ్యవస్థ ఉండాలని సూచించింది. కమిటీ సిఫారసు చేసింది. ధరలకు సంబంధించిన సరైన సమాచారాన్ని కంపెనీలు ప్రచురించకపోతే, వాటిపై అపరాధ రుసుము విధించాలని కోరింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement