Tuesday, November 19, 2024

న్యూ ఇయర్‌ వేడుకలపై ఆంక్షలు.. సౌండ్‌ సిస్టమ్స్‌పై హైకోర్టు కీలక ఆదేశాలు

ఆంధ్రప్రభ, హైదరాబాద్‌: నూతన ఏడాది వేడుకలకు రాష్ట్రం ముస్తాబైంది. కరోనాతో మూడేళ్లు వేడుకలకు దూరంగా ఉన్న మందుబాబులు అర్ధరాత్రి వరకు మద్యం అందుబాటులో ఉంచుతూ సర్కార్‌ ఉత్తర్వులు ఇవ్వడంతో భారీ ఎత్తున వేడుకలతో సంబరాలకు రెడీ అవుతున్నారు. కాగా ఈ వేడుకల్లో నిబంధనలను పాటించాలని, ఎటువంటి వ్యవహారాలు శృతిమించకుండా జాగ్రత్తగా న్యూ ఇయర్‌ వేడుకలు జరుపుకోవాలని పోలీసులు పలు సూచనలు చేస్తున్నారు. రాత్రి 10 తర్వాత మ్యూజిక్‌ పెట్టొద్దని, నిర్దేశిత డెసిబుల్స్‌ మించి సౌండ్‌ పొల్యూషన్‌ చేయొద్దని హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. జూబ్లిహిల్స్‌లోని పబ్‌లలో రాత్రి 10 గంటల తర్వాత మ్యూజిక్‌కు అనుమతి లేదని హైకోర్టు స్పష్టం చేసింది.

గతంలో సింగిల్‌ జడ్జి ఇచ్చిన ఉత్తర్వులను మార్చేందుకు.. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఉజ్జల్‌ భూయాన్‌ ధర్మాసనం నిరాకరించింది. జూబ్లిహిల్స్‌లో జనావాసాల మధ్య పబ్‌లలో అర్ధరాత్రి వరకు మ్యూజిక్‌, సౌండ్‌ సిస్టమ్స్‌ వల్ల తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని స్థానికులు గతంలో హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. గతంలో ఆ పిటిషన్లపై విచారణ చేపట్టిన హైకోర్టు సింగిల్‌ జడ్జి రాత్రి 10 నుంచి ఉదయం 6 వరకు పబ్‌లలో మ్యూజిక్‌ ఉండరాదని ఉత్తర్వులు జారీ చేశారు. అయితే ఈ ఉత్తర్వులను సవరించాలని కోరుతూ మూడు పబ్‌ల యాజమానులు న్యాయస్థానాన్ని కోరారు. దీనిపై విచారణ జరిపిన ధర్మాసనం.. సింగిల్‌ జడ్జి ఉత్తర్వులను సవరిస్తూ.. మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చేందుకు నిరాకరించింది. గతంలో విధించిన ఆంక్షలు యథాతథంగా కొనసాగుతాయని హైకోర్టు స్పష్టం చేసింది.

ట్రాఫిక్‌ ఆంక్షలు…

కొత్త సంవత్సరానికి ఉత్సాహంగా స్వాగతం పలికేందుకు సిద్ధమవుతున్న ఔత్సాహికులకు పోలీసులు ట్రాఫిక్‌ అడ్వయిజరీ జారీ చేశారు. వేడుకలు, సంబరాల్లో పాల్గొనేవారు పలు నిబంధనలు కచ్చితంగా పాటించాల్సిందే. నూతన సంవత్సర వేడుకల వేళ శనివారం నగరంలో ట్రాఫిక్‌ ఆంక్షలు విధించారు. హైదరాబాద్‌, సైబరాబాద్‌, రాచకొండ పరిధిలో శనివారం రాత్రి 10 నుంచి ఆదివారం తెల్లవారుజాము వరకు ఆంక్షలు అమలులో ఉండనున్నాయి. న్యూఇయర్‌ వేడుకల నేపథ్యంలో హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో పోలీసులు ట్రాఫిక్‌ ఆంక్షలు విధించారు. డిసెంబర్‌ 31న రాత్రి 10 గంటల నుంచి జనవరి 1 తెల్లవారుజామున 2 గంటల వరకు ఈ ఆంక్షలు అమల్లో ఉండనున్నాయి. ఈ మేరకు వివరాలను హైదరాబాద్‌ సీపీ సీవీ ఆనంద్‌ ఓ ప్రకటనలో వెల్లడించారు. ట్రాఫిక్‌ ఆంక్షల సమయంలో ఎన్టిఆర్‌ మార్గ్‌, నెక్లెస్‌ రోడ్డు, అప్పర్‌ ట్యాంక్‌బండ్‌ మీదుగా వాహనాలను అనుమతించరు. ఖైరతాబాద్‌ మీదుగా నెక్లెస్‌ రోడ్డు, ఎన్టిఆర్‌ మార్గ్‌ వైపు వెళ్లే వాహనాలను నిరంకారి భవన్‌, రాజ్‌భవన్‌ రోడ్డు మీదుగా మళ్లించనున్నారు.

లిబర్టీ కూడలి, అప్పర్‌ ట్యాంక్‌బండ్‌ మీదుగా వెళ్లే వాహనాలను అంబేడ్కర్‌ విగ్రహం వద్ద దారి మళ్లిస్తారు. మింట్‌ కాంపౌండ్‌ రోడ్డును మూసివేయనున్నారు. నల్లగుట్ట రైల్వే బ్రిడ్జి మీదుగా సంజీవయ్య పార్కు వైపు వెళ్లే వాహనాలను రాణిగంజ్‌ మీదుగా మళ్లిస్తారు. సికింద్రాబాద్‌ నుంచి ట్యాంక్‌బండ్‌ వైపు వెళ్లే వాహనాలను కవాడిగూడ కూడలి, లోయర్‌ ట్యాంక్‌బండ్‌ కట్టమైసమ్మ ఆలయం మీదుగా మళ్లించనున్నారు.

- Advertisement -

ఉల్లంఘనులపై కఠిన చర్యలు…

ట్రాఫిక్‌ ఉల్లంఘనలపై డిసెంబర్‌ 31 రాత్రి పోలీసులు ప్రత్యేక డ్రైవ్‌ చేపట్టనున్నారు. డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ తనిఖీలతో పాటు వేగంగా, నిర్లక్ష్యంగా వాహనాలు నడిపే వారిపై చర్యలు తీసుకోనున్నారు. ప్రతి ఒక్కరూ పోలీసుల సూచనలను పాటించి సహకరించాలని సీపీ సీవీ ఆనంద్‌ కోరారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement