Tuesday, November 26, 2024

పార్లమెంటులో మీడియాపై ఆంక్షలు.. సడలించాల‌న్న అధిర్ రంజన్ చౌదరి

 న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ :  పార్లమెంట్‌లో ఏడాదిన్నర కాలంగా మీడియాపై అమలవుతున్న ఆంక్షలపై కాంగ్రెస్ పార్టీ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ మేరకు ఆ పార్టీ లోక్‌సభాపక్ష నేత అధిర్ రంజన్ చౌదరి లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాకు లేఖ రాశారు. పార్లమెంటరీ ప్రజాస్వామ్యంలో మీడియాపై ఆంక్షలు ఎంత మాత్రం సరికాదని లేఖలో పేర్కొన్నారు. ప్రజాస్వామ్యంలో 4వ స్తంభంగా పత్రికలు, మీడియా సంస్థలు నిలుస్తాయని గుర్తుచేశారు. అలాంటి మీడియాను పార్లమెంటులోకి అనుమతించకుండా ఆంక్షలు విధించడం అసాధారణమని, బాధాకరమని పేర్కొన్నారు.

కోవిడ్-19 కారణంగా గత ఏడాదిన్నరగా మీడియాను పార్లమెంటులోకి అనుమతించలేదని గుర్తుచేశారు. ప్రస్తుతం దేశంలో ఎక్కడ చూసినా షాపింగ్ మాళ్లు, రెస్టారెంట్లు, సినిమా హాళ్లు, రద్దీ మార్కెట్లు సహా దాదాపు అన్ని ప్రాంతాల్లో కోవిడ్ నిబంధనలను తొలగించారని తెలిపారు. కానీ పార్లమెంటులో మీడియాపై మాత్రమే ఈ నిబంధనలు అమలు చేస్తున్నారని అధిర్ రంజన్ చౌదరి వెల్లడించారు. మీడియా స్క్రూటినీ లేకుండా చేయడం ప్రజాస్వామ్యంలో ఆందోళనకర పరిణామమని వ్యాఖ్యానించారు. మీడియా కవరేజిపై విధించిన ఆంక్షలను తక్షణమే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ.. పార్లమెంట్ సమావేశాల సమయంలో జారీ చేసే ప్రెస్ గ్యాలరీ పాసులను పునరుద్ధరించాలని అన్నారు. అలాగే మీడియా కవరేజికి అవసరమైన ఇతర సదుపాయాలను కూడా కల్పించాలని డిమాండ్ చేశారు. 

Advertisement

తాజా వార్తలు

Advertisement