Thursday, November 21, 2024

China | టీచర్లు విదేశాలకు వెళ్లాలంటే ఆంక్షలు… పాస్‌పోర్టు రీకాల్ !

బీజింగ్‌: చైనా పౌర సమాజాన్ని అధ్యక్షుడు జిన్‌పింగ్‌ మరింతగా తన గుప్పిట్లో పెట్టుకుంటున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేసే టీచర్లను తమ పాస్‌పోర్టులను స్వాధీనం చేయాల్సిందిగా తాజాగా ఉత్తర్వులు జారీచేశారు. కీలక స్ధానాల్లో ఉండే ఉన్నత స్ధాయి నుంచి మధ్యస్ధాయి అధికారుల మీద ప్రయాణ ఆంక్షలకు ఉద్దేశించిన 2003 నాటి ఉత్తర్వుల ఆధారంగా ఈ చర్య చేపట్టినట్టు భావిస్తున్నారు.

ప్రభుత్వ స్కూళ్ల ఉపాధ్యాయులతో పాటు ప్రభుత్వరంగ ఉద్యోగుల పాస్‌పార్టుల రీకాల్‌కు ఆదేశాలు జారీ అయ్యాయి. కోవిడ్‌-19 దరిమిలా మూడేళ్ల పాటు విదేశీ ప్రయాణాల మీద ఆంక్షలు ఉండేవి. వ్యక్తిగత విదేశీ ప్రయాణ నిర్వహణ స్కీమ్‌ కింద స్థానిక ప్రభుత్వాధికారులు ఎవరెవరు ఎప్పుడు విదేశాలకు వెళ్లొచ్చు, ఎక్కడికి, ఎందుకు అనే అంశాలను పర్యవేక్షిస్తూ తదనుగుణంగా అనుమతులివ్వడం లేదా తిరస్కరించడం చేస్తుంటారు.

పాస్‌పోర్టులు స్వాధీనం చేయక తప్పదని పలువురు టీచర్లు అంటున్నారు. ఒకవేళ తప్పనిసరి పరిస్థితుల్లో విదేశం వెళ్లాల్సివస్తే సిటీ ఎడ్యుకేషన్‌ బ్యూరోకి దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుందని, కాని అనుమతి వస్తుందన్న నమ్మకం లేదని వారు అభిప్రాయపడుతున్నారు. అయితే అలా మాట్లాడుతున్న టీచర్లు ఎవ్వరూ వారి పేర్లు బహిరంగంగా చెప్పడానికి ఒప్పుకోవడం లేదు.

ఆంగ్ల భాషాభిమానంతో ఇంగ్లిష్‌ మాట్లాడే దేశానికి వెళ్లి అక్కడ భాష నేర్చుకోవాలని ఉబలాటపడుతున్న పలువరు టీచర్లకు ఇది ఆశాభంగంగా ఉందని చెబుతున్నారు. ఒకవేళ ప్రభుత్వ అనుమతితో వెళ్లినా ఆయా దేశాల్లోని శత్రువర్గాలతో కలవకూడదన్న నిబంధన కూడా ఉంది. దాదాపు అన్ని యూనివర్సిటీల్లోను, ప్రభుత్వ స్కూళ్లలోను, ప్రభుత్వరంగ కార్యాలయాల్లోను నోటీసు బోర్డుల్లో ఈమేరకు నోటీసులు అంటించారు.

పాస్‌పోర్టులు స్వాధీనం చేయడానికి గడువు కూడా నిర్దేశించారు. ఒకవేళ తప్పనిసరైతే ఇరవై రోజులకు మించకుండా అనుమతి ఇచ్చే అవకాశాలున్నట్టు తెలుస్తోంది. ముందుగా సంబంధిత స్కూలుకి అప్లయ్‌ చేసుకోవాలి. ఆ స్కూలు పర్మిషన్‌ ఇవ్వాల్సి ఉంటుంది. అప్పుడు డిస్ట్రిక్ట్‌ ఎడ్యుకేషన్‌ బ్యూరోకి వెళ్లాలి. అంతిమంగా మున్సిపల్‌ ఎడ్యుకేషన్‌ బ్యూరో ఓకే చెప్పాల్సి ఉంటుంది. అప్పుడు గాని చైనా నుంచి కాలు బైట పెట్టలేరు.

- Advertisement -

పిల్లలను అనుమతిస్తారా లేదా అన్నది మరో సమస్య. ముఖ్యంగా వేసవిలో పిల్లలను తీసుకెళ్లనివ్వరు. పిల్లల్ని కనక అనుమతిస్తే. వారిని అక్కడే స్కూళ్లలో చదివించి, ఆతర్వాత కొన్నేళ్లకు ఇమిగ్రేషన్‌ మీద కుటుంబం మొత్తం విదేశానికి చెక్కేస్తుందని ప్రభుత్వ భయమని విదేశాల్లో ఉండే చైనా మానవ హక్కుల నాయకులు అభిప్రాయపడుతున్నారు.

పాస్‌పోర్టులు స్వాధీనం చేయకపోయినా, నిబంధనలకు విరుద్దంగా విదేశాలకు వెళ్లాలని ప్రయత్నించినా అవినీతి నిరోధక శాఖాధికారులు చర్యలు తీసుకుంటారు. పదేళ్ల క్రితం రిటైరైన వివిధ శాఖాధికారులకు సైతం ఈ పాస్‌పోర్టు తిప్పలు తప్పడం లేదు. సెక్యూరిటీ కారణాలు చెప్పి స్వాధీనం చేసుకుంటున్నారని పలువురు వాపోతున్నారు.

వాళ్లు పనిచేసే మాజీ కంపెనీల నుంచి ప్రతినిధులు వచ్చి పాస్‌పోర్టులు స్వాధీనం చేసుకుంటున్నారు. విదేశాలతో వారికి ఉన్న సంబంధాల గురించి అధికారులు వాకబు చేస్తున్నారు. కమ్యూనిస్టు యూత్‌ లీగ్‌, చైనీస్‌ పీపుల్స్‌ పొలిటికల్‌ కన్సల్టేటివ్‌ కమిటీ, స్థానిక అధికారులు ఇంటింటికీ ప్రశ్నపత్రాలు పంపుతున్నారు.

ఇది 2022 నుంచి జరుగుతున్న ప్రక్రియగా కొందరు చెబుతున్నారు. విదేశాల్లోని బంధువులు, వారి జాతీయత, శాశ్వత నివాసమా? విదేశీ సాయం పొందారా తదితర ప్రశ్నలకు జవాబులు రాబడుతున్నారు. వీలైనంత వరకు విదేశీ గూఢచార కార్యకలాపాలను నిరోధించే లక్ష్యంతోనే జిన్‌పింగ్‌ ప్రభుత్వం ఈ చర్యలకు నడుం కట్టినట్టు చెబుతున్నారు.

చైనా పౌరులకు విదేశీ సంబంధాలు లేకుండా చేయడం ద్వారా ఇతర దేశాల్లో జరుగుతున్న మంచిని చైనీయులు గ్రహించి తమ ప్రభుత్వంతో బేరీజు వేసుకుని అసంతృప్తికి లోనయ్యే ప్రమాదం ఉందని చైనా పాలకుల భయమని కొందరి అభిప్రాయం.

హక్కుల కార్యకర్తలు, అసమ్మతి నేతలు, మానవ హక్కుల నాయకుల కుటుంబాలకు ఎప్పటినుంచో విదేశీ ప్రయాణాలకు అనుమతి లేదు. ఇప్పుడు తాజాగా సమాజంలోని వివిధ రంగాల్లో వివిధ స్థాయిల్లో పనిచేసే ఉన్నతాధికారులు, మధ్యస్ధాయి అధికారులు, ముఖ్యంగా విద్యాబోధనలోనే మునిగి ఉండే ఉపాధ్యాయులకు పాస్‌పోర్టు స్వాధీన ఉత్తర్వులు అమలుచేయడం చైనాలో చర్చనీయాంశంగా మారింది.

2008, 2009 సంవత్సరాల్లో టిబెట్‌, జిన్‌జియాంగ్‌లలో ఉవ్వెత్తున లేచిన నిరసన ఉద్యమాల నేపథ్యంలో ఇలాంటి విధానాలనే అమలుచేశారు. కోవిడ్‌ నిబంధనలు అడ్డు వచ్చినా, ఇతరేతర ఆంక్షలు, నిషేధాలు ఉన్నా చాలామంది చైనా ప్రభుత్వం కళ్లుగప్పి విదేశాలకు వెళ్లిన దృష్టాంతాలూ ఉన్నాయి. అలాంటి వారిని పారిపోయిన వారుగా చైనా గుర్తిస్తున్నది.

Advertisement

తాజా వార్తలు

Advertisement