Friday, November 22, 2024

65వ జాతీయ రహదారిపై ఆర్టీసీ సర్వీసుల పునరుద్ధరణ

అమరావతి, ఆంధ్రప్రభ : మున్నేరు వరద నీటి ఉధృతి తగ్గడంతో 65వ జాతీయ రహదారి వాహనాల రాకపోకలను పోలీసులు పునరుద్ధరించారు. పోలీసు అధికారుల సడలింపుల నేపధ్యంలో విజయవాడ-హైదరాబాద్‌ మధ్య ఆర్టీసీ బస్సు సర్వీసులను పునరుద్ధరించారు. మున్నేరు వరద ఉధృతి నేపధ్యంలోఎన్‌టీఆర్‌ జిల్లా ఐతవరం వద్ద జాతీయ రహదారిపైకి వరద ప్రవాహం పెరిగింది. వాహనాల రాకపోకలకు ప్రమాదం పొంచి ఉండటంతో పోలీసు అధికారుల ఆదేశాల మేరకు గురువారం సాయంత్రం నుంచి విజయవాడ- హైదరాబాద్‌ మధ్య ఆర్టీసీ బస్సుల రాకపోకలను అధికారులు నిలిపేశారు.

- Advertisement -

విజయవాడ-హైదరాబాద్‌ మధ్య రాకపోకలు సాగించే ప్రయాణికుల కోసం ఆర్టీసీ సర్వీసులను గుంటూరు మీదుగా పిడుగురాళ్ల-దాచేపల్లి-మిర్యాలగూడెం-నార్కెట్‌ పల్లి మీదుగా మల్లించారు. అటు వైపు నుంచి వచ్చే వాహనాలను సైతం ఇదే మార్గంలో రావాలని అధికారులు పేర్కొన్నారు. ఎగువ ప్రాంతాల్లో వర్షాలు తగ్గి వరద ఉధృతి తగ్గింది. ఎగువనున్న ఖమ్మం జిల్లా నుంచి మున్నేరుకు వరద ప్రవాహం తగ్గడంతో జాతీయ రహదారిపై కూడా పరిస్థితి చక్కబడింది.

దీంతో రాత్రి 7గంటల నుంచి వాహనాల రాకపోకలను పోలీసులు అనుమతించారు. ఆర్టీసీ బస్సులను సైతం ఇదే మార్గంలో నడిపేందుకు నిర్ణయించిన ఉన్నతాధికారులు జిల్లాల ప్రజా రవాణా అధికారుల(పీటీడీ) అధికారులకు సమాచారం ఇచ్చారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు శుక్రవారం రాత్రి నుంచి విజయవాడ-హైదరాబాద్‌ మధ్య ఆర్టీసీ సర్వీసులు యధావిధిగా నడుస్తాయని అధికారులు పేర్కొన్నారు. ఉత్తరాంధ్ర, ఉభయ గోదావరి జిల్లా సర్వీసులు యధావిధిగా విజయవాడ మీదుగా హైదరాబాద్‌కు రాకపోకలు సాగించనున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement