Friday, November 22, 2024

చీర కట్టుకున్న మహిళను రెస్టారెంట్‌లోకి రానివ్వని సిబ్బంది

చీరలో వచ్చిన ఒక మహిళను రెస్టారెంట్‌ సిబ్బంది లోపలకు అనుమతించలేదు. ఆమె వస్త్రధారణ స్మార్ట్‌ క్యాజువల్‌ డ్రెస్‌ కోడ్‌ కిందకు రాదంటూ రెస్టారెంట్‌లోకి రాకుండా ఆమెను అడ్డుకున్నారు. దీంతో చీర ధరిస్తే రెస్టారెంట్‌లోనికి అనుమతించకూడదన్న డ్రెస్‌ కోడ్‌ గురించి తనకు చూపించాలని ఒక మహిళ అక్కడి సిబ్బందిని నిలదీసింది. అయితే ‘మేము స్మార్ట్ క్యాజువల్‌ని మాత్రమే అనుమతిస్తాము. చీర స్మార్ట్ క్యాజువల్ కిందకు రాదు’ అంటూ ఒక సిబ్బంది సమాధానమిచ్చాడు.

దేశ రాజధాని ఢిల్లీ ఆగస్ట్‌ క్రాంతి మార్గంలోని అన్సల్ ప్లాజాలో ఉన్న అక్విలా బార్‌ అండ్‌ రెస్టారెంట్‌లో జరిగిన ఈ ఘటనపై జర్నలిస్ట్‌ అనితా చౌదరి ఆశ్చర్యపోయారు. దీనిపై ఆమె సామాజిక మాధ్యమాల్లో పోస్ట్‌ చేశారు. ‘చీర ధరించే మహిళలను అక్విలా రెస్టారెంట్‌లోకి అనుమతించరు. ఎందుకంటే భారతీయ చీర ఇప్పుడు స్మార్ట్ డ్రెస్‌ కాదు. అసలు స్మార్ట్ డ్రెస్‌కు కాంక్రీట్ నిర్వచనం ఏమిటి? దయచేసి నాకు చెప్పండి. దయచేసి స్మార్ట్ దుస్తుల గురించి నిర్వచించండి. అప్పుడు నేను చీర కట్టుకోవడం మానేస్తాను’ అని ఆమె అందులో పేర్కొన్నారు. పలువురు కేంద్ర మంత్రులు, జాతీయ మహిళా కమిషన్‌తోపాటు పలువురికి దీనిని ట్యాగ్ చేశారు.

మరోవైపు సోషల్‌ మీడియాలో వైరల్‌ అయిన ఈ వీడియోపై నెటిజన్లు ఘాటుగా స్పందించారు. ఆ రెస్టారెంట్‌ డ్రెస్ కోడ్ విధానంపై మండిపట్టారు. ఇది వివక్షతతో కూడిన దారుణ నిబంధన అని ఆరోపించారు. ఈ రెస్టారెంట్‌కు ప్రతిచోటా చెత్త రేటింగే ఉందని నెటిజన్లు చెప్పారు. గూగుల్‌లో 1.1/5 రేటింగ్ ఉండగా, జొమాటోలో 2/5 రేటింగ్ ఉందని చెప్పిన సదరు యూజర్.. ఈ రెస్టారెంట్ ఇలా తప్పు చేయడం ఇదేమీ మొదటిసారి కాదని వెల్లడించారు. పాత రివ్యూలు చూస్తే ఈ విషయం అర్థమవుతుందని తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement