Friday, November 22, 2024

Big Story: ఉద్దండులకు విశ్రాంతి, పంజాబ్‌ ఓటర్ల విలక్షణ తీర్పు

ఎన్నికల్లో ఎప్పుడే జరుగుతుందో ఎవరూ ఊహించలేరు.. ఉద్ధండులనుకున్న వారు.. ప్రభంజనంలో కొట్టుకుపోయారు. పంజాబ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో ఇప్పుడు ఇదే జరిగింది. పంజాబ్‌లో.. సీఎం చన్నీ సహా అన్ని పార్టీల్లోని సీఎం అభ్యర్థులు చతికిలపడ్డారు. ఆప్‌ సృష్టించిన ప్రభజనంలో కీలక నేతలు కొట్టుకుపోయారు. సీఎంగా ఉన్న చరణ్‌ జీత్‌ సింగ్‌తో పాటు మాజీ సీఎం అమరీందర్‌ సింగ్‌లకు ప్రజలు ఉద్వాసన పలికారు. పోటీ చేసిన రెండు స్థానాల్లోనూ.. చన్నీ ఓడిపోవడం చర్చనీయాంశంగా మారింది. పంజాబ్‌ కాంగ్రెస్‌ను అన్నీ తానై నడిపించిన నవజ్యోత్‌ సింగ్‌ సిద్ధూ కూడా ఘోర ఓటమి చవిచూశాడు.

అమృత్‌సర్‌ ఈస్ట్‌ నుంచి ఓడిపోయాడు. కెప్టెన్‌ అమరీందర్‌ సింగ్‌.. బలమైన నేతగా గుర్తింపు పొందారు. అయితే ఈసారి ఆయనా తేలిపోయారు. పటియాలలో ఆప్‌ అభ్యర్థి అజిత్‌పాల్‌ సింగ్‌ చేతిలో ఓడిపోయారు. ఐదు సార్లు సీఎంగా పని చేసిన రాజకీయ కురవృద్ధుడు శిరోమణి అకాలీ దళ్‌ అధ్యక్షుడు ప్రకాష్‌ సింగ్‌ బాదల్‌ కూడా లాంబి నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. వృద్ధ బాదల్‌పై ఆప్‌ అభ్యర్థి గుర్మీత్‌ గుబియాన్‌ విజయం సాధించారు. ప్రకాష్‌ సింగ్‌ బాదల్‌ కుమారుడు అకాలీదళ్‌ నుంచి సీఎం అభ్యర్థిగా ఉన్న సుఖ్‌బీర్‌ సింగ్‌ బాదల్‌ను ఆప్‌ అభ్యర్థి జగదీప్‌ కంభోజ్‌ ఓడించారు. సుఖ్‌బీర్‌పై (60,525) సుమారు 30వేల భారీ మెజార్టీతో జగదీప్‌ (91,455) ఘన విజయం సాధించాడు.

చరణ్‌ జీత్‌ సింగ్‌ చన్నీ – కాంగ్రెస్‌ సీఎం అభ్యర్థి
హస్తం సీనియర్‌ నేత చరణ్‌ జీత్‌ సింగ్‌ చన్నీ.. ఘోర ఓటమి పాలయ్యారు. పోటీ చేసిన రెండు స్థానాల్లో కూడా చన్నీ ఓడిపోయారు. చమ్‌కౌర్‌ సాహిబ్‌, బదౌర్‌ అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి పోటీ చేశారు. బదౌర్‌లో ఆప్‌ పార్టీకి చెందిన లబ్‌ సింగ్‌ ఉగోకేకు 63,967 ఓట్లు వచ్చాయి. చన్నీకి 26,409 ఓట్లు మాత్రమే పోలయ్యాయి. ఇక మూడో స్థానంలో శిరోమణి అకాళీ దల్‌ నేత సగ్నం సింగ్‌కు 21,183 ఓట్లు పోలయ్యాయి.
రెండో స్థానమైన చమ్‌కౌర్‌ సాహిబ్‌లోనూ చన్నీ ఓటమిపాలయ్యారు. ఆమ్‌ ఆద్మీ పార్టీ అభ్యర్థి చరణ్‌ జీత్‌ సింగ్‌కు 70,248 ఓట్లు పోలవ్వగా.. కాంగ్రెస్‌ అభ్యర్థి చరణ్‌ జీత్‌ సింగ్‌ చన్నీకి 62,306 ఓట్లు మాత్రమే పోలయ్యాయి. ఇక మూడో స్థానంలో శిరోమణి అకాలీదళ్‌ నుంచి లఖ్వీర్‌ సింగ్‌కు 6,974 ఓట్లు వచ్చాయి. చన్నీ మాత్రం చివరికి రెండు స్థానాల్లో ఓటమిపాలయ్యారు.

—————-

నవజ్యోత్‌ సింగ్‌ సిద్దూ – పంజాబ్‌ పీసీసీ అధ్యక్షుడు
నవజ్యోత్‌ సింగ్‌ సిద్దూ కూడా ఓటమిపాలయ్యాడు. అమృత్‌సర్‌ ఈస్ట్‌ నియోజకవర్గం నుంచి పోటీ చేయగా.. ఓ సాధారణ ఆప్‌ మహిళా అభ్యర్థి చేతిలో ఘోరంగా ఓటమి చవిచూశాడు. ఆప్‌ అభ్యర్థికి 39,679 ఓట్లు పోలవ్వగా.. కాంగ్రెస్‌ సీనియర్‌ నేత సిద్దూకు 32,929 ఓట్లు పోలయ్యాయి. ఓ సాధారణ ఆప్‌ కార్యకర్తగా జీవన్‌ జ్యోత్‌ కౌర్‌ నిలిచారు. ఇక మూడో స్థానంలో శిరోమణి అకాలీ దల్‌ నేత విక్రమ్‌ సింగ్‌ మజిఠియా నిలిచాడు. ఈయనకు 25,112 ఓట్లు పోలయ్యాయి.

——————

అమరీందర్‌ సింగ్‌ – పంజాబ్‌ మాజీ సీఎం
కాంగ్రెస్‌ నుంచి బయటికొచ్చిన మాజీ సీఎం అమరీందర్‌ సింగ్‌ సొంత పార్టీ పెట్టుకున్నారు. అయినా పంజాబ్‌ ప్రజలు ఆయన్ను ఆదరించలేదు. పటియాల నియోజకవర్గం నుంచి పోటీ చేసిన సింగ్‌.. ఆమ్‌ ఆద్మీ పార్టీ అభ్యర్థి అజిత్‌ పాల్‌ సింగ్‌ కోహ్లీ చేతిలో ఘోర ఓటమి చవిచూశారు. అజిత్‌ పాల్‌కు 48,104 ఓట్లు పోలవ్వగా.. మాజీ సీఎం అమరీందర్‌ సింగ్‌కు 28,231 ఓట్లు వచ్చాయి. కాంగ్రెస్‌ నుంచి బయటికి వచ్చినా కూడా సాధారణ వ్యక్తి అయిన అజిత్‌ పాల్‌ చేతిలో ఓటమిపాలవ్వడం గమనార్హం. ఇక మూడో స్థానంలో శిరోమణి అకాలీ దళ్‌ నేత హర్పాల్‌ జునేజా నిలిచాడు. ఆయనకు 11,835 ఓట్లు వచ్చాయి.

————

ప్రకాష్‌ సింగ్‌ బాదల్‌ – శిరోమణి అకాళీ సీనియర్‌ నేత
ఐదు సార్లు పంజాబ్‌కు ముఖ్యమంత్రిగా సేవలు అందించిన ఘనత ప్రకాష్‌ సింగ్‌ బాదల్‌ది. రాజకీయంగా ఎంతో అనుభవం ఉన్న శిరోమణి అకాలీ దల్‌ నేతకూ ఈ ఎన్నికల్లో పరాభావం తప్పలేదు. ఆమ్‌ ఆద్మీ పార్టీ అభ్యర్థి చేతిలో ఘోరంగా ఓడిపోయారు. గుర్మీత్‌ సింగ్‌ కుడియన్‌కు 66,313 ఓట్లు పోలయ్యాయి. మాజీ సీఎం ప్రకాష్‌ సింగ్‌ బాదల్‌కు మాత్రం.. 54,917 ఓట్లు వచ్చాయి. దీంతో రాజకీయ కుర వృద్ధుడికి ఓటమి ఆహ్వానం పలికింది. కాంగ్రెస్‌ అభ్యర్థి జగ్‌పాల్‌ సింగ్‌ అబుల్‌ఖురానా 10,136 ఓట్లతో మూడో స్థానంలో నిలిచాడు.

—————

సుఖ్‌బీర్‌ సింగ్‌ బాదల్‌ – శిరోమణి అకాలీ దల్‌ సీఎం అభ్యర్థి
మాజీ సీఎం ప్రకాష్‌ సింగ్‌ బాదల్‌ కుమారుడే సుఖ్‌బీర్‌ సింగ్‌ బాదల్‌. కుర వృద్ధుడు ప్రకాష్‌ సింగ్‌ బాదల్‌కు రాజకీయ వారసుడిగా ఉన్నాడు. అయితే సీఎం అభ్యర్థిగా బరిలోకి దిగినా.. పంజాబ్‌ ప్రజలు ఆదరించలేదు. ఆమ్‌ ఆద్మీ పార్టీ అభ్యర్థి చేతిలో ఓటమి పాలయ్యాడు. జలాలాబాద్‌ నుంచి పోటీ చేసిన సుఖ్‌బీర్‌ సింగ్‌ బాదల్‌ను 30వేల మెజార్టీతో జగ్‌దీప్‌ కంబోజ్‌ మట్టికరిపించాడు. సుఖ్‌బీర్‌ సింగ్‌కు 60,525 ఓట్లు పోలవ్వగా.. జగ్‌దీప్‌ కంబోజ్‌కు 91,455 ఓట్లు పోలయ్యాయి. సుమారు 52 శాతం ఓట్లు ఈయనకే వచ్చాయి.

————–

చన్నీకి సామాన్యుడి షాక్‌ – లాబ్‌ సింగ్‌ ఘన విజయం
కాంగ్రెస్‌ అభ్యర్థి చన్నీపై గెలిచిన లాబ్‌ సింగ్‌ ఓ సాధారణ వ్యక్తి. ఆప్‌ తరఫు నుంచి బదౌర్‌ నుంచి చన్నీపై పోటీ చేశాడు. సామాన్యుడి చేతిలో ఓడిపోవడం చర్చనీయాంశంగా మారింది. దీంతో ఆప్‌ ప్రత్యేక ఆకర్శణగా నిలిచింది. సీఎంకు ఇంటి దారి చూపించిన లాబ్‌ సింగ్‌, ఇంటర్‌ వరకే చదువుకున్నాడు. కొంత కాలం మొబైల్‌ రిపేర్‌ షాపులో పని చేశాడు. అతని తండ్రి ఓ వ్యవసాయ కూలీ. తల్లి ఓ స్వీపర్‌. 2013లో లాబ్‌ సింగ్‌ ఆమ్‌ ఆద్మీ పార్టీలో చేరాడు. ఎన్నికల బరిలో దిగిన తరువాత.. లాబ్‌ సింగ్‌ తన మాటలతో అక్కడి ప్రజల మనస్సులను గెలుచుకున్నాడు. ఓ సాధారణ వ్యక్తి ఏకంగా సీఎంను ఓడించడమే ఇప్పుడు దేశ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.

———-

ఆమె చేతిలో సిద్ధూ ఓటమి – జీవన్‌ జ్యోత్‌ కౌర్‌ గెలుపు
పంజాబ్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడు నవజ్యోత్‌ సింగ్‌ సిద్దూ ఘోరంగా ఓటమిపాలయ్యారు. సిద్ధూపై గెలిచిన జీవన్‌ జ్యోత్‌ కౌర్‌ ఓ సామాజిక కార్యకర్త. ఆమె పంజాబ్‌లోని పద్మినిగా ప్రసిద్ధి చెందారు. ప్లాస్టిక్‌ శానిటరీ ప్యాడ్‌లను ఉపయోగించడం ద్వారా కలిగే దుష్ప్రభావాల గురించి మహిళలకు అవగాహన కల్పించడమే జీవిత లక్ష్యంగా ఆమె పెట్టుకున్నారు. అలా ఆమె సోషల్‌ సర్వీస్‌ ద్వారా ప్రజలకు చేరువయ్యారు. అంతేకాదు.. శ్రీ హేమకుంట్‌ ఎడ్యుకేషన్‌ సొసైటీని స్థాపించారు. ఇది సమాజంలో పేద, వెనుకబడిన ప్రజల సంక్షేమం కోసం పని చేస్తున్న సంస్థ.

—————

పీఠాలే కదిలిపోయాయ్‌ : అరవింద్‌ కేజ్రీవాల్‌, ఆప్‌ అధినేత
నేను ఏం చేయగలను అని సామాన్యుడు భావిస్తున్నాడు..? ఈ రోజు చరణ్‌ జిత్‌ సింగ్‌ చన్నీని ఎవరు ఓడించారో తెలుసా..? బదౌర్‌ నుంచి లాభ్‌ సింగ్‌. అతను ఓ మొబైల్‌ రిపేర్‌ షాపులో పని చేస్తాడు. అతని తల్లి ప్రభుత్వ కార్యాలయంలో స్వీపర్‌గా పనిచేస్తోంది. అతని తండ్రి ఓ వ్యవసాయ కూలీ. అలాంటి ఓ సాధారణ వ్యక్తి చరణ్‌జీత్‌ సింగ్‌ చన్నీని ఓడించాడు. సిద్దూను కూడా ఓ సామాన్య మహిళా కార్యకర్త ఓడించింది. ఆమె పేరే జీవన్‌ జ్యోత్‌ కౌర్‌. కామన్‌ మెన్‌తో సవాల్‌ చేయవద్దు.. అతను నిలబడిన రోజు పెద్ద విప్లవాలు వస్తాయని తెలుసుకోవాలి. ఆప్‌కు వ్యతిరేకంగా పంజాబ్‌లో ఓ రహస్య కూటమే ఏర్పాటైంది. నన్ను ఉగ్రవాదిని అన్నారు. నేను ఉగ్రవాదిని కాను.. ఓ సామాన్య మానవుడినే.. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలతో.. పెద్ద కుర్చీలు కదిలిపోయాయి. సామాన్య మానవులు ఎవరినీ తిట్టరు. నవ్వుతూ స్వీకరిస్తారు. ఇదే మా పార్టీ లక్ష్యం. ఎవరికీ అహంకారం అనేది ఉండొద్దు. ఇది మా పార్టీ నేతల్లో ఎక్కడా కనిపించదు.

Advertisement

తాజా వార్తలు

Advertisement