Wednesday, November 20, 2024

Delhi | నీటి వాటాలపై కృష్ణా ట్రిబ్యునల్‌కు బాధ్యతలు.. ప్రాజెక్టులవారీగా కేటాయింపులకు ఆస్కారం


న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల మధ్య నెలకొన్న జల వివాదాల్లో కృష్ణా నదీ జలాల వాటాల వివాదాన్ని పరిష్కరించేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. బుధవారం ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన సమావేశమైన కేంద్ర మంత్రివర్గం, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ అభ్యర్థన మేరకు రెండు తెలుగు రాష్ట్రాల మధ్య నదీ జలాల వాటా తేల్చే పనిని కృష్ణా ట్రిబ్యునల్-2కు అప్పగించింది. అంతర్ రాష్ట్ర నదీ జలాల వివాదాల చట్టం, 1956 ప్రకారం కృష్ణా నదీ జల వివాదాల ట్రిబ్యునల్-IIకి విధివిధానాలను ఖరారు చేస్తూ కేబినెట్ ఆమోదముద్ర వేసింది.

ఈ చట్టంలోని సెక్ష‌న్ 5(1) కింద తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మధ్య ప్ర‌స్తుతం ఉన్న కృష్ణా జ‌లాల వివాదాల ట్రైబ్యున‌ల్-II (కృష్ణా ట్రిబ్యునల్-2)కి అదనపు బాధ్యత అప్పగిస్తూ నిర్ణయం తీసుకుంది. తద్వారా ఈ ట్రిబ్యునల్ చట్టపరమైన అభిప్రాయాన్ని స్వీకరించడంతో పాటు తెలంగాణ ప్రభుత్వ ఫిర్యాదులను అంతర్ రాష్ట్ర నదీ జల వివాదాల చట్టం, 1956 సెక్షన్ (3)కు లోబడి పరిష్కరించనుంది.

కృష్ణా నదీ జలాల వినియోగం, పంపిణీ, నియంత్రణపై రెండు రాష్ట్రాల మధ్య వివాదాల పరిష్కారం కోసం ఈ ట్రిబ్యునల్ కొత్త మార్గాలను అన్వేషిస్తుంది. తద్వారా రెండు తెలుగు రాష్ట్రాలు ప్రయోజనం పొందుతాయని కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన ఓ ప్రకటనలో పేర్కొంది. కృష్ణా ట్రిబ్యునల్-2ను అంతర్రాష్ట్ర నదీ జల వివాదాల చట్టం, 1956 సెక్షన్ 3 ప్రకారం 2004 ఏప్రిల్ 2న కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. నాటికి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌తో పాటు ఎగువ రాష్ట్రాలైన కర్ణాటక, మహారాష్ట్రల నీటి వాటాలను ఖరారు చేస్తూ ఈ ట్రిబ్యునల్ అవార్డును ప్రకటించింది.

- Advertisement -

అయితే 2014 జూన్ 2న ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి ప్రస్తుత ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలు ఏర్పడడం, ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం 2014లోని సెక్షన్ 89 ప్రకారం రెండు తెలుగు రాష్ట్రాల మధ్య నెలకొన్న కృష్ణా జలాల వాటాలు, వివాదాలను పరిష్కరించడం కోసం కృష్ణా ట్రిబ్యునల్-2 పదవీకాలాన్ని కేంద్రం పొడిగింది. తదనంతర కాలంలో ఈ వివాదాలపై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేయగా.. కేంద్ర జలశక్తి మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలో జరిగిన 2వ అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో ఈ పిటిషన్‌ను వెనక్కి తీసుకుంటే ట్రిబ్యునల్ ద్వారా జలవివాదాలను పరిష్కరించేలా చేస్తామంటూ కేంద్రం తెలియజేసింది.

ఆ మేరకు 2021లో తెలంగాణ ప్రభుత్వం పిటిషన్ వెనక్కి తీసుకోగా.. ప్రస్తుత కృష్ణా ట్రిబ్యునల్-2ను రద్దు చేసి కొత్త ట్రిబ్యునల్ ఏర్పాటు చేయాలా లేక కృష్ణా ట్రిబ్యునల్-2కు అదనపు బాధ్యతలు అప్పగిస్తూ విధివిధానాలు ఖరారు చేస్తే సరిపోతుందా అన్న అంశంపై న్యాయశాఖ అభిప్రాయాన్ని కోరింది. న్యాయశాఖ నుంచి వచ్చిన సూచనలు, సిఫార్సుల మేరకు కేంద్రం బుధవారం కృష్ణా ట్రిబ్యునల్-2కు ఏపీ తెలంగాణ రాష్ట్రాల మధ్య నదీజలాల వాటాలను తేల్చడంతో పాటు నదీ జలాల సంబంధిత వివాదాలను పరిష్కరించే బాధ్యత అప్పగించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement