న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ : ప్రభుత్వాలు న్యాయస్థానాల పట్ల గౌరవంగా వ్యవహరించాలని కేంద్ర పర్యాటక, సాంస్కృతిక శాఖా మంత్రి కిషన్‌రెడ్డి సూచించారు. శుక్రవారం న్యూఢిల్లీలోని తన నివాసంలో విలేకరుల సమావేశం నిర్వహించిన కిషన్‌రెడ్డి తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన పలు అంశాలపై స్పందించారు. మూడు రాజధానుల అంశంపై హైకోర్టు ఇచ్చిన తీర్పుపై ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో ముఖ్యమంత్రి సహా ఇతర శాసనసభ్యులు సుదీర్ఘంగా చర్చ జరపడం సబబేనా? ఇది రాజ్యాంగాన్ని అవమానించినట్టు కాదా? అని ఓ మీడియా ప్రతినిధి అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానమిచ్చారు. న్యాయస్థానాల పట్ల అందరూ గౌరవంగా వ్యవహరించాలని, తీర్పులను గౌరవించాలని కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. ఏపీ ప్రభుత్వానికి హైతీర్పు అంగీకారంగా అనిపించకపోతే హైకోర్టుకు వెళ్లాలే గానీ వ్యవస్థలను దెబ్బ తీసేలా వ్యవహరించకూడదని అభిప్రాయపడ్డారు. శాసన వ్యవస్థ, న్యాయవ్యవస్థ, పత్రికా వ్యవస్థలు కీలకమైనవని, వాటిని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందని అన్నారు.
తెలుగు రాష్ట్రాల్లో సాంస్కృతిక ఉత్సవాలు..
ఉభయ తెలుగు రాష్ట్రాల్లో జాతీయ సాంస్కృతిక ఉత్సవాలు నిర్వహించడానికి ప్రధానమంత్రి నరేంద్రమోదీ అనుమతిచ్చారని కిషన్ రెడ్డి తెలిపారు. నేడు(26) రాజమహేంద్రవరంలో గోదావరి నది తీరంలో ఉత్సవాలు జరుగుతాయని, ఏపీ గవర్నర్ ఉత్సవాలు ప్రారంభిస్తారని, మంత్రులు, ప్రజా ప్రతినిధులు ఇందులో పాల్గొంటారని చెప్పారు. రాజమండ్రిలో జరిగే రాష్ట్రీయ సాంస్కృతిక ఉత్సవాల్లో తనతో పాటు సాంస్కృతిక శాఖ సహాయ మంత్రి మీనాక్షి లేఖి పాల్గొంటున్నారని వెల్లడించారు. ఉత్సవాలు జరుగుతున్న రాష్ట్రం నుంచి 25 శాతం కళాకారులు పాల్గొంటారని, దేశవ్యాప్తంగా ఉన్న ఇతర రాష్ట్రాల కళాకారులు తమ కళలు ప్రదర్శిస్తారని అన్నారు. మార్చి 29, 30 తేదీల్లో వరంగల్ ఆర్ట్స్ కళాశాలలో జరిగే ఉత్సవాలను తెలంగాణా గవర్నర్ తమిళిసై ప్రారంభిస్తారని కిషన్ రెడ్డి తెలిపారు. సాయంత్రం 5 గంటల నుంచి 11 గంటల వరకు వెయ్యి మంది కళాకారులు సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొంటారని కేంద్ర మంత్రి అన్నారు.
ఏప్రిల్ 1,2,3 తేదీల్లో ఎన్టీఆర్ గార్డెన్స్‌లో రాష్ట్రీయ సాంస్కృతిక ఉత్సవాలు జరుగుతాయని చెప్పుకొచ్చారు. ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, మహారాష్ట్ర, తమిళనాడు, హర్యానా గవర్నర్లు రాష్ట్రీయ సాంస్కృతిక ఉత్సవాల్లో పాల్గొంటారని పేర్కొన్నారు. ఇటీవల పద్మ పురస్కారాలు అందుకున్న ప్రముఖులు తమ కళలను ప్రదర్శిస్తారని తెలిపారు. మూడేళ్ల క్రితం బెంగాల్, అంతకు ముందు మధ్యప్రదేశ్‌లో రాష్ట్రీయ సాంస్కృతిక ఉత్సవాలు జరిగాయని గుర్తు చేశారు. అనేక మంది సంగీత విద్వాంసులు, గాయనీగాయకులను తెలుగు రాష్ట్లాల ఉత్సవాలకు ఆహ్వానించామని, అలాగే రెండు రాష్ట్ర ప్రభుత్వాలకు ప్రోటోకాల్ ప్రకారం సమాచారమిచ్చామని కిషన్‌రెడ్డి వివరించారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి..