Tuesday, November 26, 2024

సంగీత మహారాజ్ఞికి సరైన గౌరవం.. అయోధ్యలో లతా మంగేష్కర్ చౌక్ ప్రారంభం

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: భారతదేశ సంగీత సౌరభాన్ని దేశ, విదేశాల్లో సుస్థిరం చేసిన సంగీత మహారాజ్ఞి లతా మంగేష్కర్ ప్రజల గుండెల్లో చిరకాలం నిలిచిపోతారని కేంద్ర సాంస్కృతిక, పర్యాటక, ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డి పేర్కొన్నారు. 1962 భారత్-చైనా యుద్ధ సమయంలో లతా మంగేష్కర్ పాడిన ‘యే మేరీ వతన్ కీ లోగో.. జర ఆంఖోమే భర్ లో పానీ’ అనే పాట యావద్భారతాన్నీ ఒక తాటిపైకి తీసుకొచ్చిందని కిషన్ రెడ్డి గుర్తుచేశారు. ఆగస్టు 15 అయినా, జనవరి 26 అయినా మరే ఇతర జాతీయ కార్యక్రమం అయినా లతాదీదీ పాడిన ఈ పాట లేకుండా సంపూర్ణం కాదని ఆయన పేర్కొన్నారు.

బుధవారం ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్యలో ‘లతా మంగేష్కర్ చౌక్’ను ప్రారంభించి లతా దీదీ స్మృతిగా ఏర్పాటుచేసిన 40 అడుగుల వీణను యూపీ ముఖ్యమంత్రి యోగి, ఆదిత్యనాథ్ లో కలిసి కిషన్ రెడ్డి జాతికి అంకితం చేశారు. ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. దేశ కీర్తి ప్రతిష్టలను పెంచడంతోపాటు తన గాత్రం ద్వారా ప్రజల్లో స్ఫూర్తిని కలిగించిన లతా మంగేష్కర్ ను నిరంతరం స్మరించుకోవాలన్న సత్సంకల్పంతోనే అయోధ్యలో ఈ వీణ విగ్రహాన్ని ఏర్పాటు చేసుకున్నట్లు వెల్లడించారు.

పాటలకు ప్రాణం పోయడం ద్వారా తనకంటూ ప్రత్యేకతను సంపాదించుకున్న లతా మంగేష్కర్ స్ఫూర్తిని ఈ 40 అడుగుల వీణ ద్వారా యువ గాయకులు పొందేందుకు ప్రోత్సాహం లభిస్తుందన్నారు. పెద్దలు సాధించిన కీర్తి ఎప్పటికీ మన మస్తిష్కాల్లో స్ఫూర్తిని రగిలించాలంటే ఇలాంటి స్మారకాలు ఉండాల్సిందేనని కిషన్ రెడ్డి పేర్కొన్నారు.

- Advertisement -

భారతీయ సంగీతం, సంస్కృతి, సంప్రదాయాలను, మన వారసత్వాన్ని కాపాడుకునేందుకు భారత ప్రభుత్వం కృషిచేస్తోందని కిషన్ రెడ్డి అన్నారు. ఇందుకు యోగి ప్రభుత్వం నుంచి సంపూర్ణ సహకారం లభిస్తుందన్నారు. శ్రీరాముడి భవ్య మందిర నిర్మాణం జరుగుతోందని.. ఎన్నో శతాబ్దాలుగా ఎదురుచూస్తున్న స్వప్నం సాకారమయ్యే సమయం ఆసన్నమైందని కిషన్ రెడ్డి పేర్కొన్నారు. అయోధ్యను ప్రధాన పర్యాటక కేంద్రంగా మార్చేందుకు ఇక్కడ అవసమైన మౌలిక వసతుల కల్పన వేగంగా జరుగుతోందని, దీంతోపాటుగా దేశ, విదేశీ పర్యాటకుల సౌలభ్యం కోసం అంతర్జాతీయ విమానాశ్రయాన్ని నిర్మించే ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయని ఆయన అన్నారు.

అనంతరం యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ మాట్లాడుతూ.. లతా మంగేష్కర్ ను స్మరించుకునేందుకు ఈ చౌరస్తాకు ఆమె పేరు పెట్టామని.. అదే విధంగా అయోధ్యలోని ప్రతి చౌరస్తాకు ఆధ్యాత్మిక వ్యక్తుల పేర్లు పెడతామని, రామజన్మభూమి ఉద్యమంలో భాగస్వాములైన సాధుసంతుల పేర్లు పెడతామని ఆయన పేర్కొన్నారు. అయోధ్యలో అభివృద్ధి విషయంలో రాజీ పడబోమన్నారు. భారతీయ సంస్కృతి, సంప్రదాయాలు, వారసత్వానికి సరైన గౌరవం కల్పిస్తామని ఆయన అన్నారు. మర్యాదా పురుషోత్తముడు చూపిన బాటలో ప్రతి ఒక్కరూ ధైర్యంగా ముందుకెళ్లాలని యోగి అన్నారు.

జరుగుతున్న పురోగతికి ప్రతి అయోధ్యవాసి సహకరించాలని అంతర్జాతీయ ఆధ్యాత్మిక కేంద్రంగా ప్రత్యేకస్థానాన్ని నిలుపుకోనున్న అయోధ్య నగరాన్ని స్వచ్ఛంగా ఉంచేందుకు అందరూ భాగస్వాములు కావాలన్నారు. ప్లాస్టిక్ ముక్త అయోధ్య ను నిర్మించే ప్రయత్నంలో ప్రభుత్వానికి సహకరించాలన్నారు. ఈ కార్యక్రమంలో యూపీ సీఎం యోగి, కేంద్ర మంత్రి జి.కిషన్ రెడ్డి, యూపీ మంత్రులు, సాధు, సంతులు, అధికారులు, అయోధ్య ప్రజలు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement