న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: తెలంగాణ ప్రభుత్వం గిరిజన రిజర్వేషన్లు పెంచుతూ జారీ చేసిన ఉత్తర్వులపై రాష్ట్ర హైకోర్టులోనే పిటిషన్ దాఖలు చేసుకోవాలని సుప్రీంకోర్టు సూచించింది. రాష్ట్రంలో గిరిజన రిజర్వేషన్ల పెంపునకు వ్యతిరేకంగా సుప్రీంకోర్టులో దాఖలైన పిటిషన్‌పై శుక్రవారం విచారణ జరిగింది. గిరిజన, ఆదివాసీ సంఘాలు దాఖలు చేసిన పిటిషన్‌పై జస్టిస్ విక్రమ్‌నాథ్, జస్టిస్ దీపాంకర్ దత్తా ధర్మాసనం విచారణ జరిపింది. గిరిజన రిజర్వేషన్ల పెంపు జీవో చట్ట బద్ధం కాదని, దాని వల్ల ఆదివాసీలకు నష్టం జరుగుతుందని, రాజ్యాంగ ధర్మాసనం తీర్పుకి విరుద్ధంగా ఉన్న జీవోని కొట్టివేయాలని పిటిషన్‌లో పేర్కొన్నాయి. పిటిషనర్ల తరపున న్యాయవాదులు రంజిత్ కుమార్, ఎంఎన్ రావు, అల్లంకి రమేష్ వాదనలు వినిపించారు.
రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో వల్ల ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన సుగాలి, లంబాడా, బంజారా గిరిజనులకు మాత్రమే లబ్ధి చేకూరుతుందనీ వాదించారు. గతంలో చెల్లప్ప కమిషన్ 9 శాతం వరకే రిజర్వేషన్లు పెంచుకోవచ్చని సూచించిందని గుర్తు చేశారు. ప్రభుత్వ నిర్ణయంతో రాష్ట్రంలోని గిరిజనులకు నష్టం జరుగుతుందని చెప్పుకొచ్చారు. రిజర్వేషన్లను 6 నుంచి 10 శాతానికి పెంచుతూ ప్రభుత్వం తీసుకొచ్చిన జీవోని కొట్టివేయాలని అభ్యర్థించారు. అయితే ఈ అంశంపై తెలంగాణ హైకోర్టునే ఆశ్రయించాలని, రాష్ట్ర ఉన్నత న్యాయస్థానంలో రిట్ పిటిషన్ దాఖలు చేయాలని సుప్రీంకోర్టు సూచించింది.