Tuesday, November 26, 2024

జీవో నెంబర్ 1 కేసు సంగతి త్వరగా తేల్చండి.. ఏపీ హైకోర్టుకు సుప్రీంకోర్టు ఆదేశం

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో నెంబర్ 1పై ఏపీ హైకోర్టులో దాఖలైన కేసును త్వరగా తేల్చాలంటూ సోమవారం సుప్రీంకోర్టు ఆదేశించింది. తెలుగుదేశం పార్టీ నేత కొల్లు రవీంద్ర దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ చేపట్టిన భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ పమిడిఘంటం శ్రీ నరసింహతో కూడిన ధర్మాసనం, పిటిషనర్ లేవనెత్తిన అంశాలను పరిశీలించింది. తాము దాఖలు చేసిన పిటిషన్‌పై ఏపీ హైకోర్టు జనవరి 24న విచారణ ముగించి తీర్పును రిజర్వులో పెట్టిందని, అప్పటి నుంచి ఇప్పటి వరకు తీర్పును వెలువరించడం లేదని పిటిషనర్ సుప్రీంకోర్టు దృష్టికి తీసుకొచ్చారు.

- Advertisement -

ఈ కారణంగా హైకోర్టు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులే ఇప్పటికీ అమల్లో ఉన్నాయని, కేసును పరిష్కరిస్తే తుది ఉత్తర్వుల మేరకు నడుకునే వెసులుబాటు ఉంటుందని తెలిపారు. ఇప్పటికే విచారణ ముగించి తీర్పును రిజర్వు చేసిన కేసులో త్వరగా తీర్పునిచ్చి కేసును పరిష్కరించాలని సుప్రీంకోర్టు ధర్మాసనం ఆంధ్రప్రదేశ్ హైకోర్టును ఆదేశించింది. అదే సమయంలో పిటిషనర్‌ను ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిని ఆశ్రయించాల్సిందిగా సూచించింది.

జాతీయ రహదారులు సహా రాష్ట్రంలో రహదారులపై రాజకీయ సభలు, సమావేశాలు నిర్వహించడాన్ని నిషేధిస్తూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం జీవో నెంబర్ 1 తీసుకొచ్చింది. అప్పటికే ఉన్న చట్టం నుంచే ఈ నిబంధనలు తీసుకొచ్చినట్టు పేర్కొంది. అయితే ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు నిర్వహిస్తున్న సభలు, సమావేశాలను అడ్డుకోవడం కోసమే రాష్ట్ర ప్రభుత్వం ఈ జీవోను తీసుకొచ్చిందని తెలుగుదేశం నేతలు ఆరోపించారు.

ప్రభుత్వ జీవోను ఇతర కమ్యూనిస్టులు సహా ఇతర ప్రతిపక్షాలు సైతం తప్పుబట్టాయి. ఈ పరిస్థితుల్లో వారంతా ఏపీ హైకోర్టును ఆశ్రయించగా, అందరి వాదనలు విన్న హైకోర్టు తీర్పును రిజర్వులో ఉంచింది. అయితే ఇంతకాలం తీర్పు వెలువరించకపోవడం, తీవ్ర జాప్యం చోటుచేసుకోవడంపై పిటిషనర్లు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. తమ పిటిషన్‌పై త్వరగా విచారణ చేపట్టాలంటూ గత సోమవారం ప్రధాన న్యాయమూర్తిని ఆశ్రయించి మెన్షన్ చేయగా, ఈ సోమవారం విచారణ జరిపిన ధర్మాసనం ఆదేశాలు జారీ చేసింది. 

Advertisement

తాజా వార్తలు

Advertisement