సామాన్యులకు, చిన్న సంస్థలకు కూడా ఆర్బిట్రేషన్ – మీడియేషన్ సేవలు అందుబాటులో ఉండాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. హైదరాబాద్‌లో ప్రారంభమైన కామన్వెల్త్ ఆర్బిట్రేషన్ – మీడియేషన్ సదస్సు 2024 లో పాల్గొని ప్రసంగించారు. మధ్యవర్తిత్వం ద్వారా సమస్యలను పరిష్కరించేందుకు ‘‘ఇంటర్నేషనల్ ఆర్బిట్రేషన్ అండ్ మీడియేషన్ సెంటర్’’ (IAMC) చేస్తున్న కృషిని ముఖ్యమంత్రి అభినందించారు.
పెండింగ్ కేసుల భారాన్ని తగ్గించేందుకు, కేసులను త్వరగా, సమర్ధవంతంగా పరిష్కరించేందుకు ప్రత్యామ్నాయ వ్యవస్థలు అవసరమని అన్నారు. ప్రజాస్వామ్యానికి న్యాయవ్యవస్థ మూలస్తంభమని, అయితే పెండింగ్‌లో ఉన్న కేసులు పెద్దఎత్తున న్యాయవ్యవస్థకు సవాలుగా మారాయని ఆందోళన వ్యక్తం చేశారు.
చర్చలు, సంప్రదింపులు, మధ్యవర్తిత్వం వల్ల వివాదాలు అతి త్వరగా పరిష్కారమయ్యే అవకాశం ఉందని… అందుకోసం కృషి చేస్తున్న ఐఏఎంసీ సేవలు ప్రపంచ పెట్టుబడిదారులు, బడా పారిశ్రామికవేత్తలకే పరిమితం కాకుండా సామాన్యులకు కూడా అందుబాటులోకి రావాలని ముఖ్యమంత్రి కోరారు.
లండన్, సింగపూర్ తర్వాత హైదరాబాద్ నగరం మధ్యవర్తిత్వ పటంలో నిలవడం గర్వించదగ్గ విషయమన్నారు. ఫ్యూచర్ సిటీ, ఏఐ సిటీ వంటి కొత్త ప్రణాళికలతో హైదరాబాద్ గ్లోబల్ లీడర్‌గా ఎదుగుతున్నదని… సాఫ్ట్‌వేర్, ఫార్మా, లైఫ్ సైన్సెస్, హెల్త్ కేర్, బయో టెక్నాలజీ పరిశ్రమలకు పవర్ హబ్‌గా హైదరాబాద్ ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పొందిందని చెప్పారు.
ఈ సదస్సులో సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ భూషణ్ రామకృష్ణ గవాయ్ తో పాటు తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరాధే, శ్రీలంక సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఏహెచ్ఎండీ నవాజ్, కామన్వెల్త్ లాయర్స్ అసోసియేషన్ ప్రసిడెంట్ డాక్టర్ పీటర్ డి.మేనార్డ్ కేసీ గార్లతో పాటు న్యాయ రంగానికి చెందిన అనేకమంది ప్రముఖులు సదస్సుకు హాజరయ్యారు.