హస్తం పార్టీ ఓటమికి నైతిక బాధ్యత వహిస్తూ అధ్యక్ష పదవికి గుడ్ బై
ముంబయి – మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రె పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఈ క్రమంలో మహారాష్ట్ర పీసీసీ చీఫ్ నానా పటోల్ తన పదవికి రాజీనామా చేశారు. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ ఓటమికి బాధ్యత వహిస్తూ ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు రాజీనామా పత్రాన్ని హైకమాండ్‌కు పంపారు.
కాగా శనివారం వెలువడిన ఎన్నికల ఫలితాల్లో మహాయుతి కూటమి ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. 288 స్థానాలకు గానూ ఏకంగా.. 233 స్థానాల్లో జయభేరి మోగించింది. ప్రతిపక్ష మహావికాస్ అఘాడీ కూటమి కేవలం 51 చోట్ల మాత్రమే విజయం సాధించింది. ఇక కూటమిలో భాగంగా 101 స్థానాల్లో పోటీ చేసిన కాంగ్రెస్ కేవలం 16 స్థానాల్లో మాత్రమే గెలుపొందింది. 2021లో నానా పటోల్ మహారాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టారు. ఈ ఏడాది ప్రారంభంలో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో ఆయన నాయకత్వంలో కాంగ్రెస్ 17 స్థానాల్లో పోటీ చేసి ఏకంగా 13 స్థానాల్లో గెలుపొందింది. అయితే అసెంబ్లీకి జరిగిన ఎన్నికలలో మాత్రం ఆ పార్టీకి నిరాశమిగిల్చింది.