కొత్త డిల్లీ – బిజెపికి చెందిన 10 ఎంపీలు నేడు తమ సభ్యత్వాలకు రాజీనామా చేశారు.. ఈ మేరకు లోక్ సభ స్పీకర్ కు విడివిడిగా లేఖలు అందజేశారు.. వివరాలలోకి వెళితే, అయిదు రాష్ట్రాల ఎన్నికల్లో 3 రాష్ట్రాల్లో బీజేపీ ఘన విజయం సాధించింది. మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల్లో కాషాయ జెండాను ఎగరేసింది. ఈ అసెంబ్లీ ఎన్నికల్లో బిజెపికి చెందిన 12 మంది లోక్‌సభ ఎంపీలు, వారి రాష్ట్రాల్లో పోటీ చేసి గెలుపొందారు. ఈ నేపథ్యంలో ఈ రోజు 10 మంది బీజేపీ ఎంపీలు తమ పదవులకు రాజీనామా చేశారు. రాజీనామాలను సమర్పించేందుకు బీజేపీ చీఫ్ జేపీ నడ్డా నేతృత్వంలో ఎంపీల బృందం స్పీకర్ని కలిసి రాజీనామా లేఖలు అందజేసింది.
స్పీకర్‌ను కలిసిన వారిలో మధ్యప్రదేశ్‌కు చెందిన నరేంద్ర తోమర్, ప్రహ్లాద్ పటేల్, రితీ పాఠక్, రాకేష్ సింగ్, ఉదయ్ ప్రతాప్ సింగ్ ఉన్నారు. రాజస్థాన్ నుండి, రాజీనామా సమర్పించిన ఎంపీలలో రాజ్యవర్ధన్ రాథోడ్, కిరోడి లాల్ మీనా , దియా కుమారి ఉన్నారు. ఇక ఛత్తీస్‌గఢ్ నుంచి అరుణ్ సావో, గోమతి సాయి ఉన్నారు. ఇదిలా ఉంటే రాజస్థాన్ ముఖ్యమంత్రి రేసులో ఉన్న బాబా బాలక్ నాథ్, రేణుకా సింగ్ ఇంకా రాజీనామా చేయకపోవడం గమనార్హం.