Friday, November 22, 2024

Delhi | పునరావాసం కేంద్ర ప్రభుత్వ ప్రాథమిక బాధ్యత.. హస్తినలో పోలవరం నిర్వాసితుల ఆందోళన


న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: జాతీయ ప్రాజెక్టుల్లో నిర్వాసితులను ఆదుకోవడం కేంద్ర ప్రభుత్వ ప్రాథమిక బాధ్యత అని సీపీఐ(ఎం) ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి అన్నారు. సోమవారం ఉదయం ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులకు పరిహారం, పునరావాసం కల్పించాలని డిమాండ్ చేస్తూ సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో భారీ ప్రదర్శన చేపట్టారు. ఈ ఆందోళనకు వివిధ పార్టీల ఎంపీలు, నేతలు హాజరై మద్దతు తెలిపారు. పోలవరం ప్రాజెక్టు కారణంగా ముంపునకు గురైన గిరిజన గ్రామాల ప్రజలు పెద్ద సంఖ్యలో ఈ ధర్నాలో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా సీతారాం ఏచూరి మాట్లాడుతూ.. పోలవరం ప్రాజెక్టు పరిధిలో 8 మండలాల్లో దాదాపు 390 గ్రామాలు ముంపుకు గురవుతున్నాయని తెలిపారు. వారందరికీ పరిహారం చెల్లించడంతో పాటు పునరావాసం కల్పించాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వానిదేనని అన్నారు. బాధితుల కోసం కేంద్రంపై ఒత్తిడి తేవాల్సిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రధాని మోడీ ముందు సాగిలపడిందని ఏచూరి ఆరోపించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి నిర్వాసితులను, గిరిజనులను మోసం చేస్తున్నాయని విమర్శించారు.

2013 భూసేకరణ చట్టం ప్రకారం నష్టపరిహారం చెల్లిస్తూ పునరావాసం కల్పించాలని ఆయన డిమాండ్ చేశారు. పునరావస కాలనీల్లో అన్ని సౌకర్యాలు కల్పించాలని అన్నారు. నిర్వాసితుల సమస్య పరిష్కారం కాకుండా పోలవరం ప్రాజెక్టు పూర్తి కాదని ఏచూరి వ్యాఖ్యానించారు. పార్లమెంటు చేసిన చట్టాలని గౌరవించి అమలు చేయాలని ఏచూరి అన్నారు. బాధితులకు న్యాయం జరిగే వరకు సీపీఐ(ఎం) పోరాడుతుందని ప్రకటించారు.

- Advertisement -

సీపీఐ(ఎం) పోలిట్ బ్యూరో సభ్యురాలు బృందాకారత్ మాట్లాడుతూ.. కేసుల భయంతోనే సీఎం జగన్ కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించడం లేదని అన్నారు. తాను రెండు మూడు సార్లు పోలవరంలో పర్యటించానని గుర్తుచేస్తూ.. ఆదివాసీలకు అన్యాయం చేసి ప్రాజెక్టు కట్టి ఏం సాధిస్తారని, ఆదివాసీలు దేశంలో భాగం కాదా అని ప్రశ్నించారు. కేంద్రంలోని మోడీ ప్రభుత్వం ఆదివాసీల హక్కులను కాలరాస్తోందని మండిపడ్డారు.

సీపీఐ(ఎం) ఏపీ రాష్ట్ర కార్యదర్శి వి. శ్రీనివాస రావు మాట్లాడుతూ.. పోలవరం ముంపు సమస్య జాతీయ సమస్యగా మారిందని, అందుకే వందలాది మంది నిర్వాసితులు, గిరిజనులు ఢిల్లీకి తరలివచ్చారని అన్నారు. ముంపు బాధితుల ప్యాకేజీ మొత్తాన్ని కేంద్ర ప్రభుత్వం భరించాలని డిమాండ్ చేశారు. పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయడం అంటే నిర్వాసితుల సమస్యను పరిష్కరించడమేనని ఆయన తెలిపారు. 

Advertisement

తాజా వార్తలు

Advertisement