హైదరాబాద్, ఆంధ్రప్రభ: నదీలోయ ప్రాంతాలే నాగరికతకు నిలయాలు, అనేక సంస్కృతులు,ఆచారవ్యవహారాలు నదీలోయ ప్రాంతాల్లోనే జీవం పోసుకున్నాయి. తెలంగాణ గోదావరి పరివాహక ప్రాంతం దీనికోతార్కాణం. ఈ ప్రాంతంలో అనేక ప్రాచీన ఆలయాలు, పరవశించే ప్రకృతి ఇక్కడ దర్శనిమిస్తుండటంతోపాటుగా కర్ణమామిడి ప్రాంతంలో అశోకచక్రవర్తి విడిది గృహం ఉన్నట్లు పురావస్తుశాఖ తవ్వకాలుకూడా చేపట్టింది. ఈ ప్రాచీన ప్రాంతాల్లోని చరిత్రసంపదను రిజర్వాయర్లను కలుపుతూ పర్యాటక ప్రాంతాలుగా అభివృద్ధి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికలను సిద్ధం చేసింది.
ఇందులో భాగంగా రాష్ట్రంలో రూపుదిద్దుకున్న జలాశయాలపరిసరాలను పర్యాటకప్రాంతాలుగా రూపుదిద్దుకోబోతున్నాయి. ఇప్పటికే ఉప్పొంగుతున్న జలాశయాలను చూసేందుకు పొరుగురాష్ట్రాల నుంచి కూడా పర్యాటకులు వస్తుండటంతో మొదటి దశలో కాళేశ్వరం ప్రాజెక్టు ప్రాంతాలు పర్యాటక ప్రాంతాలుగా తీర్చిదిద్దేందుకు ప్రణాళికలు సిద్ధంచేయాలని రాష్ట్ర ప్రభుత్వం పర్యాటక శాఖను అదేశించింది. కాళేశ్వరం ప్రాజెక్టు లో భాగంగా నిర్మించిన బ్యారేజీల తోవందలకిలో మీటర్ల మేర గోదావరి లో నిత్యం జలకళ ఉట్టిపడుతుంది. నదీకి రెండువైపులా దట్టమైన అటవీ ప్రాంతాలున్నాయి. ఈ సుందరదృశ్యాలను ప్రజలు తిలకించే విధంగా బోటింగ్ ఏర్పాటు చేసేందుకు రాష్ట్ర పర్యాటక శాఖ ఇప్పటికే పనులు ప్రారంభించింది. బృందావన్ గార్డెన్ లాంటీ ఫౌంటేన్ మ్యూజికల్ వాటర్ పార్కులుఏర్పాటు చేయనున్నారు
రిజర్వార్లు ఇక పర్యాటక ప్రాంతాలు
తొలిదశలో కాళేశ్వరం ప్రాజెక్టు ను పర్యాటక ప్రాంతంగా తీర్చి దిద్దిన అనంతరం తుపాకుల గూడేం, బాసర, ధర్మపురి,కోటిలింగాల ప్రాంతాల్లోని ఆలయాల ప్రాంతాల్లో టెంపుల్ టూరిజం అభివృద్ధి చేసేందుకు ఫైల్లు కదులుతున్నాయి. ప్రస్తుత చలికాలం నుంచి వేసవికాలం లోపు అనేక ప్రాంతాల్లో పర్యాటక ప్రాజెక్టుల పనులు ప్రారంభించేందుకు అధికారులు సిద్ధమయ్యారు.అలాగే నదీలోయలో విస్తరించిన సింగరేణీ బొగ్గుగనుల ప్రాంతాలను కూడా పర్యాటకప్రాంతాలుగా తీర్చి దిద్దేఅవకాశాలున్నాయని అధికారులు చెప్పారు. ఎంతో చరిత్ర సుందరమైన ప్రకృతి సంపద ఉన్న తెలంగాణ ప్రాంతాల్లో పర్యాటక రంగాభివృద్ధికి విస్తృత అవకాశాలు ఉండటంతో ఉపాధి అవకాశాలు కూడా మెరుగు పడతాయని ప్రభుత్వం భావిస్తతుంది.
పరోక్ష,ప్రత్యేక్ష ఉపాధి అవకాశాలు ఏర్పడే విధంగా రిజర్వాయర్ల పరిసరాల్లో పర్యాటక అభివృద్ధి పనులు ప్రారంభిస్తున్నారు. అలాగే దేవాదుల ప్రాంతంలో ఆలయ టూరిజం, కల్వకుర్తి, బీమా, నెట్టెంపాడు రిజర్వాయర్ల పరిసరాల్లో పర్యాటక రంగానికి అనువైన ప్రాంతాలపై సర్వే జరుగుతున్నది. గోదావరి నదీ పరివాహక ప్రాంతాల్లోని ఆలయాల పునరుద్ధరణ కోసం ప్రణాళికలను ప్రభుత్వం సిద్ధం చేస్తుంది. అలాగే జలపాతాలకు నిలయమైన ఆదిలాబాద్ లో పర్యాటక రంగాభివృద్ధిని వేగవంతం చేయనున్నట్లు తెలిసింది. పొచ్చర జలపాతం సుందరీకరణ పనులపై పర్యాటక శాఖ దృష్టి సారించింది. కుంతల జలపాతం సందర్శకుల శాతం పెరుగుతుండటంతో సదుపాయాలను కూడా మెరుగు పర్చేందుకు కార్యక్రమాల రూపకల్పన జరుగుతుంది. అలాగే పోచంపల్లి రిజర్వాయర్ పరిసరాల్లో ఉన్న అభయారణ్యంతో పాటుగా 1918లో నిర్మించిన నిజాం ప్యాలెస్‌ను పర్యాటకులు తిలకించేందుకు సుందరీకరణ పనులు చేపట్టనున్నారు.
కాళేశ్వరం సర్కిట్ అభివృద్ధికి ప్రత్యేక శ్రద్ధ
కాళేశ్వరం ఎత్తిపోతల ప్రాజెక్టు ఓఅద్భుత ఇంజనీరింగ్.ఇక్కడి పరిసరాల్లో ప్రాచీన ఆలయాలు, కిలో మీటర్ల పరిదిలో ప్రవహిస్తున్న గోదావరి,పచ్చని కొండలు, చిక్కని అడవి ఆహ్లాదకరమైన వాతావరణాన్ని తిలకించేందుకు నిత్యం సందర్శకుల సంఖ్య పెరుగుతుంది. ఈ నేపథ్యంలో కాళేశ్వరం సర్కిట్ ను పర్యాటకప్రాంతంగా తీర్చి దిద్దేందుకు రూ.1500కోట్ల అంచనావ్యవయంతో ప్రణాళికలు సిద్ధం అవుతున్నాయి. అలాగే రంగనాయక సాగర్ అభివృద్ధికి సుమారు రూ.150 కోట్లకు ప్రభుత్వం పరిపాలనాపరిమైన అనుమతులు ఇచ్చింది. మిడ్ మానేరు, లోయర్ మానేరు ప్రాంతాలను టూరిజం ప్రాంతాలుగా తీర్చి దిద్దేందుకు రాష్ట్ర పర్యాటక శాఖ ప్రణాళికలను రూపొందిస్తుంది.
అలాగే కొండపోచమ్మ, బస్వాపూర్ రిజర్వాయర్ ప్రాంతాల సుందరీకరణ పనులు ప్రారంభం కానున్నాయి. పర్యాటక ప్రాంతాల్లో అక్కడి స్థానిక చరిత్ర పై ప్రజలకు అవగాహన కల్పించేందుకు ప్రత్యేక కార్యక్రమాలు రూపొందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నిస్తుంది. రిజర్వాయర్ల నిర్మాణంతో తెలంగాణ కోటిఎకరాల మాగాణిగా అవతరించడంతో పాటుగా ఎక్కడికక్కడ పర్యాటకరంగాన్ని అభివృద్ధి చేసి తెలంగాణ అందాలను ద్విగిణీకృతం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న కృషీ ఫలిస్తుందని పలువురు భావిస్తున్నారు.