హైదరాబాద్, ఆంధ్రప్రభ: శ్రీశైలం, నాగార్జునసాగర్ నుంచి జలవిద్యుదుత్పత్తి విధి విధానాలు, నీటి నిల్వ, నీటి విడుదల ప్రక్రియలు(రూల్ కర్వ్), వరద జలాల మళ్లింపుపై ఇరు రాష్ట్రాల తో సంప్రదింపులు జరిపేందుకు కృష్ణా నదీ యాజమాన్య బోర్డు (కేఆర్‌ఎంబీ) ఏర్పాటు చేసిన రిజర్వాయర్స్ మేనేజ్‌మెంట్ కమిటీ (ఆర్‌ఎంసీ) మూడో సమావేశం ఈ నెల 28న జరగనుందని నీటిపారుదలశాఖ ఉన్నతాధికారులు చెబుతున్నారు. వాస్తవానికి ఈ నెల 16న ఆర్‌ఎంసీ మూడో సమావేశం జరగాల్సి ఉండగా… ఏపీ నీటిపారుదల శాఖ వర్గాల అభ్యర్థన మేరకు సమావేశాన్ని వాయిదా వేశారు. అంతకుముందు జరిగిన రెండు ఆర్‌ఎంసీ సమావేశాలకు తెలంగాణ నీటిపారుదల శాఖవర్గాలు హాజరుకాలేదు.
వానాకాల ముందస్తు సన్నాహాక ఏర్పాట్లలో ఉన్నందున ఆర్‌ఎంసీ సమావేశాలను జూన్ 16న ఏర్పాటు చేయాలని తెలంగాణ ఈఎన్‌సీ మురళీధర్ బోర్డును కోరారు. ఉమ్మడి రిజర్వాయర్ల నిర్వహణపై తెలంగాణ అభిప్రాయాలను వినేందుకు బోర్డు ఈ నెల 16న సమావేశాన్ని ఏర్పాటు చేసినా ఏపీ అధికారుల గైర్హాజరుతో సమావేశం జరగలేదు. ఆర్‌ఎంసీ ఉద్దేశ్యాలు, సమావేశంలోని అంశాలు కీలకంగా మారడంతో… మూడోసారి జరిగే సమావేశానికి అత్యంత ప్రాధాన్యత ఏర్పడింది. తెలంగాణ రాష్ట్రం కృష్ణా జలాలను 50:50శాతం ప్రాతిపదికన పం పిణీ చేయాలని కేఆర్‌ఎంబీకి స్పష్టం చేస్తోంది. తాత్కాలికం అంటూ… ప్రతీ నీటి ఏడాదిలో కృష్ణా జలాలను 66:34 శాతం ప్రాతిపదికన కేటాయించడంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తోంది.
శ్రీశైలం నుంచి ఏపీ 34 టీఎంసీలకు మించి తరలించకుండా నియంత్రించాలని బోర్డును డిమాండ్ చేస్తోంది. అయితే … ప్రస్తుతం వర్షాకాలం సమీపించడంతో కృష్ణలో నీటి లభ్యత పెరిగే అవకాశం ఉంది. వరద జలాలు వచ్చి రిజర్వాయర్లు నిండితే ఈ సారి కూడా తెలంగాణకు 34శాతం నీటి వాటానే కేటాయించే ప్రమాదముందని నీటిపారుదలరంగ నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వాస్తవానికి ఆర్‌ఎంసీ సేకరించాల్సిన అభిప్రాయాల్లో ఇరు తెలుగు రాష్ట్రాల మధ్య కృష్ణా జలాల వాటా అంశం కూడా ప్రధానంగా ఉంది.
కృష్ణా జలాల వినియోగంలో రెండు రాష్ట్రాల మధ్య వివాదాలకు ఉమ్మడి ప్రాజెక్టుల్లో విద్యుదుత్పత్తి, నీటి నిల్వ, విడుదల ప్రక్రియ, వరద రోజుల్లో మళ్లించిన నీటిని కోటా కింద లెక్కించాలా..?, వద్దా..? అన్నవే ప్రధాన అంశాలుగా ఉన్నాయి. ఈ సమస్య పరిష్కారానికి చేపట్టాల్సిన చర్యలపై నివేదిక ఇచ్చే బాధ్యతను ఆర్‌ఎంసీకి కేఆర్‌ఎంబీ అప్పగించింది. ఈ ఏడాది నీటి సంవత్సరం ప్రారంభానికి ముందే ఈ అంశాన్ని పరిష్కరించాల్సిన పరిస్థితుల్లో ఆర్‌ఎంసీ సమావేశం వాయిదా పడడంతో ఇరు రాష్ట్రాల నీటిపారుదలశాఖ అధికారులు అసంతృప్తితో ఉన్నారు. తాజాగా ఈనెల 28న ఆర్‌ఎంసీ సమావేశాన్ని మరోసారి నిర్వహించేందుకు కేఆర్‌ఎంబీ సన్నద్ధమవుతోంది.
సమావేశం తాలూకు ఆహ్వానాన్ని ఒకటి, రెండు రోజుల్లో ఇరు రాష్ట్రాల ఈఎన్‌సీలకు కేఆర్‌ఎంబీ పంపనుంది. ఇప్పటికే ఎజెండా అంశాలు ఖరారైన నేపథ్యంలో స మావేశం నిర్వహించడమే మిగిలి ఉంది. అయితే ఆర్‌ఎంసీ మూడో సమావేశానికైనా ఏపీ, తెలంగాణ ఇరిగేషన్ అధికారులు హాజరవుతారా..? లేదా..? అన్నది వేచి చూడాలి.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి.