న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: రాజ్యాంగం ప్రకారం దేశంలో మతం ప్రాతిపదికన రిజర్వేషన్లు లేనప్పటికీ చాలా రాష్ట్రాల్లో దొడ్డిదారిన ముస్లింలకు రిజర్వేషన్లు కల్పిస్తున్నారని నేషనల్ కమిషన్ ఫర్ బ్యాక్‌వర్డ్ క్లాసెస్ (ఎన్సీబీసీ) చైర్మన్ హన్స్‌రాజ్ గంగారాం ఆహిర్ అన్నారు. గురువారం ఢిల్లీలోని మహారాష్ట్ర సదన్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో రిజర్వేషన్ల దుర్వినియోగం, తద్వారా ఓబీసీ వర్గాలకు జరుగుతున్న అన్యాయం గురించి వెల్లడించారు. పశ్చిమ బెంగాల్‌లో ఓబీసీ రిజర్వేషన్లలో భారీగా రిగ్గింగ్ జరుగుతోందని ఆరోపించారు. ఈ ఏడాది ఫిబ్రవరి 25న జాతీయ బీసీ కమిషన్ చేపట్టిన బెంగాల్ పర్యటనలో విస్మయపరిచే విషయాలు వెలుగుచూశాయని చెప్పారు.
ప్రభుత్వ రంగ సంస్థ సీఆర్ఐ అంచనాల ప్రకారం పెద్ద మొత్తంలో హిందువులను ముస్లింలుగా మార్చుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. బంగ్లాదేశ్ నుండి వచ్చే ముస్లింలను కూడా ఓబీసీల జాబితాలో చేర్చారని, బంగ్లాదేశీయులతో పాటు మయన్మార్‌కు చెందిన రోహింగ్యాలను కూడా ఓబీసీ జాబితాలో చేర్చి రిజర్వేషన్లు అందజేస్తున్నారని తెలిపారు. పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం ‘ఖురేషీ’ ముస్లిం ఉపవర్గాన్ని ఓబీసీ కేంద్ర జాబితాలో చేర్చాలని కమిషన్‌కు ప్రతిపాదన పంపిందని, కానీ పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం ఆ వర్గాన్ని ఓబీసీగా పరిగణించలేదని, రాష్ట్ర జాబితాలోనూ చేర్చలేదని చెప్పారు. దేశంలో మతం ప్రాతిపదికన రిజర్వేషన్ వ్యవస్థ లేదని, కానీ అందరినీ మభ్యపెడుతూ దొడ్డిదారిన ముస్లింలకు రిజర్వేషన్లు కల్పిస్తున్నారని మండిపడ్డారు.
జాతీయ బీసీ కమిషన్ వాటిని తొలగించేందుకు కృషి చేస్తుందని తెలిపారు. చొరబాట్లు, అక్రమ వలసల ద్వారా పశ్చిమ బెంగాల్‌లో నివసిస్తున్న ప్రజలకు ఇచ్చిన ఓబీసీ రిజర్వేషన్లు రద్దు చేస్తామని, అయితే ఇందుకు కొంత సమయం పడుతుందని వెల్లడించారు. పశ్చిమ బెంగాల్‌లో మొత్తం 179 కులాలు ఓబీసీ రిజర్వేషన్లు పొందుతున్నాయని, అయితే ఆశ్చర్యకరంగా 118 కులాలు ముస్లిం మతానికి చెందినవే ఉన్నాయని అన్నారు. ఇంత పెద్ద సంఖ్యలో మైనారిటీ వర్గాలకు చెందిన కులాలను ఓబీసీల్లో చేర్చడం ఎలా సాధ్యమని ప్రశ్నించారు.
రాజస్థాన్‌లో ఓబీసీ రిజర్వేషన్లు అస్సలు లేని జిల్లాలు ఏడు గుర్తించామని, పెద్ద సంఖ్యలో ఓబీసీ ప్రజలు నివసిస్తున్నప్పటికీ వారికి కుల ధృవపత్రాలు ఇవ్వలేదని తెలిపారు. కమిషన్ జోక్యం తర్వాత, ఏడు జిల్లాల్లో ఓబీసీ సర్టిఫికేట్‌లను అందజేస్తున్నారని, ఫలితంగా లక్షలాది మంది ఓబీసీ ప్రజలు ప్రయోజనం పొందుతున్నారని చెప్పారు. కుల ప్రాతిపదికన జనాభా గణన నిర్వహించడం కమిషన్ పని కాదని, దీనిపై ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నప్పుడు తాము జనాభా గణనను చేపడతామని వెల్లడించారు. తెలంగాణలో 4% వరకు ఓబీసీ రిజర్వేషన్లను ముస్లిం వర్గాలకు ఇస్తున్నారని, ఆంధ్రప్రదేశ్‌లోనూ ఈ తరహా రిజర్వేషన్లు అమలవుతున్నాయని అన్నారు.