న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: వెనుకబడిన వర్గాలు (బీసీలు)కు చట్టసభల్లో రిజర్వేషన్లు కల్పించాలన్న ప్రధాన డిమాండ్‌తో ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద బీసీ సంక్షేమ సంఘం చేపట్టిన ధర్నాలో రెండో రోజు న్యాయమూర్తుల నియామకాల్లో రిజర్వేషన్లు అమలు చేయాలని నినదించారు. వైఎస్సార్సీపీ ఎంపీ, బీసీ సంక్షేమ సంఘం వ్యవస్థాపకులు ఆర్. కృష్ణయ్య ఈ ధర్నాలో పాల్గొని బీసీల గొంతు వినిపించారు. మహాధర్నాకు సంఘీభావం తెలుపుతూ తెలంగాణ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి మల్లు రవి, వైఎస్సార్సీపీ ఎంపీ బీద మస్తాన్ రావు తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆర్. కృష్ణయ్య మాట్లాడుతూ.. చట్ట సభల్లో బీసీలకు రిజర్వేషన్లతో పాటు కులగణన, బీసీలకు ప్రత్యేక మంత్రిత్వ శాఖ తదితర డిమాండ్లను గుర్తుచేశారు. తెలుగు రాష్ట్రాల్లో ఉన్నట్లుగా ప్రతి బీసీ విద్యార్థికి ఫీజ్ రియంబర్స్మెంట్ జాతీయస్థాయిలో అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అమలవుతున్న అమ్మఒడి పథకాన్ని దేశవ్యాప్తంగా అమలు చేసి, అందరికీ విద్యను అందించాలన్నారు. క్రీమిలేయర్ ఎత్తివేయాలని, బీసీలకు రూ. 2 లక్ష కోట్ల బడ్జెట్ కేటాయించాలని అన్నారు.
ఢిల్లీలో తెలంగాణ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి మల్లు రవి ఈ ధర్నాలో మాట్లాడుతూ.. బీసీ జనగణన జరగాలని రాహుల్ గాంధీ డిమాండ్ చేస్తున్నారని గుర్తుచేశారు. రాహుల్ గాంధీ డిమాండ్ తోనే కదలిక వచ్చిందని, ఆయా రాష్ట్రాలు బీసీ గణనపై ముందుకు వస్తున్నాయని తెలిపారు. బీసీలకు చట్టసభల్లో రిజర్వేషన్లు అంశం 77 ఏళ్ళుగా పెండింగ్ లో ఉందని అన్నారు. రిజర్వేషన్లు ఇవ్వాలనే డిమాండ్ కు కాంగ్రెస్ తరపున మద్దతునిస్తున్నామని తెలిపారు.
తెలంగాణలో బీసీ జనగణన త్వరలోనే జరగబోతుందని తెలిపారు. బీహర్‌లో చేసిన విధానాన్ని అధ్యయనం చేసేందుకు కమిటీ వేశామని, అక్కడికి కమిటీ వెళ్తుందని తెలిపారు. కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రిజర్వేషన్లు తీసుకోస్తామని అన్నారు. రాహుల్ గాంధీ జనాభా దామాషా ప్రకారం రాజకీయంగా, ఆర్థికంగా బీసీలకు హక్కులు కల్పించాలనే ఆలోచనతో ఉన్నారని తెలిపారు. పార్లమెంట్‌లో బిల్లు పెట్టి చట్టపరంగా రిజర్వేషన్లు కల్పిస్తామని మల్లు రవి అన్నారు.