Tuesday, November 26, 2024

విద్య, ఉద్యోగాల్లో బీసీలకు రిజర్వేషన్లు పెంచాలి.. కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రదాన్‌కు ఎంపీ ఆర్.కృష్ణయ్య విజ్ఞప్తి

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ : జనాభా ప్రకారం బీసీ రిజర్వేషన్లను విద్యా, ఉద్యోగవకాశాలు, స్థానిక సంస్థల ఎన్నికలతో పాటు కేంద్రంలో 27 శాతం నుంచి 50 శాతానికి పెంచాలని, చట్టసభల్లోనూ వెనుకబడిన వర్గాల వారికి 50 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ పార్లమెంటులో బిల్లు పెట్టాలని జాతీయ బీసీ సంక్షేమ సంఘ నాయకులు, వైఎస్సార్సీపీ రాజ్యసభ సభ్యులు ఆర్.కృష్ణయ్య డిమాండ్ చేశారు. ఈమేరకు ఆయన బీసీ సంఘాల నాయకులతో కలిసి కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ను కలిసి వినతి పత్రం సమర్పించారు.

రిజర్వేషన్లపై విధించిన గరిష్ట పరిమితి 50 శాతాన్ని సుప్రీంకోర్టు తొలగించడం వల్ల ఎలాంటి న్యాయపర, రాజ్యాంగపరమైన అవరోధాలు లేనందున బీసీ, ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లను జనాభా ప్రకారం పెంచాలని కృష్ణయ్య డిమాండ్ చేశారు. గతంలో వైఎస్సార్సీపీ పార్లమెంట్‌లో బీసీ బిల్లు పెట్టినప్పుడు 14 పార్టీలు మద్దతు తెలిపాయని ఆయన గుర్తు చేశారు. జనగణనలో కుల గణన చేయడంలో ఉన్న అభ్యంతరాలేంటని ఆయన ప్రశ్నించారు. మనదేశంలో 56 శాతం జనాభా కలిగిన బీసీలకు ఇంతవరకు చట్టసభల్లో రిజర్వేషన్లు కల్పించకుండా ఆయా కులాలను అణచివేస్తున్నారని కృష్ణయ్య ఆరోపించారు. బీసీల విద్య, ఉద్యోగ రిజర్వేషన్లపై ఉన్న క్రీమి లేయర్‌ను తొలగించాలని, బీసీలకు ప్రత్యేక మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయాలని ఆయన కోరారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement