న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: దేశంలో కోవిడ్-19 కేసులు పెరుగుతున్న వేళ ఆ మహమ్మారిపై పోరాటంలో పుట్టగొడుగులు సహజసిద్ద యాంటీవైరల్ మందుగా ఉపయోగపడుతుందని పరిశోధనల్లో తేలింది. కేంద్ర శాస్త్ర, సాంకేతిక శాఖ విడుదల చేసిన ఓ ప్రకటనలో ఈ విషయాన్ని వెల్లడించింది. పుట్టగొడుగుల నుంచి సేకరించిన బయో యాక్టివ్ సమ్మేళనాలు కేవలం కోవిడ్-19 మీదనే కాదు, ఇతర వైరస్ ద్వారా వ్యాప్తిచెందే ఇన్ఫెక్షన్లను ఎదుర్కోగల సామర్థ్యాన్ని కలిగి ఉన్నట్టు ఆ పరిశోధన ఫలితాలు చెబుతున్నాయి.
సహజసిద్ధ యాంటీ ఇన్ఫెక్టివ్, యాంటీవైరల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ మరియు యాంటిథ్రాంబోటిక్ మందుగా పుట్టగొడుగుల్లోని బయోయాక్టివ్ అణువులు కోవిడ్‌తో పోరాడగలవని తేల్చింది. 2020లో కోవిడ్-19 మహమ్మారి యావత్ ప్రపంచాన్ని అతలాకుతలం చేసిన సమయంలోనే దాన్ని ఎదుర్కోగల పదార్థాలపై పరిశోధనలు మొదలయ్యాయి. ఈ క్రమంలో రోగనిరోధక శక్తిని పెంచే బయోయాక్టివ్ పదార్థాలపై పరిశోధకులు దృష్టి సారించారు. అత్యంత వేగంగా వైరస్ వ్యాప్తి చెందుతూ కొందరికి ప్రాణాంతకంగా మారుతున్న కరోనా (SARS-CoV-2) వైరస్ నుంచి రక్షణ పొందడానికి, వైరస్ వ్యాప్తిని పరిమితం చేయడానికి రోగనిరోధక శక్తిని పెంచే బయోయాక్టివ్ సమ్మేళనాలపై తీవ్రమైన అధ్యయనాలు జరిగాయి.
ఈ క్రమంలో ప్రకృతిలో సహజసిద్ధంగా లభించే మూలికలు, తినదగిన పుట్టగొడుగుల నుంచి బయోయాక్టివ్ సమ్మేళనాలపై పరిశోధనలు జరపగా.. మార్కెట్లో సులభంగా లభ్యమయ్యే పుట్టగొడుగుల్లో అధిక యాంటీఆక్సిడెంట్లు, పోషక విలువలు, తక్కువ దుష్ప్రభావాలు కలిగి ఉన్నాయని తేలింది. పుట్టగొడుగులు ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన ఆహార వనరుల్లో ఒకటి. భారతదేశంలో ఈశాన్య రాష్ట్రాలు వివిధ రకాల తినదగిన పుట్టగొడుగులకు నిలయంగా ఉన్నాయి. పుట్టగొడుగులకు పెరుగుతున్న ప్రజాదరణ కారణంగా, కోవిడ్-19 మరియు ఇతర వైరల్ ఇన్ఫెక్షన్లకు వ్యతిరేకంగా వచ్చే సమస్యలను తగ్గించడానికి పుట్టగొడుగుల నుండి తినదగిన పుట్టగొడుగులు మరియు సహజ సమ్మేళనాల ప్రాముఖ్యతను విమర్శనాత్మకంగా విశ్లేషించడానికి డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ (DST)కి చెందిన స్వయంప్రతిపత్త సంస్థ IASST పరిశోధనలు జరిపింది.
ఐఎఎస్ఎస్టి డైరెక్టర్ ప్రొఫెసర్ ఆశిస్ కె. ముఖర్జీ నేతృత్వంలోని పరిశోధనా బృందం డాక్టర్ అపరూప్ పాత్ర, డాక్టర్ ఎం. ఆర్. ఖాన్, డాక్టర్ సాగర్ ఆర్. బార్గే, గౌహతిలోని ఐఎఎస్ఎస్టికి చెందిన పరన్ బారుహ్లతో సహా కోవిడ్‌కు వ్యతిరేకంగా ప్రస్తుత చికిత్సల విశ్లేషణను నిర్వహించింది. పరిశోధనల్లో SARS-CoV-2 ఇన్ఫెక్షన్ను నివారించడంలో 13 విభిన్న పుట్టగొడుగుల నుండి ఉత్పన్నమైన బయోయాక్టివ్ సమ్మేళనాలను శాస్త్రవేత్తలు అంచనా వేశారు. ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్, ఇన్ఫ్లమేషన్, సైటోకిన్ తుఫాను, థ్రోంబోటిక్ మరియు కార్డియోవస్కులర్ ఇన్ఫెక్షన్తో సంబంధం ఉన్న పాథోఫిజియాలజీ చికిత్సలో పుట్టగొడుగుల్లో లభ్యమయ్యే సహజసిద్ధ పదార్థాలు ఎంతో ప్రభావవంతంగా పనిచేస్తున్నట్టు గుర్తించారు.
పుట్టగొడుగులలో బయోయాక్టివ్ పాలీశాకరైడ్లు, ఇమ్యునోమోడ్యులేటింగ్, యాంటీవైరల్, యాంటీ బాక్టీరియల్, యాంటీ ఫంగల్ మరియు ఇతర ఔషధ గుణాలున్న సమ్మేళనాలు ఉన్నాయని వారి అధ్యయనం తేల్చింది. SARS-CoV-2కి వ్యతిరేకంగా ఆశాజనకమైన ఫలితాలతో పుట్టగొడుగుల ఆధారిత ఔషధాలను మనుషులపై ప్రయోగిస్తున్నట్టు వెల్లడించింది.
వైరల్ ఇన్ఫెక్షన్లకు వ్యతిరేకంగా తినదగిన పుట్టగొడుగులను ఉపయోగించడం వల్ల కలిగే ప్రధాన ప్రయోజనాల్లో మొదటిది దుష్ప్రభావాలు లేకపోవడం. ఎటువంటి దుష్ప్రభావాలు లేకుండా న్యూట్రాస్యూటికల్ సప్లిమెంట్‌గా వీటిని ఉపయోగించవచ్చు. ఇవి కేవలం ఇన్ఫెక్షన్లను నిరోధించడంలో మాత్రమే కాదు రోగనిరోధక శక్తిని పెంచడంలోనూ ప్రభావవంతగా దోహదపడతాయని పరిశోధకులు పేర్కొంటున్నారు. “జర్నల్ ఆఫ్ ఫంగీ”లోని అధ్యయనం కూడా లోతైన ప్రీ-క్లినికల్ మరియు క్లినికల్ అధ్యయనాల ద్వారా పుట్టగొడుగుల నుండి ఉత్పన్నమైన బయోయాక్టివ్ సమ్మేళనాల పాత్రపై నివేదికలు అందించాయి.