న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: భారత గణతంత్ర దినోత్సవ వేడుకలతో పాటు స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు హాజరవ్వాలనుకునేవారికి జారీ చేసే పాసులు, టికెట్లను ఇక నుంచి డిజిటల్ పద్ధతిలో చేపట్టనున్నట్టు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ప్రభుత్వం ఆహ్వానించే అతిథులకు సైతం ఆన్‌లైన్ ద్వారానే ఆహ్వానాలు పంపనున్నట్టు వెల్లడించింది. ఈ-గవర్నెన్స్‌లో భాగంగా రిపబ్లిక్ డే, స్వాతంత్ర్య దినోత్సవ పెరేడ్ తిలకించే ప్రముఖులకు ఇ-ఆహ్వానాలను అందించడానికి రక్షణ శాఖ సహాయ మంత్రి అజయ్ భట్ శుక్రవారం న్యూఢిల్లీలో ఆన్‌లైన్ ఇన్విటేషన్ మేనేజ్మెంట్ పోర్టల్ (www.aamantran.mod.gov.in)ని ప్రారంభించారు. ఈ వేడుకలను చూసేందుకు వచ్చే సాధారణ ప్రజలకు సైతం టిక్కెట్లను ఈ పోర్టల్ ద్వారా ఆన్‌లైన్లో విక్రయించనున్నారు. ఇన్నాళ్లపాటు రిపబ్లిక్ డే పరేడ్ లేదా స్వాతంత్ర దినోత్సవ వేడుకలు చూడాలనుకునేవారికి ప్రత్యేకంగా ఏర్పాటు కౌంటర్ల ద్వారా టికెట్లను విక్రయించేవారు.
అయితే దేశ రాజధాని ఢిల్లీలో నివసించే ప్రజలతో పాటు చుట్టుపక్కల ప్రజలు మాత్రమే ఈ సదుపాయాన్ని ఉపయోగించుకుని టికెట్లు కొనుక్కుని వేడుకల్లో భాగమవుతున్నారు. సుదూర ప్రాంత ప్రజలు టికెట్ల కోసం రెండు వారాల ముందుగానే ఢిల్లీ చేరుకుని కొనుక్కునే పరిస్థితి ఉండదు. అయితే ప్రజలు ప్రపంచంలో ఎక్కడున్నా సరే ఆన్‌లైన్ ద్వారా టికెట్లు కొని, పరేడ్ వీక్షించేందుకు ఢిల్లీ చేరుకునే అవకాశం ఈ డిజిటల్ పోర్టల్ అందజేస్తుందని కేంద్రం తెలిపింది. సామాన్య ప్రజలు ఆన్‌లైన్‌లో టిక్కెట్‌లను కొనుగోలు చేసే సదుపాయంతో పాటు ప్రముఖులకు, వారి అతిథులకు ఆన్‌లైన్ పాస్‌లను జారీ చేసే సదుపాయాన్ని సైతం పోర్టల్ అందిస్తుంది.
ఈ సందర్భంగా కేంద్ర మంత్రి అజయ్ భట్ మాట్లాడుతూ, ఈ పోర్టల్ ‘డిజిటల్ ఇండియా’ ప్రక్రియలో మరో మైలురాయి అని, సులభ, సమర్థవంతమైన, ఆర్థిక, పర్యావరణ అనుకూల పాలనను ప్రోత్సహించే ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఈ-గవర్నెన్స్ లో భాగంగా ఈ విధానాన్ని అందుబాటులోకి తీసుకొచ్చారని వెల్లడించారు. ప్రతి పౌరుడికి జీవన సౌలభ్యం కల్పించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని, ‘డిజిటల్ ఇండియా’, ‘కనీస ప్రభుత్వం, గరిష్ట పాలన’ నినాదాలతో ప్రభుత్వాన్ని, ప్రజలను ఏకతాటిపైకి తీసుకువస్తున్నాయని ఆయన పేర్కొన్నారు. రిపబ్లిక్ డే వేడుకల కోసం ప్రజలు టిక్కెట్లు కొనుగోలు చేయడాన్ని ఈ పోర్టల్ సులభతరం చేస్తుందని, ప్రింటింగ్‌లో ఉపయోగించే పెద్ద మొత్తంలో కాగితాన్ని ఆదా చేస్తుందని రక్షణ శాఖ మంత్రి ప్రశంసించారు. పోర్టల్ వేడుకలను మరింత సురక్షితంగా మారుస్తుందని ఆయన అన్నారు.
ఆమంత్రన్ పోర్టల్ ప్రత్యేకతలు:
* మెరుగైన భద్రత కోసం క్యూఆర్ కోడ్ ఆధారిత ప్రమాణీకరణ.
* ఈ-మెయిల్/ఎస్ఎంఎస్ ద్వారా పాస్‌లు, టికెట్‌ల డిజిటల్ డెలివరీ.
* రద్దు చేయలేని, బదిలీ చేయలేని టిక్కెట్లు.
* ఆహ్వానితుల నుండి ఆమోదం పొందేందుకు పాస్‌ల కోసం ఆర్ఎస్వీపీ ఎంపిక
* భవిష్యత్ ఈవెంట్‌ల మెరుగైన నిర్వహణ కోసం ఈవెంట్ డేటా విశ్లేషణ
పోర్టల్ ద్వారా ఈ-ఆహ్వానాలను అందించడంతో పాటు, టిక్కెట్ల కొనుగోలు కోసం బూత్‌లు, కౌంటర్లను ఈ క్రింది ప్రదేశాలలో ఏర్పాటు చేయనున్నారు.
సేన భవన్ (గేట్ నెం 2)
శాస్త్రి భవన్ (గేట్ నెం 3)
జంతర్ మంతర్ (మెయిన్ గేట్ దగ్గర)
ప్రగతి మైదాన్ (గేట్ నెం 1)
పార్లమెంట్ హౌస్ (రిసెప్షన్ ఆఫీస్) – ఎంపీల కోసం ప్రత్యేక కౌంటర్ (18.01.2023న తెరుస్తారు)
సమయాలు మధ్యాహ్నం (1000 గంటల నుండి 1230 గంటల వరకు), మధ్యాహ్నం (1400 గంటల నుండి 1630 గంటల వరకు) ఉంటాయి.