రాజధాని ఢిల్లీలో గణతంత్ర వేడుకలు ఘనంగా నిర్వహించారు.. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము జాతీయ జెండా ఎగరేశారు. ఆ తర్వాత త్రివిద దళాల గౌరవ వందనాన్ని స్వీకరించారు. ఆ తర్వాత శకటాల ప్రదర్శన ప్రారంభమైంది. . ఈ సారి జాతీయ మహిళా శక్తితోపాటు ప్రజాస్వామిక విలువలు ప్రతిబింబించేలా వేడుకలు నిర్వహించారు
. ‘ఆవాహన్’తో పరేడ్‌ను మొదలుపెట్టారు. ఇందులో 100 మంది మహిళలు భారతీయ సంగీతాన్ని వినిపించారు. అందులో సంప్రదాయ బ్యాండ్‌కు బదులుగా శంఖం, నాదస్వరం, నగారాతో ప్రదర్శన ఇచ్చారు.
ఈ సారి గణతంత్ర వేడుకలకు ముఖ్య అతిథిగా ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయెల్ మ్యాక్రన్ విచ్చేశారు. గణతంత్ర దినోత్సవాల్లో భాగంగా కర్తవ్యపథ్‌లో పరేడ్‌లో శకటాల ప్రదర్శన జరిగింది. పలు రాష్ట్రాల నుంచి శకటాలు పరేడ్ చేశాయి. ఇందులో భాగంగా ఉత్తరప్రదేశ్ నుంచి వచ్చిన శకటం అందరినీ ఆకర్షించింది. ఈ శకటం బాలరాముడిని ప్రదర్శించింది.
ఇక నాలుగు ఎంఐ-17వి హెలికాప్టర్లు ధ్వజ్ ఆకృతిలో విన్యాసాలు ప్రదర్శించాయి. ఈసారి పరేడ్‌లో 90 మంది సభ్యుల ఫ్రాన్స్ దళం కూడా పాల్గొంది. ఫ్రెంచ్ దళం ప్రదర్శన సమయంలో రఫేల్ యుద్ధ విమానాలు గగనతలంలో విన్యాసాలు చేశాయి.
మహిళా అధికారులు దీప్తి రాణా, ప్రియాంకా సేవ్‌దా.. ఆయుధ లొకేషన్ గుర్తింపు రాడార్, పినాక రాకెట్ వ్యవస్థలకు నేతృత్వం వహించారు. చరిత్రలో తొలిసారిగా అందరూ మహిళలే సభ్యులుగా ఉన్న త్రివిధ దళాలు పాల్గొన్నాయి. ఇందులో అగ్నివీర్‌లు కూడా ఉన్నారు.
ఆత్మనిర్భరత, నారీశక్తి థీమ్‌తో నౌకాదళ శకటం ఆకట్టుకుంది. ఐఎన్‌ఎస్ విక్రాంత్‌తో పాటు, శివాళిక్, కలవరి క్లాస్ సబ్‌మెరైన్లను ప్రదర్శించారు. దేశీయంగా తయారుచేసిన ఆయుధాలతో పాటు క్షిపణులు, డ్రోన్ జామర్లు, నిఘా వ్యవస్థలు, వాహనాలపై అమర్చే మోటార్లు, బీఎంపీ-2 సాయుధ శకటాలను ప్రదర్శించారు. ఎయిర్‌ఫోర్స్ మార్చ్‌కు స్క్వాడ్రన్ లీడర్లు రష్మీ ఠాకుర్, సుమితా యాదవ్, ప్రతిథి అహ్లువాలియా, ఫ్లైట్ లెఫ్టినెంట్ కిరిట్ రొహైల్ నేతృత్వం వహించారు. 260 మంది సీఆర్‌పీఎఫ్, బీఎస్‌ఎఫ్, ఎస్‌ఎస్‌బీ మహిళా సైనికులు ‘నారీ శక్తి’ పేరుతో విన్యాసాలు చేశారు. తొలిసారి బీఎస్‌ఎఫ్ మహిళా బ్రాస్ బ్యాండ్ ఈ పరేడ్‌లో పాల్గొంది. 300 ఏళ్ల బాంబే శాపర్స్ రెజిమెంట్ చరిత్రలో తొలిసారిగా అందరూ పురుషులే ఉన్న బృందానికి ఒక మహిళ నాయకత్వం వహించారు. 31 ఏళ్ల మేజర్ దివ్య త్యాగికి ఈ అవకాశం దక్కింది.
ఈ ఏడాది ప్రధానమంత్రి రాష్ట్రీయ బాల పురస్కారాలు అందుకున్న 19 మంది పరేడ్‌లో పాల్గొన్నారు. రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు చెందిన 16 శకటాలు పరేడ్‌లో పాల్గొన్నాయి. ఇందులో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ శకటాలున్నాయి. వీటితోపాటు సామాజిక-ఆర్థిక కార్యకలాపాలు, శాస్త్ర సాంకేతిక రంగానికి చెందిన మహిళలు ప్రదర్శించిన 10 శకటాలు ఆకట్టుకున్నాయి.