రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్బీఐ) ద్రవ్య పరపతి కమిటీ డిసెంబర్ 5-7తేదీల్లో నిర్వహించే సమీక్షలో రెపోరేటును 35 బేసిస్ పాయింట్ల వరకు పెంచ్చవచ్చని ఆర్ధిక నిపుణులు అంచనా వేస్తున్నారు. అక్టోబర్లో రిటైల్ ద్రవ్యోల్బణం స్వల్పంగా తగ్గినందున రెపోరేట్ల పెంపులో ఆర్బీఐ నెమ్మదించే అవకాశం ఉందని వీరు విశ్లేషిస్తున్నారు. మొత్తం 15 అంచనాల్లో అత్యధికులు 35 బేసిస్ పాయింట్ల పెంపుదలను అంచనా వేశారు. ఇద్దరు మాత్రం 50 బేసిస్ పాయింట్ల వరకు పెంచే అవకాశం ఉందని అంచనా వేశారు. ఈ ఏడాది మే నుంచి ఆర్బీఐ కీలక రెపోరేటును 190 బేసిస్ పాయింట్లు పెంచి 5.90 శాతం చేసింది.
అక్టోబర్లో రిటైల్ ద్రవ్యోల్బణం 6.77 శాతానికి చేరింది. ఈ ఏడాది జనవరి నుంచి చూస్తే వరసగా 10వ నెలా ఆర్బీఐ లక్ష్యమైన 2-6 శాతం ఎగువనే ఇది కొనసాగుతోంది. జనవరి-మార్చిలో రిటైల్ ద్రవ్యోల్బణం సగటు 6.3 శాతం ఉంది. ఏప్రిల్-జూన్లో ఇది 7.3 శాతం, జులై-సెప్టెంబర్లో 7 శాతంగా నమోదైంది. ప్రస్తుతం దేశీయ ద్రవ్యోల్బణం స్వల్పంగా తగ్గింది. అమెరికా ద్రవ్యోల్బణం సైతం గరిష్టాల నుంచి తగ్గింది. దీంతో డిసెంబర్లో ఆర్బీఐ రెపోరేటును 0.35 శాతం పెంచి 6.25 శాతం చేసే అవకాశం ఉంది. గత వడ్డీ రేట్ల పెంపుదల ప్రభావం, నగదు లభ్యతను కఠినతరం చేయడం, అంతర్జాతీయ పరిస్థితులు ఈ సారి పరిగణనలోకి తీసుకోవచ్చని కోటక్ ఇన్స్టిట్యూషనల్ ఈక్విటీస్ సీని యర్ ఆర్థికవేత్త సువోదీప్ రక్షిత్ అభిప్రాయపడ్డారు.
వచ్చే కొన్ని నెలల పాటు కూడా రిటైల్ ద్రవ్యోల్బణం 6 శాతంపైనే కొనసాగవచ్చని, 2023 ఫిబ్రవరికి 6 శాతానికి, మార్చికి 5 శాతానికి చేరవచ్చని అంచనా వేశారు. ఆహార వస్తువులపై ధరల ఒత్తిడి కొనసాగుతోంది, దేశీయ, అంతర్జాతీయ కారణాల ప్రభావం వీటిపై చూపుతున్నట్లు క్వాంట్ఎకో రీసెర్చ్ పేర్కొంది. స్వల్ప కాలంలో ద్రవ్యోల్బణం అధిక స్థాయిల్లోనే కొనసాగవచ్చని తెలిపింది. డిసెంబర్లో 35 బేసిస్ పాయింట్లు, 2023 ఫిబ్రవరిలో 25 బేసిస్ పాయింట్లు మేర రెపోరేటు పెంపుదల ఉండవచ్చని అంచనా వేసింది.