అమరావతి, ఆంధ్రప్రభ: రాష్ట్రంలోని నాలుగు రాజీవ్‌గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జ్ టెక్నాలజీస్ (ట్రిపుల్ ఐటీ)ల్లో అడ్మిషన్ల భర్తీకి పాత విధానాన్నే అనుసరించనున్నట్లు తెలుస్తోంది. 2009లో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి గ్రామీణ ప్రాంత విద్యార్థుల కోసం ఇంటర్ ప్లస్ ఇంజనీరింగ్ కలిపి ట్రిపుల్ ఐటీలను తన మానస పుత్రికలుగా ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో కృష్ణా జిల్లా నూజివీడు, కడప జిల్లా ఇడుపులపాయ(ఆర్కే వ్యాలీ), బాసరల్లో ట్రిపుల్ ఐటీలను ఏర్పాటు చేశారు. ఒక్కో ట్రిపుల్ ఐటీలో 1100 మంది విద్యార్థులకు ఏటా ప్రవేశాలు కల్పించేవారు. ట్రిపుల్ ఐటీ కోర్సుకు వస్తున్న డిమాండ్, వాటిలో చదివిన విద్యార్థులకు మంచి ప్లేస్మెంట్లు వస్తుండటంతో మరిన్ని కళాశాలల ఏర్పాటుకు విజ్ఞప్తులు వచ్చాయి. దీంతో ఒంగోలు, శ్రీకాకుళంలలో మరో రెండు ట్రిపుల్ ఐటీలను ఏర్పాటు చేయడంతో రాష్ట్రంలో మొత్తం 4 క్యాంపస్‌లు అందుబాటులోకి వచ్చాయి. వీటిలో ఏటా మొత్తం 4400 మంది చేరుతున్నారు. ఆరేళ్ల కోర్సు కావడంతో ఒక్కో క్యాంపస్‌లో విద్యార్థులతోపాటు బోధనా, బోధనేతర సిబ్బంది కలిపి దాదాపు పది వేల మంది వరకు ఉంటారు. ట్రిపుల్ ఐటీలను ఏర్పాటు చేసిన నాటి నుంచి ఏటా గ్రామీణ ప్రాంత పేద విద్యార్థులను మెరిట్ ప్రాతిపదికన ఎంపిక చేస్తున్న పద్ధతి కొనసాగుతోంది. వీటిలో రిజర్వేషన్లతోపాటు మొదట గ్రామీణ ప్రాంత ప్రభుత్వ పాఠశాలలు, బాలికలు, తర్వాత పట్టణ ప్రాంత, ఆ తర్వాత ప్రైవేట్ విద్యాసంస్థల విద్యార్థులకు సీట్ల కేటాయింపు జరుగుతుండేది.
కరోనా నేపథ్యంలో ప్రత్యేక సెట్..
గత రెండు సంవత్సరాలు కరోనా కారణంగా లాక్డౌన్, కర్ఫ్యూలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేసిన విషయం తెలిసిందే. అలాగే వైరస్ వ్యాప్తిని నిరోధించేందుకు విద్యాసంస్థలకు సుదీర్ఘకాలంపాటు సెలవులు ప్రకటించడంతోపాటు పదో తరగతి, ఇంటర్మీడియట్ పరీక్షలనూ రద్దు చేయడం జరిగింది. అలాగే అంతర్గత పరీక్షల ఆధారంగా విద్యార్థులను పాస్ చేసి, తదుపరి తరగతుల్లోకి ప్రమోట్ చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీంతో పదో తరగతి వార్షిక పరీక్షల్లో వచ్చిన మార్కుల ఆధారంగా సీట్ల కేటాయింపు జరిపే ట్రిపుల్ ఐటీల్లో అడ్మిషన్ల విషయంలో సమస్య ఎదురైంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ప్రత్యేకంగా జీవో విడుదల చేసి ట్రిపుల్ ఐటీ ప్రవేశాల కోసం ప్రవేశ పరీక్షను నిర్వహించాలని నిర్ణయించింది. గత రెండేళ్లుగా ట్రిపుల్ ఐటీ సెట్ ర్యాంకుల ఆధారంగానే సీట్ల భర్తీ నిర్వహిస్తున్నారు. ఇదిలా ఉంటే కరోనా తగ్గుముఖం పట్టడంతోపాటు ఈ విద్యా సంవత్సరంలో తరగతులు దాదాపుగా పూర్తి స్థాయిలో నిర్వహించడంతోపాటు పదో తరగతి పరీక్షలనూ నిర్వహించారు.
పది ఫలితాల ఆధారంగానే..
ఈ ఏడాది పదో తరగతి పరీక్షలు నిర్వహించడంతో ట్రిపుల్ ఐటీ కళాశాలల్లో సీట్ల భర్తీ కోసం సెట్ నిర్వహించాల్సిన అవసరం లేదు. దీంతో రెండేళ్ల ముందు వరకు సీట్ల భర్తీ కోసం అనుసరించిన విధానాన్నే ఇక నుంచి కొనసాగించాలని ప్రభుత్వం భావిస్తోంది. పదో తరగతి పరీక్షల స్పాట్ వాల్యుయేషన్ కూడా ప్రారంభం కావడంతో.. ఫలితాలు విడుదలైన తర్వాత నోటిఫికేషన్ విడుదల చేయాలని నిర్ణయించినట్లు సమాచారం.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి..